తమిళనాడులోని మిలట్రీ నివాస సముదాయం వద్ద బాదం కాయకోసం చెట్టెక్కుతున్న 13 సంవత్సరాల బాలుడు దిల్షాన్‌ను తుపాకితో కాల్చి హత్య చేసిన కేసులో సి.బి-సి.ఐ.డి విభాగం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసింది. బాలుడిపై కాల్పులు జరిపింది తానేనని ఆయన అంగీకరించినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన రోజున మిలట్రీ నివాస సముదాయం వద్ద సాయుధ సెక్యూరిటీ గార్డులను తాము నియమించలేదని ఆర్మి అధికారులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేసును సీరియస్‌గా తీసుకోవడంతో కేసులో పురోగతి సాధ్యమయ్యిందని చెప్పుకోవచ్చు. జయలలిత మొదటి నుండి బాలుడిపై కాల్పులు జరిపిన మిలట్రీ వ్యక్తులను తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ వచ్చింది.
జులై 3 తేదీన దిల్షాన్ తన ఇద్దరు మిత్రులతో కలిసి చెన్నైలోని సైనిక నివాస సముదాయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. బాల కార్మికునిగా పని చేస్తున్న దిల్షాన్ ఆదివారం సెలవరోజు కావడంతో ఆడుతూ అటుగా వచ్చి కాంప్లెక్స్ లోపల ఉన్న బాదం కాయ కోయాలని భావించి గోడ దూకాడు. చెట్టెక్కుతుండగా సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపారని అప్పట్లో పత్రికలు రాశాయి. ఐతే మిలట్రీ అధికారులు మాత్రం తాము సాయుధ గార్డులెవ్వరినీ కాపలాగా నియమించలేదని చెబుతూ వచ్చారు. బులెట్ గాయంతోనే బాలుడు చనిపోయాడని పోస్ట్‌మార్టంలో తేలడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిలట్రీకి చెందిన తమ మనుషులను వారు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి రామరాజ్ అనే 58 సంవత్సరాల రిటైర్డ్ అధికారి కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
కందస్వామి రామరాజ్ ఫ్లాగ్‌స్టాఫ్ హౌస్ రోడ్ లో గల మిలట్రీ నివాస సముదాయంలో నివాసం ఉంటున్నాడు. ఆయన తన వ్యక్తిగత రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 2008 లో ఆయన తన రైఫిల్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా రెన్యువల్ కాలేదని తెలుస్తోంది. రామరాజ్ తన రైఫిల్‌తో దిల్షాన్‌పై కాల్పులు జరిపాడని సి.బి-సి.ఐ.డి అధీకారులు తెలిపారు. కణతలో తగిలిన బులెట్ గాయంతో కొన్ని గంటలపాటు మృత్యువుతో పోరాడి బాలుడు చనిపోయాడు. ఘటన జరిగిన రోజు రాత్రే రామరాజ్ తన ఆయుధాన్ని కౌము నదిలో పారేసాడని సి.ఐ.డి అధికారులు తెలిపారు. తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా దిల్షాన్‌ని చూసిన రామరాజ్ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు అంగీకరించాడని వారు తెలిపారు.
ఫైర్ సర్వీసు వారి సాయంతో దర్యాప్తు అధీకారులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. జార్జి టౌన్ కోర్టులో రామరాజ్ ను హాజరు పరిచినట్లు అధికారులు తెలిపారు. గతంలో కూడా దిల్షాన్ అనేక సార్లు బాదం కాయల చెట్టు ఎక్కి కాయలను కోయడానికి ప్రయత్నించాడనీ, రామరాజ్ బాలుడిని అనేక సార్లు తీవ్రంగా హెచ్చరించాడనీ తెలుస్తోంది. ఎంత హెచ్చరించినప్పటికీ కేవలం కాయ కోసుకున్నందుకే బాలుడిపై కాల్పులు జరపడం గర్హనీయం. నియంత్రణ లేనివారి చేతిలో తుపాకి చివరికి ఇలాంటి పరిణామలకే దారితీస్తుంది. అదివారం గిండిలో పత్రికా సమావేశం నిర్వహించిన అడిషనల్ డిజిపి ఆర్. శేకర్, ఈ కేసు దర్యాప్తు పెద్ద సవాలుగా నిలిచిందని తెలిపాడు. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ఇతర రంగాల నిపుణుల సాయం తీసుకుని కేసు ఛేదించగలిగామని ఆయన తెలిపాడు.

మీరు వ్రాసే ప్రతీ వార్త, సాదాసీదా బ్లాగరుకూడా అర్థం చేసుకునేవిథంగా ఉంటోంది.
అవునాండి? ధన్యవాదాలు.
Army persons have proved themselves that they are senseless people