మే నెలాఖరులో జరిగిన పాకిస్ధాన్ విలేఖరి షహజాద్ హత్యలో పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొన్ని శక్తుల హస్తం ఉందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ వెల్లడించాడు. అమెరికా మిలట్రీలో ఉన్నత స్ధాయి అధికారి ఒకరు ఈ విధంగా జర్నలిస్టు హత్య కేసు విషయంలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాను చెప్పలేనని కూడా ఆయన అన్నాడు. విలేఖరి హత్యకు పాక్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ధిష్ట ఏజన్సీతో సంబధం ఉందనడానికి మద్దతుగా తన వద్ద ఒక చిన్న ముక్క సాక్ష్యం ఐన తన వద్ద లేదని చెబుతూనే ఆయన “విలేఖరి హత్య గురించి పాక్ ప్రభుత్వానికి ముందే తిలుసునన్న సమాచారానికి భిన్నంగా నా వద్ద ఏ సాక్ష్యమేమీ లేదు” అని కూడా ప్రకటించాడు. “ప్రభుత్వం విలేఖరి హత్యను పురమాయించింది. అవును” అని ఆయన అన్నాడని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. పెంటగాన్ ప్రెస్ అసోసియేషన్‌తో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నాడని రాయిటర్స్ తెలిపింది.
పాకిస్ధాన్ ప్రభుత్వం, పాక్ మిలట్రీలతో అమెరికా బహిరంగంగానే మాటల యుద్ధానికి సిద్ధమైనట్లు కనపడుతోంది. బిన్ లాడెన్ హత్యలో పాక్ ప్రమేయం లేదని ప్రపంచానికి చెప్పి, తద్వారా పాక్ పరువు కాపాడాలని ప్రయత్నించిన అమెరికా ఆ తర్వాత, వరుసగా పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ ల ప్రతిష్ట మంటగలిపే ప్రకటనలు చేస్తున్నది. ముఖ్యంగా పాక్ మిలట్రీ, ప్రభుత్వాలు సి.ఐ.ఏ గూఢచారులను కనీసం 2/3 వంతు మందిని అమెరికాకి తిప్పి పంపాక పాక్ వ్యతిరేక ప్రకటనలను ఎక్కువ చేసింది. ఒసామా బిన్ లాడెన్ సుదీర్ఘకాలం పాకిస్ధాన్‌లో తలదాచుకున్నందుకు వివరణ ఇవ్వాలనడం, మరో టెర్రరిస్టు జాడ పాకిస్ధాన్‌లోనే దొరికితే మరొక సారి దాడి చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించడం, పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొంతమంది టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించడం ఇవన్నీ చేస్తూ వచ్చింది. తాజాగా పాక్ ప్రభుత్వమే విలేఖరి హత్యకు పురమాయించిందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి స్వయంగా చెప్పడం పాక్ పైన ఒత్తిడి పెంచడానికే అమెరికా నిర్ణయించుకుందని స్పష్టం అవుతోంది.
షహజాద్, హాంగ్ కాంగ్ నుండి నడిచే ఏసియా టైమ్స్ ఆన్ లైన్ పత్రికకు పని చేసే వాడు. మే 29 తేదీన కనిపించకుండ పోయిన ఆయన రెండ్రోజుల తర్వాత ఓ కాలువలో శవమై తేలాడు. ఆయన వంటిపై ఎటువంటి గాయాలు లేవనీ, చిత్రహింసలు పెట్టిన జాడలున్నాయని పాక్ పోలీసులు తెలిపారు. ఆయన శవం దొరకక ముందు షహజాద్ ఐ.ఎస్.ఐ ఆధీనంలో ఉన్నాడని విశ్వసనీయంగా తెలిసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ పాక్ ప్రతినిధి తెలిపాడు. దానితో విలేఖరిని ఐ.ఎస్.ఐ హత్య చేసిందని అందరూ భావించారు. కానీ అమెరికా మిలట్రీ అధికారి మైక్ ముల్లేన్, ఐ.ఎస్.ఐ కి విలేఖరి హత్యతో సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లేవనడం, పాక్ ప్రభుత్వమే చంపించిందన్న అనుమానాలు రేకిత్తించడం ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న కధనాన్ని పూర్వపక్షం చేసినట్లయింది. అమెరికాకూ పాక్ మిలట్రీకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా ఇది సూచిస్తున్నది. పాక్ మిలట్రీకి అమెరికా నేరుగా నిధులు అందిస్తుంది. ఆ నిధులపై పాక్ ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కనీసం మిలట్రీకి ఎంత సహాయం ఇస్తున్నదీ కూడా పాక్ ప్రభుత్వానికి తెలియదు. ఐ.ఎస్.ఐ మిలట్రీ ఆధీనంలో నడిచే శక్తివంతమైన గూఢచార సంస్ధ కావడం ఇక్కడ గమనార్హం.
