చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు


A cargo ship at t he Tianjin port in China

చైనాలోని తియాన్‌జిన్ ఓడ రేవులో ఒక సరుకుల రవాణా నౌక

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది 19.3 శాతానికి పడిపోయింది. ఎగుమతులు రికార్డు స్ధాయిలో 161.9 నమోదైనప్పటికీ ఎగుమతుల వృద్ధి రేటు మే లో 19.4 శాతం ఉండగా అది జూన్ నెలలో 17.9 శాతానికి పడిపోయింది. యూరప్ అప్పు సంక్షోభం, అమెరికాలో నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి దీనికి కారణాలని తెలుస్తోంది.

అమెరికాలో నిరుద్యోగం, కొత్త ఉద్యోగాల కల్పన పడిపోవడం వలన డిమాండ్ పడిపోయింది. యూరప్ లో ప్రభుత్వాలు ప్రజలపై అమానుషమైన పొదుపు విధానాలను అమలు చేస్తుండండంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి అక్కడ కూడా డిమాండ్ నెమ్మదించింది. దానితో ఈ రెండు ప్రాంతాలకు ప్రధానంగా ఎగుమతులు చేసే చైనా, డిమాండ్ లేక ఉత్పత్తులను తగ్గించింది. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడికి చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో క్రెడిట్ సౌకర్యం తగ్గిపోయింది. రుణాలు అందుబాటులో లేక ఫ్యాక్టరీల యంత్ర భాగాలు, ఇనుప ఖనిజం తదితర దిగుమతులపై చైనాలో డిమాండ్ తగ్గిపోయింది. అమెరికా, ఇ.యులు కష్టకాలంలో ఉన్నందున చైనా ఆర్ధికవృద్ధిపైనే గ్లోబల్ రికవరీకి సంబంధించిన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడది ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్నారు.

మొదటి క్వార్టర్ లో చైనా 9.7 శాతం జిడిపి వృద్ధి రేటు నమోదు చేసింది. ఇచి చైనా ఆర్ధిక వ్యవస్ధ అతిగా వేడెక్కిందని చైనా భావిస్తున్నది. అందువలన జిడిపి వృద్ధి రేటు నిర్వహణా పరిధికి పరిమితి చేయలన్న తలంపుతో చైనా ఉన్నదని అధికారుల ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగానే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడికోసం కూడా గత అక్టోబరు నెలనుండి ఇప్పటివరకూ వడ్డీ రేట్లను చైనా సెంట్రలో బ్యాంకు ఐదు సార్లు పెంచింది. చైనా క్రమంగా తన కరెన్సీ యువాన్ విలువను పెంచుతున్నప్పటికీ చైనా దిగుమతులలో పెరుగుదల గానీ ఎగుమతులలో తరుగుదల గానీ పెద్దగా సంభవించడం లేదు.

చైనాతో వాణిజ్య లోటును తగించదానికి వీలుగా అమెరికా, ఇ.యులు యువాన్ విలువ పెరగడానికి అనుమతించాలని చైనాపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా అందుకు అంగీకరించి యువాన్ విలువ మెల్లగా పెరగడానికి అంగీకరించింది. ఐనా అది చైనా వాణిజ్య మిగులును తగ్గించడానికి ఉపయోగపడ్డం లేదు. 2011లో కూడా చైనా వాణిజ్య మిగులు 160 నుండి 200 బిలియన్ల డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

జూన్ నెలలో చైనా చేసే అమెరికా సరుకుల కోనుగోలు 11 శాతం తగ్గిపోయాయి. ఫలితంగా చైనా వాణిజ్య మిగులు 20.9 శాతం పెరిగి 19.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే యూరప్ సరుకుల కోనుగూలు 6 శాతం పడిపోయింది. ఫలితంగా ఇ.యుతో చైనా వాణిజ్య మిగులు 19.8 శాతం పెరిగి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

వ్యాఖ్యానించండి