పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు


అభం శుభం తెలియని పసి పిల్లలపై పోర్నోగ్రఫీ ఎంత దుష్ప్రభావం పడేస్తుందో ఈ సంఘటన తెలుపుతుంది. ఐదేళ్ళ బాలిక చెరువులో పడి మృతి చెందిన కేసులో పదేళ్ళ బాలుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంగండం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని “ది హిందూ” పత్రిక తెలిపింది.

బాలిక శవం నెడుంగండం లోని ఎస్టేట్ ఏరియా వద్దనున్న చెరువులో లభించిందని పత్రిక తెలిపింది. బాలుడు చేసిన రేప్ ప్రయత్నాన్ని ప్రతిఘటించే ప్రయత్నంలో చెరువులో పడి మృతి చెందిందని ఇడుక్కి పోలీసు ఉన్నతాధికారి జార్జి వర్ఘీస్ తెలిపాడు. చెరువులోకి జారిపడిన బాలిక అందులో మునిగిపోయి ఊపిరాడక చనిపొయిందని ఆయన తెలిపాడు.

తన ఇంటిలో పోర్నోగ్రాఫిక్ వీడియో చూసిన బాలుడు, బాలికపై రేప్ ప్రయత్నం చేశాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వర్ఘీస్ తెలిపాడు. పాఠశాల ముగిశాక ఆటోరిక్షాలో వచ్చిన బాలికను బాలుడు చెరువు దగ్గరకు తీసుకుపోయాడని తెలిపాడు. ఆ సందర్భంగా బాలుడి అఘాయిత్యాన్ని అడ్డుకున్న బాలిక, ఘర్షణలో కాలు జారడంతో చెరువులోకి జారిపోయిందని పోలీసు అధికారి తెలిపాడు. శనివారం బాలుడిని బాలనేరస్ధుల కోర్టులో హాజరుపరచగా కోర్టు బాలుడికి రిమాండ్ విధించింది. బాల నేరస్ధులను ఉంచే జువెనైల్ హోం లో సదరు బాలుడిని ఉంచుతారని తెలుస్తోంది.

వినడానికి, చదవడానికి కూడా భయం గొలుపుతున్న ఈ ఘటన, నూతన ఎత్తులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగా వినియోగించని పక్షంలో, అది సంస్కృతీ వినాశనానికి ఎలా దారి తీస్తుందో వెల్లడిస్తోంది. ఎక్కడో అమెరికాలో తుపాకి సంస్కృతి వలన పాఠశాల పిల్లల్లో సైతం హింసా ప్రవృత్తి పెరిగిపోతున్నదని వార్తలు చదువుకుంటున్న తరుణంలో పవిత్ర సంస్కృతికి పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న భారత దేశంలో ఇటువంటి సంఘటన జరగడం భవిష్యత్తు పట్ల భయవిహ్వలత కలిగిస్తోంది.

తల్లి దండ్రులు, యువత తమ కార్యకలాపాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ ఘటన హెచ్చరిస్తోంది. విస్తరిస్తున్న పాశ్చాత్య విష సంస్కృతికి విస్తరణ సాధనం అభివృద్ధి చెందిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీయే కావడం ఒక విషాదం. సమాజంలో ప్రతి ఒక్కరికీ చేరువగా వచ్చిన సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ లాంటి సాంకేతిక సాధనాల వాడకంలో పిల్లలపట్ల పెద్దలు నిత్యం మెలకువగా ఉండవలసిన అగత్యాన్ని ఇది ఎత్తి చూపుతోంది.

4 thoughts on “పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు

  1. ఇలాంటివి చదివినపుడు బాధ పడటం కూడా మర్చిపోయేంతగా అయోమయం కలుగుతుంది. పిల్లలేమి చేస్తున్నారో పట్టించుకోలేనంతగా తల్లిదండ్రుల ఆర్థిక దృష్టులు పెరిగిపోయాయా,బిజీ జీవితాలు గడుపుతున్నారా లేక సమాజం లో విలువలనేవి పూర్తిగా అడుగంటాయా….అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు.

    ప్రశాంతమైన బ్లాక్ అండ్ వైట్ చిత్తరువు లాంటి సమాజం కళ్ళముందే రంగులు ఒలికి పాడైపోయిన పెయింటింగ్ లా భీభత్సంగా తయారై పోతుంటే మనం ప్రేక్షకులుగా మారాం!

