సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ, తద్వారా తన కంపెనీకి మేలు చేసుకోవడానికి స్వదేశీ వ్యాపారిని రెండు సంవత్సరాలపాటు ఎలా వేధించిందీ, బలవంతంగా ఆయనచేత తన కంపెనీని పరాయి దేశ కంపెనీకి అమ్మించడానికి ఎలా కృషి చేసిందీ వివరించింది. తమిళనాడు ప్రజల దృష్టిని మరల్చడానికే కరుణానిధి, శ్రీలంక తమిళుల సమస్యపై నిరాహార దీక్ష నాటకం ఆడాడనీ అమెరికా రాయబారి వద్ద వెళ్ళగక్కిన దయానిధి మారన్ సొంత కంపెనీ లాభానికి ఎంతకు దిగజారిందీ వెల్లడించింది.
దయానిధి మారన్, యు.పి.ఎ మొదటి విడత అధికారం చేపట్టాక 2004-07 కాలంలో కేంద్రంలో టెలికం మంత్రిగా పని చేశాడు. చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ 2జి స్పెక్ట్రం లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పొంతన లేని సాకులు చెప్పి రెండు సంవత్సరాల పాటు ఆయన కంపెనీకి లైసెన్సు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. 14 రకాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోగా వేటినీ పట్టించుకోలేదు. విసిగి పోయిన శివశంకరన్ డిసెంబరు 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్మేసు కున్నాడు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్ కి 14 లైసెన్సులూ వచ్చేశాయి. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి సోదరుని కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రు.599.01 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ విషయాలను సి.బి.ఐ తన తాజా నివేదికలో పొందు పరిచింది.
జస్టిస్ జి.ఎస్.సంఘ్వి, జస్టిస్ ఎ.కె.గంగూలి లతో కూడిన బెంచి ముందు సి.బి.ఐ తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.కె.వేణు గోపాల్ 71 పేజీల ‘స్టేటస్ రిపోర్ట్’ ను చదివి వినిపించాడు. “ఎయిర్ సెల్ ప్రమోటర్, అనేక చోట్ల తలుపులు తడుతూ పోయాడు. కానీ ఆయనకు తన షేర్లను మలేషియా కంపెనీకి అమ్ముకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు” అని నివేదిక పేర్కొంది. అంతకు ముందు “సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్” (సి.పి.ఐ.ఎల్) అనే ఎన్.జి.ఓ సుప్రీం కోర్టు ముందు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించింది. మలేషియాకి చెందిన మాక్సిస్ గ్రూపు చైన్నైలోని సివ గ్రూపుకి చెందిన ఎయిర్ సెల్ కంపెనీని కొనుగోలు చేయడంలో మాక్సిస్ కి దయానిధి మారన్ అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆ డాక్యుమెంట్లు చూపాయి. మారన్ తాను టెలికం మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ సెల్ కంపెనీకి 14 లైసెన్సులు మంజూరు చేసి తన వ్యాపారంలో మాక్సిస్ చేత రు.599.01 కోట్ల పెట్టుబడి పెట్టించుకున్నాడని ఆరోపించింది.
శివ గ్రూపు 2004 నుండీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి.ఒ.టి) వద్ద యు.ఎ.ఎస్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు వేచి చూసినా రాని లైసెన్సులు మాక్సిక్ కంపెనీకి అమ్మేశాక ఎయిర్ సెల్ కంపెనీకి ఆరునెలల్లోనే లైసెన్సులు వచ్చాయని సి.పి.ఐ.ఎల్ ఆరోపించింది. శివశంకరన్ గత నెలలోనే సి.బి.ఐ ముందు హాజరై సాక్ష్యం ఇచ్చాడు. ఎయిర్ సెల్ కంపెనీని కొన తర్వాత మాక్సిక్ కంపెనీ మారన్ కుటుంబ కంపెనీ సన్ టి.విలో 20 శాతం షేర్లను కొనుగోలు చేసిందని ఆ సంస్ధ ఆరోపించింది. “తీవ్ర ఇబ్బందులకు గురైన శివశంకరన్ ఎయిర్ సెల్ కంపెనీని బలవంతంగా అమ్ముకోవలసి వచ్చింది. మార్చి 2006లో మాక్సిస్, ఎయిర్ సెల్ లో 74 శాతం షేర్లను కొనుగోలు చేసింది. అనంతరం మే 2006 లోనే ఎయిర్ సెల్‌కి ఎఫ్.ఐ.పి.బి ఆమోదం లభించింది. మార్చి 3, 2006 నాటికి 14 లైసెన్సుల కోసం ఎయిర్ సెల్ నుండి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి,” అని సి.పి.ఐ.ఎల్ తెలిపింది.
హియరింగ్ సందర్భంగా వేణు గోపాల్, 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంపై ఆగస్టు 31 లోపు దర్యాప్తు పూర్తి చేయవలసి ఉందని తెలిపాడు. 2001-08 కాలంలో స్పెక్ట్రం కేటాయింపులపై దర్యాప్తు సెప్టెంబరు 30 లోపు దర్యాప్తు పూర్తి చేయవలసి ఉందని కూడా ఆయన తెలిపాడు. తదుపరి హియరింగ్ జులై 11 కు వాయిదా పడిందని ‘ది హిందూ’ తెలిపింది. బహుశా రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గం నుండి మరొక తలకాయ రాలిపడనున్నదని అంచనా వేయవచ్చు.

