“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2


Salwa Judum“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత నాశనం కావడానికీ దారితీస్తున్నాయి” అని బెంచి అభిప్రాయపడింది.

“ప్రారంభం నుండి వస్తున్న విలువల ప్రకారం, రాజ్యానికి సంబంధించిన ప్రతి అంగమూ రాజ్యాంగబద్ధ బాధ్యతలకు చెందిన నాలుగు మూలల పరిధిలోనే పని చేయవలసి ఉంటుంది. అదే అంతిమ చట్టం” అని బెంచి పేర్కొంది. “నిజానికి మావోయిస్టులు/నగ్జలైట్ల వలన రాజ్యం అనేక తీవ్ర సమస్యలనే ఎదుర్కొంటున్న విషయం మేము గుర్తిస్తున్నాం. సామాజిక, ఆర్ధిక పరిస్ధితుల వల్లా, రాజ్యం స్వయంగా అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్లా తీవ్రవాద హింస ఉద్భవిస్తున్నప్పటికీ, ఆ హింసను అనుమతించడానికి వీల్లేదు” అని బెంచి అభిప్రాయం వ్యక్తం చేసింది. “రాజ్యాన్ని కూలదోయడానికీ, రాజ్యం నియమించిన ఏజెంట్లను చంపడానికీ, అమాయక పౌరులపై హింసను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం క్రమబద్ధంగా ఉన్న జీవనాన్ని నాశనం చేయడమే అవుతుంది. అటువంటి తీవ్రవాదం ఎదుర్కోవడానికీ, దేశ ప్రజలకు భద్రత కల్పించడానికీ రాజ్యంపై అవసరంగానే భాధ్యత ఉన్నది” అని బెంచి పేర్కొన్నది.

ఎస్.పి.ఓ ల వినియోగం మొదటినుండీ వివాదాస్పద అంశంగా ఉంది. ఎస్.పి.ఓ లు స్ధానికులైనందున మావోయిస్టులకు సంబంధించీ, ఆ ప్రాంతాలకు సంబంధించి కీలకమైన గూఢచార సమాచారం అందించడానికి బాగా ఉపయోపడుతున్నారని రాష్ట్ర పోలీసు అధికారులు, కేంద్ర పారామిలట్రీ అధికారులు చెబుతూ వచ్చారు. మరోవైపు మానవ హక్కుల కార్యకర్తలు భాధ్యతారహితమైన బలగాలను సృష్టించి గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనులే నిలబెడుతున్నారని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నిందిస్తున్నాయి. కోర్టు తీర్పు మానవ హక్కుల కార్యకర్తల వాదనలతో అంగీకరించినట్లు కనిపిస్తోంది. “దంతెవాడ, ఛత్తిస్ ఘఢ్ లోని ఇతర జిల్లాలలోని యుద్ధ భూముల్లోని ఫిరంగులకు యువ గిరిజనులు అచ్చమైన పేలుడు పదార్ధంగా మార్చబడ్డారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్ర ప్రభుత్వం 2007 నాటి పోలీసు చట్టం ద్వారా జిల్లా ఎస్.పిలకు తాత్కాలిక ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్లను నియమించుకునే అధికారం దఖలు పరిచింది. ఆవిధంగా నియమించబడిన వారిలో అధికులు 18 25 సంవత్సరాల మధ్య వయసు వారే. వారిలో కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు, మావోయిస్టుల హింసకు బాధితులైన వారు ఉన్నారని తెలుస్తోంది. వారికి ఆరు నెలల శిక్షణ ఇచ్చి నెలకు రు.3,000 లు జీతం ఇచ్చి నియమించారు. పోలీసు బలగాలు సరిపోనందున వారి స్ధానంలో ఎస్.పి.ఓ లను నియమించుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 40  బెటాలియన్లు (40,000 మంది) కేంద్ర పారామిలటరీ బలగాలు, సాయుధ పోలీసులు ఉన్నారని ది హిందూ పత్రిక పేర్కొంది. వీరు కాక 5269 మంది ఎస్.పి.ఓ లని తెలిపింది. మావోయిస్టులు అధికంగా ఉన్న దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లొ ఎస్.పి.ఓ లను నియమించారని ఆ పత్రిక తెలిపింది.

సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా బుధవారం నుండి ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం నియమించుకున్న 5269 మంది యువ ఎస్.పి.ఓ లు తమ ఆయుధాలను, శక్తివంతమైన రైఫిళ్ళను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పవలసి ఉంటుంది. పోలీసు భద్రతలో వారి వారి క్యాంపులకు పరిమితం కావలసి ఉంటుంది. సోమవారం వరకూ వీరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పార్టీకి చెందిన గెరిల్లా సైన్యం అని చెప్పబడుతున్న వారిపై జరుగుతున్న యుద్ధంలో ముందువరసలో నిలబడి ఉన్నారు. ఇక వారు ఆయుధాలు ధరించడానికి వీల్లేదు. ఛత్తిస్ ఘఢ్ డిజిపి విశ్వ రంజన్ కోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించాడు. ఎస్.పి.ఓ లు అందరూ వారి వారి క్యాంపుల్లోనే ఉంటారనీ, వారిని రెగ్యులర్ పోలీసులు కాపాడుతారని తెలిపాడు. ఛత్తీస్ ఘఢ్ ముఖ్యమంత్రి ప్రతినిధి ఎన్.బజిందర్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తుంది అని చెప్పాడు. కానీ తీర్పును తాము పూర్తిగా చదవవలసి ఉందని కూడా చెప్పాడు.

4 thoughts on ““సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

వ్యాఖ్యానించండి