తన హత్యకు ముందు షహజాద్ పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లకూ, టెర్రరిస్టు సంస్ధలకూ ఉన్న సంబంధాలపై పరిశోధనాత్మక కధనం రాస్తున్నాడు. ఆ కధనంలోని మొదటి భాగం ప్రచురితం కూడా అయ్యింది. రెండోభాగం వెలువడే లోగా ఆయన కిడ్నాప్ అయ్యాడు. మొదటి భాగంలో కరాచిలోని పి.ఎన్.ఎస్ మెహ్రాన్ నౌకాస్ధావరంపై మిలిటెంట్లు జరిపిన దాడి, పాక్ మిలట్రీ సహకారం ద్వారానే జరిగిందనీ, టెర్రరిస్టులకు మిలట్రీ, ఐ.ఎస్.ఐ ల సహకారం చాలా ఉందనీ తాను జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించాడు. కరాచిలోని నావల్ కాంపౌండ్ లో ఉన్న అధికారులు మిలిటెంట్లకు కాంపౌండ్ వివరాలు తెలిపే మేప్‌లూ, దాడి జరిగాక ఏవైపునుండి పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఏవైపు నుండి వచ్చేదీ ఇత్యాది వివరాలనీ మిలిటెంట్లకు అందాయని షహజాద్ వివరించాడు. కరాచి బేస్‌లోని సైన్యంలోకి తాలిబాన్ లోతుగా చొచ్చుకుపోయిందన్న విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు రెండు విడతలుగా వారిపై దాడులు చేసి టెర్రరిస్టులతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేశారు. వారి విదుదల కోరుతూ నావల్ బేస్‌పై తాలిబాన్ దాడి చేసిందని షహజాద్ వివరించాడు.
ఈ మొదటి భాగం కధనంలో వివరాలన్నీ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లపై ఆరోపణలు ఉన్నాయి తప్ప ప్రభుత్వం పైన లెవు. ముల్లెన్ ప్రకటనను బట్టి షహజాద్ రాయనున్న రెండవ భాగంలో పాకిస్ధాన్ ప్రభుత్వానికీ, మిలిటెంట్లకూ ఉన్న సంబంధాల గురించిన అంశాలున్నాయని భావించవలసి ఉంటుంది. లేదా ముల్లెన్ చేస్తున్న ప్రకటన అబద్దపు ప్రచారం అయి ఉండాలి. విలేఖరి కిడ్నాప్, హత్య ల పట్ల తనకు తీవ్ర ఆందోళన కలిగిందని మొసలి కన్నీరు కార్చాడు. పాకిస్ధాన్‌లో జర్నలిస్టులు హత్య కావడం ఇదే మొదటిసారి కాదని కూడా వ్యాఖ్యానించాడు. విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడానికి తానింతవరకూ ఒక్క సాక్ష్యం కూడా చూడలేదనీ అన్నాడు. అమెరికా, పాకిస్ధాన్ ల వైరుధ్యాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడవలసిందే.

