జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన పాత్ర పోషిస్తున్నది కనుక చైనా ఆర్ధిక వృద్ధి రేటు తగ్గితే అది ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటుపైనే ప్రభావం చూపించగలదని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే చైనా ద్రవ్యోల్బణం అనుకున్నదాని కంటె ముందే ఉచ్ఛ (పీక్) స్ధాయికి చేరుకుంటున్నదనీ, కనుక ఆ తర్వాత ద్రవ్యోల్బణం తగ్గుతుందే తప్ప పెరగబోదనీ, ఆ దృష్ట్యా చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు బలహీనంగానే ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు.
చైనా వినియోగ ధరల సూచి, గత సంవత్సరం జూన్ నెలతో పోలిస్తే ఈ జూన్ నెలలో 6.4 శాతం పెరిగింది. ఇది ఆర్ధికవేత్తల అంచనా 6.3 శాతం కంటే కొద్దిగా ఎక్కువే. పైగా గత మూడు సంవత్సరాలలో అత్యధికం కూడా. మే నెలలో 5.5 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం జూన్ నెలలో 6.4 శాతానికి చేరుకుంది. ఆహారం, వినియోగ సరుకులు, ఆస్తుల ధరలు బాగా పెరగడంతో వినియోగధరల సూచిలో ఈ పెరుగుదల సంభవించింది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలలో పంది మాంసం ధరలు అధిక ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఉత్పత్తి తగ్గిపోవడంతో మాంసం ధరలు 57 శాతం పెరగడంతో, మాంసం ధరలే వినియోగ ధరల సూచిని 1.4 శాతం పెంచిందని రాయిటర్స్ తెలిపింది. ఈ ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని కూడా మాంసం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దానితో పాటు గుడ్లు ధర 23 శాతం పెరిగిందనీ, మాంసం గ్రుడ్ల ధరలు ఆహార ద్రవ్యోల్బణం 14 శాతం చేరుకోవడానికి తోడ్పడ్డాయని తెలుస్తోంది. ఈ ధరలు చైనాలో పేదవారికి ఆహరం మరింత దూరం చేస్తాయి.
ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సార్లు సెంట్రల బ్యాంకు వడ్డీ రేట్లు పెంచిన చైనా చివరి క్వార్టర్ లో మరొకసారి వడ్డీ రేటు పెంచవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల క్రితమే చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు పెంచింది. చైనా ద్రవ్యోల్బణం రేటుపై ఈ మద్య కాలంలో ప్రపంచ ఆర్ధిక నిపుణుల కేంద్రీకరణ పెరిగింది. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో అందరి దృష్టీ ప్రపంచ ఆర్ధిక వృద్ధికి ప్రధానంగా భాగస్వామ్యం వహిస్తున్న చైనాపై దృష్టి సారించారు. చైనా ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు పెంపులపై దృష్టి కేంద్రీకరించారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ కూడా ద్రవ్యోల్బణం వలనా, తద్వారా జరిగే వడ్డీ రేట్ల పెంపుదలవలనా నెమ్మదిగా వృద్ధి చెందవచ్చని విశ్లేషకులు మార్కెట్ చోదకులు భావిస్తున్నారు. ఐతే చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం అనేది చాలా తక్కువ స్దాయిలోనే ఉన్నదనీ ఎంత నెమ్మదించినా అది 9 శాతం పైగా జిడిపి వృద్ధి రేటు సాధించడం ఖాయమని భరోసా ఇస్తున్నవారూ లేకపోలేదు.
చైనా ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే వడ్డీ రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయి. అంటే ద్రవ్యోల్బణంతో సర్ధుబాటు చేసిన తర్వాత వడ్డీ రేట్లు ఇంకా మైనస్ లోనే ఉన్నాయని అర్ధం. కనుక ప్రతికూల ప్రభావాలు పడకుండానే చైనా మరింతగా వడ్డీ రేట్లు పెంచడానికి తగిన సౌకర్యం ఉందనీ, కనుక ఆందోళన చెందవలసిన పరిస్ధితి లేదనీ కొందరి భరోసా. ఐతే ఇది మదుపరులు తమ డబ్బుని బ్యాంకుల్లో ఉంచడానికి బదులు ప్రాపర్టీ లాంటి మార్కెట్లలో మదుపు చేయడానికి ఆసక్తి చూపుతారనీ తద్వారా మరింత డబ్బు మార్కెట్లోకి విదుదలై ద్రవ్యోల్బణంపై ఊర్ధ్వ దిశలో ఒత్తిడి పెరగవచ్చనీ కూడా భావిస్తున్నారు. మార్కెట్ లో నెలకొని ఉండే ఈ పరిస్ధితులన్నింటి ఉమ్మడి ప్రభావం ఏ దిశలో ఉండబోతున్నదానిపైనే విశ్లేషకుల అంచనాల ఫలితం ఆధారపడి ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
రాయిటర్స్ సర్వే ప్రకారం కొద్ది మెజారిటీతో మాత్రమే మార్కెట్ విశ్లేషకులు ఈ సంవత్సరంలో చైనా మరొకసారి వడ్డీ రేట్లు పెంచవచ్చని భావిస్తున్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. 2012 జూన్ వరకు వడ్డీ రేట్లను స్ధిరంగా కొనసాగించడం ప్రారంభించే లోగా మరొక పెంపుదల జరుగుతుందా లేదా అన్నదానిపై ఈ సర్వే జరిగింది. చైనా ద్రవ్యోల్బణం ఆహారం, ఇంధనంతో పాటు ఇతర సరుకుల్లోకి కూడా విస్తరించడం కొంత ఆందోళన కలిగించే అంశం. కానీ ప్రపంచ ఆయిల్ ధరలు మే 2 తర్వాత 17 శాతం తగ్గినందున చైనా ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు ఆశిస్తున్నారు. అమెరికా ఉద్యోగాల కల్పన మరింతగా తగ్గడంతో చైనా సెంట్రల్ బ్యాంకుకు సమయం దొరికినట్లేనని వీరు భావిస్తున్నారు.
చైనా ద్రవ్యోల్బణం తగ్గనుందనడానికి కొన్ని సూచనలైనా కనిపిస్తున్నప్పటికీ ఇండియా ద్రవ్యోల్బణం తగ్గనుందనడానికి మాత్రం సూచనలేవీ కనపడకపోవడం గమనార్హం.

