సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్


Iran testfires two long range missles in Indian Ocean

ఇరాన్ మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి సుధీర్ఘలక్ష్య క్షిపణి ప్రయోగించి చూసింది

ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు పేల్చాము” అని రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన ఏరోస్పేస్ డివిజన్ అధిపతి అమీర్ ఆలి హాజిజాదే ఒక పత్రికా సమావేశంలో ప్రకటించాడు. ఈ సమావేశంలోని కొంత భాగాన్ని టెలివిజన్ లో చూపారు.

ఇరాన్ సాధారణంగా మధ్య ఇరాన్‌లో గల విస్తారమైన ఎడారిలో తన మిసైళ్ళను పరీక్షిస్తుంది. అందువలన హిందూ మహాసముద్రంలో ఇరాన్, మిసైళ్ళను పరీక్షించి చూడడం అరుదైన విషయమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తన దేశ సరిహద్దులను దాటి మిసైళ్ళను పేల్చగల సత్తా తనకు ఉందని నిరూపించుకోవడానికి ఇరాన్ హిందూ మహాసముద్రంలో క్షిపణులను పరీక్షించడానికి నిర్ణయించుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షిపణిని ప్రయోగిస్తున్నట్లుగా టెలివిజన్ చూపింది తప్ప ప్రకటన చేస్తున్నవారు అది హిందూ మహా సముద్రంలోకే ప్రయోగిస్తున్న మిసైల్ గా చెప్పలేదనీ, ప్రయోగించిన మిసైల్ హిందు మహాసముద్రంలోని లక్ష్యాన్ని తాకుతున్నట్లుగా కూడా చెప్పలేదనీ రాయిటర్స్ తెలిపింది.

ఎలైట్ గార్డుల పది రోజుల మిలట్రీ విన్యాసాలు పూర్తయిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్ధావరాలను, ఇజ్రాయెల్ దేశాన్ని లక్ష్యంగా చేసుకోగల సత్తా తనకు ఉందని తెలపడానికి ఇరాన్ మిలట్రీ డ్రిల్ నిర్వహిస్తుందని కార్పొరేట్ సంస్ధలు సాధారణంగా చెబుతాయి. ఇరాన్ కూడా ఈ రెండింటినీ లక్ష్యాలుగా చేయగల మిసైళ్ళు తన వద్ద ఉన్నాయని అప్పుడప్పుడూ ప్రకటించడం కూడా కద్దు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ అణు బాంబు నిర్మించనున్నదని తెలిస్తే ఆ దేశంపై మిలట్రీ చర్యకు వెనకాడబోమని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తుంటాయి. తన వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన మిసైళ్ళు ఉన్నాయని వాటికి 2000 కి.మీ దూరంలో గల లక్ష్యాలను ఛేదించగల శక్తి ఉందని చెబుతుంది. మరీ ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ల ప్రయోజనాలను ధ్వంసం చేయగల శక్తి వాటికి ఉందని చెబుతుంది.

అణు బాంబుల తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తున్నదని ఇరాన్‌పై కధలు ప్రచారం చేయడానికి అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు, అక్కడి కార్పొరేట్ వార్తా పత్రికలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినెజాద్ ఉపన్యాసంలో నుండి కొన్ని మాటలను సందర్భ రహితంగా ప్రస్తావిస్తూ ఆయన ఉద్దేశించని అర్ధాలను ఆపాదించడంలో కూడా వారు ముందుంటారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇరాన్ ప్రకటించినప్పటికీ వాటిని ప్రచురించడానికి గానీ, ప్రసారం చేయడానికి గానీ ఏ మాత్రం ఆసక్తి చూపవు. ఆ విధంగా ఇరాన్ అనగానే ఓ విధమైన వ్యతిరేక భావన ప్రపంచం నిండా పరుచుకునేటట్లు చేయడంలో పశ్చిమ దేశాలు, వారి వార్తా సంస్ధలు చాలా వరకు సఫలమయ్యాయి.

అణ్వాయుధాలను కుప్పలు తెప్పలుగా పేర్చుకున్నావారు ఒక వైపు ఉండగా, అణ్వాయుధాలు లేని దేశాలని అవి బెదిరిస్తూ, ఆంక్షలు విధిస్తూ ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఆ దేశాలను వదిలి తమ దేశ రక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లనైనా చేసుకోవడానికి స్వతంత్ర దేశాలకు ఉన్న హక్కులను ఐక్యరాజ్యసమితి, ఐ.ఎ.ఇ.ఎ లాంటి అంతర్జాతీయ సంస్ధలు కూడా హరించే విధంగా వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే ఇరాన్ పై నాలుగు విడతలుగా సమితి వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలు విధించింది. ఈ దేశాల దాష్టీకాన్ని నిలవరించడం కోసం ఇరాన్ లాంటి దేశాలు అనివార్యంగా మారణాయుధాలు నిర్మించుకోవలసి వస్తున్నది.

వ్యాఖ్యానించండి