    మామూలు టౌన్లలో కూడా ఇంటర్నెట్ కేఫుల్లో పిల్లలు వీడియో గేములు ఆడటానికి పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ని ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలీదో, లేక పర్లేదులే అనే అలసత్వమో,లేశమాత్రమైనా జాగ్రత్త వహించడం లేదు.

    పదేళ్ళ బాబుకి మాత్రం ఏం తెలుస్తుంది? వీడియోలో చూసిన దాన్ని అనుకరించడానికి మాత్రమే ప్రయత్నించి ఉంటాడు పాపం!తల్లిదండ్రుల అలసత్వానికి హాయిగా గడపాల్సిన బాల్యాన్ని ఇకపై హోమ్ లో గడుపుతాడు కాబోలు!

    ఇంతకీ పోలీసులు చెప్పిన కథనం ఆ పిల్లవాడు చెప్పిందేనా?

  2. వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఎస్.పి చెప్పాడు గనక భాద్యతతో చెప్పి ఉంటాడని భావించవలసిందే. పిల్లవాడు భవిష్యత్తు పాడైపోవడమే దిగులు కలిగిస్తోంది. వాడికి తాను చూసింది, చేసింది తెలుసో లేదో అనుమానమే. పాప చనిపోవడం వలన వాడి చావుకి కూడా వచ్చిందిగానీ లేకుంటే పిల్ల చేష్టలుగా తేలిపోవలసిన విషయం. పిల్లలు తామేం చేస్తున్నామో తెలియకుండానే అమ్మ నాన్న ఆట ఆడతారు చూడండి. అలాంటిదేగా ఇది అనిపిస్తోంది. కాని పాప చనిపోయింది గదా. పాప తల్లిదండ్రులకి కడుపు శోకం. బాబు తల్లిదండ్రులది కూడా అదే పరిస్ధితి అయ్యింది.

    మీరన్నట్లు ఈ ఆలోచనలు లక్ష్యం లేకుండా అయోమయంగా ఉంటున్నాయి. మీరు రాసిన “బ్లాక్ అండ్ వైట్… ” వర్ణన అద్బుతంగా సరిపోయింది. అవును, సమాజం రంగులమయం అయింది. అందమైన లోకంగా కనిపిస్తోంది. కాని ఆ రంగుల అమరికకు క్రమం లేకుండా పోయింది. ఒలికిపోయినా ఒలికిన క్రమం అనవచ్చునేమో గానీ, ఇది అంతకంటే ఘోరంగా ఉంది. ఆలోచిస్తున్న కొద్దీ అనంత ప్రవాహంలా తోస్తోంది. ప్రవాహం కూడా కాదు. మళ్ళీ ఆ ఆలోచనలు మొదటికి వచ్చి బాలుడి భవిష్యత్తుకొసం తల్లడిల్లుతున్నట్లుగా ఉంది. పెద్ద వాళ్ళు నేరం చేసి అరెస్టయితే, కావలసిందే వెధవకి అని అంతటితో ఆలోచనల్ని ముగిస్తాం. కాని ఇక్కడా అలా అనుకోలేక పోతున్నాం. అదే సమస్య.

    తల్లిదండ్రులకి చాలామందికి తెలియదనుకుంటా. సిటీల్లో సరే. ఒక మాదిరి పట్నాల్లో తల్లిదండ్రులకి నెట్ కేఫ్ లు కొత్తే. పిల్లో పిల్లాడో వెళ్తే అది గొప్పగా చూస్తారు కాబోలు. టెక్నాలజీ వాడగలుగుతున్నారన్న గొప్ప. ఏం జరుగుతున్నదో అర్ధమయ్యే లోపు కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నారు. ఈ వేగాన్ని నియంత్రించకపోతే కష్టమే అని మాత్రం బాగా అర్ధం అవుతోంది గానీ అదెలాగో మరి?

  3. బ్లాగుల్లో పార్నోగ్రఫీనీ, వ్యభిచారాన్నీ చట్టబద్ధం చెయ్యాలనే కొంత మంది మేతావులు ఉన్నారులే. పార్నోగ్రఫీ వల్ల మీ కుటుంబ సభ్యులు చెడిపోతే ఎలా ఉంటుంది అని అడిగితే సమాధానం చెప్పరు.

వ్యాఖ్యానించండి