మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ'” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం. పదవీకాలం ఇంకా సగం కూడా పూర్తికాక మునుపే, ఇక ఇదే ఆఖరుసారి అని చెప్పడం ఏమన్నా ప్రయోజనాలు ఆశించి చేసిన ప్రకటనేమో అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. రెండో సారి అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే రెండు సార్లు పునర్వ్యవస్ధీకరణ జరిపిన ప్రధాని మరో మూడు సంవత్సరాల పాటు మార్పులు లేకుండా పాలన కొనసాగించడమంటే మాటలు కాదు.
డి.ఎం.కె పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎ.రాజా, దయానిధి మారన్ లు రాజీనామా చేసిన దృష్ట్యా వారి ఖాళీలు అట్టే పెట్టడానికి నిర్ణయించినట్లుగా ప్రధాని తెలిపాడు. వారి ఖాళీలు అట్టే పెట్టడం “కూటమి ధర్మం” అని ప్రధాని చెప్పాడు. డి.ఎం.కే జులై 23 తేదీన పార్టీ సమావేశం జరపనున్నదనీ, ఆ సమావేశంలో మంత్రులుగా ఎవరిని నియమించాలో నిర్ణయిస్తారని తెలుస్తోంది. “వివిధ రాష్ట్రాల మధ్య సమతూకాన్ని పాటించవలసిన అగత్యాన్నీ, సామర్ధ్యాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రుల బృందాన్ని నియమించుకున్నట్లు ఆయన తెలిపాడు. సాధ్యమైనంత సమగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాననీ తెలిపాడు. కీలకమైన పర్యావరణ శాఖనుండి జైరాం రమేష్ ను తొలగించడం పట్ల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన “ఆయనకు మరింత బాధ్యత గలిగన శాఖను అప్పగించాం. కొత్త శాఖలో ఆయన సేవలు మరింత అవసరం” అని ముక్తాయించాడు. జైరాం రమేష్ ను తొలగించామన్న అర్ధం రాకుండా కేబినెట్ కి ప్రమోట్ చేయడం ద్వారా విమర్శలకు ముందే సమాధానం ఇచ్చినట్లు భావించవచ్చు.
రాహుల్ గాంధీని చాలా సార్లు మంత్రివర్గంలో చేరమని కోరినప్పటికీ తనకు సంస్ధ భాధ్యతలు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పాడని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రధాని చెప్పాడు. భారత దేశానికి అందరి కంటె ఎక్కువగా సంపదలను అందిస్తున్న రైతుల సమస్యలను అర్ధం చేసుకోవడానికి రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా ప్రయత్నించాడని ప్రధాని ఓ సర్టిఫికేట్ పడేశాడు. రైతులు దేశంలో ముఖ్య భాగమని చెప్పిన ప్రధాని ఆ రైతుల పొట్టగొడుతూ విదేశీ బహుళజాతి సంస్ధలకు వారి భూములను అప్పజెప్పడం ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నదీ వివరించి ఉంటే బాగుండేది. ఆయన మాటలు నిజాయితీతో కూడినవి కావని ప్రధాని ప్రాధామ్యాలను బట్టి ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణ శాఖ నుండి జైరాం రమేష్ ను తప్పించడం ద్వారా విదేశీ పెట్టుబడులకు ప్రధాని పెద్ద మేలే చేశాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో రెండో సారి అధికారం లోకి వచ్చాక దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సబితా ఇంద్రా రెడ్డిని హోం మంత్రిగా నియమించి హోం శాఖను తన ఆధీనంలో ఉంచుకోగలిగాడు. ఇప్పుడు ప్రధాని మన్మోహన్ కూడా పర్యావరణ శాఖకు జయంతి నటరాజన్‌ను నియమించి కీలకమైన “పర్యావరణం, అడవులు” శాఖను తన కనుసన్నల్లో ఉంచుకోబోతున్నాడని చెప్పవచ్చు.
