బిన్ లాడెన్ కుటుంబం అప్పగింతకు పాకిస్ధాన్ నిరాకరణ


ఒసామా బిన్ లాడెన్ భార్యలను, పిల్లలను తమ స్వస్ధాలకు పంపడానికి పాకిస్ధాన్ దాదాపుగా నిరాకరించింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం అతని భార్యలను, పిల్లలను పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లాడెన్ హత్యపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ అంగీకరిస్తే తప్ప ఆయన కుటుంబాన్ని ఇతర దేశాలకు అప్పగించబోమని పాక్ ప్రభుత్వ పానెల్ ప్రకటించింది. ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలతో కూడిన ఒసామా కుటుంబం ప్రస్తుతం పాకిస్ధాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. మే 2 తేదీన బిన్ లాడెన్‌ను అమెరికాకి చెందిన కమెండోలు పాక్ గగనతలం లోకి జొరబడి లాడెన్ ఉన్నట్లు చెబుతున్న అబ్బోత్తాబాద్ లోని ఇంటిపై దాడి చేసి లాడెన్ ను చంపామని ప్రకటించారు. ఆ తర్వాత వెళ్ళీన పాక్ భద్రతా బలగాలకు ముగ్గురు నిరాయుధులైన శవాలు రక్తపు మడుగులో కనిపించాయి. వారిలో ఒకరు బిన్ లాడెన్ కుమారుడుగా గుర్తించారు.

బిన్ లాడెన్ భార్యలలో ఒకరు యెమెన్‌కి చెందినవారు కాగా, ఇద్దరు సౌదీ అరేబియాకి చెందినవారు. గతంలో బిన్ లాడెన్ భార్యలను, పిల్లలనూ అమెరికాకి అప్పగించాలని అమెరికా కోరింది. పాకిస్ధాన్  ఆ  విషయమై హామీ ఇచ్చినట్లూ వార్తలు వచ్చాయి. లాడెన్ భార్యలలో పిన్న వయస్కురాలయిన యెమెన్ వాసి ‘అమల్ అహ్మద్ అబ్దుల్ ఫత్తా’ ని యెమెన్ తిరిగి వెళ్ళడానికి పాకిస్ధాన్ అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై పాకిస్ధాన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సూచనా రాలేదు. “కమిషన్ అనుమతి లేనిదే బిన్ లాడెన్ కుటుంబాన్ని ఎవరికీ అప్పగించరాదని అంతర్గత మంత్రిత్వ శాఖకూ, ఐ.ఎస్.ఐ కీ ఆదేశాలు అందాయి” అని కమిషన్ మంగళవారం మొదటి సారి సమావేశం అయ్యాక జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.

పాకిస్ధాన్ ప్రభుత్వం తలపెట్టిన ఇటువంటి పరిశోధనలు ఎంతకీ పూర్తికాని ఉదాహరణలు గతంలో అనేకం ఉన్నాయి. ముంబై టెర్రరిస్టు దాడులు అందులో ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. లష్కర్ ఏ తయిబా సంస్ధ నాయకులను అరెస్టు చేసి విచారిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వారు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఇండియా చాలా కాలం నుండీ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఒసామా బిన్ లాడెన్ హత్యపై జరిగే దర్యాప్తు సైతం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. కనుక బిన్ లాడెన్ కుటుంబాన్ని వారి దేశాలకు అప్పగించడానికి ఎంత కాలం పడుతుందో, అసలు అప్పగిస్తారొ లేదో కూడా చెప్పలేరన్నది బహిరంగ రహస్యమే. పాకిస్ధాన్ లో శక్తివంతమైన మిలట్రీ జోక్యం వల్లనే అటువంటి పరిస్ధితి ఉన్నదని అందరూ ఎరిగినదే. కమిషన్ తదుపరి సమావేశం వచ్చే వారం జరుగుతుందని తెలుస్తోంది.

అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి బిన్ లాడెన్‌ను హత్య చేసినప్పటినుండీ పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు, మేధావులు తీవ్రంగా విమర్శించారు. అమెరికా కమెండోల చొరబాటు పాకిస్ధాన్ సార్వ భౌమత్వాన్ని ధిక్కరించినట్లేనని పాక్ ప్రజలు తీవ్రంగా నిరసించారు. అనేక రోజులపాటు ఆందోళనలను నిర్వహించారు. పాకిస్ధాన్ పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా ప్రతిపక్షాల సభ్యులు లాడెన్ హత్యపై మిలట్రీ దర్యాప్తు కాకుండా పౌర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దానితో బిన్ లాడెన్ హత్యపై విచారణ జరపడానికి పాక్ ప్రభుత్వం సీనియర్ జడ్జి సారధిగా ఒక కమిషన్‌ని నియమించింది. లాడెన్ హత్యానంతరం అప్పటికే బలహీనంగా ఉన్న అమెరికా, పాకిస్ధాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయని అందరూ అంచనా వేస్తున్నారు.

లాడెన్ హత్యపై నియమితమైన కమిషన్ మంగళ వారం సమావేశం అనంతరం చేసిన ప్రకటనలో అబ్బోత్తాబాద్ దాడి విషయానికి సంబంధించిన సమాచారం ప్రజల్లో ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పాలని కోరింది. తాము జరుపుతున్న దర్యాప్తు “స్వతంత్రంగానూ, పారదర్శకంగానూ, అన్ని అంశాలను తడుముతూ, నిష్పాక్షికంగా” జరుగుతుందని హామీ ఇచ్చింది. బిన్ లాడెన్ హత్య పాకిస్ధాన్ ప్రభుత్వానికి, శక్తివంతమైన మిలట్రీ అధికారులకూ తెలియకుండా జరిగిందని చెప్పడమే నమ్మశక్యం కాని విషయం. పాక్ ప్రజలనుండి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోలేకే పాక్ ప్రభుత్వం తనకు తెలియదని చెబుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా కూడా తమకు నమ్మకంగా ఉంటున్న పాకిస్ధాన్ పాలకులనూ, మిలట్రీ అధిపతులనూ పాక్ ప్రజల ఛీత్కారాలనుండి కాపాడ్దానికే, పాక్ ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేశామని చెబుతోందని వారి అంచనా.

గత అనుభవాల రీత్యా, కమిషన్ ఏమి చెప్పినప్పటికీ ఎప్పటిలాగే బిన్ లాడెన్ హత్యపై విచారణ, నిజాలను నిర్ధారిస్తూ ముగిసే అవకాశాలు లేవనే భావించాల్సి ఉంటుంది. నిజాలే బైటపడినట్లయితే పాకిస్ధాన్, అమెరికా పాలకుల కుమ్మక్కు, పాకిస్ధాన్ ప్రజల ప్రయోజనాలను ఎలా నష్టపరుస్తున్నదీ తెలియవలసి ఉంది. అమెరికా ప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ పై జరిపిన దురాక్రమణ యుద్ధంలో పాకిస్ధాన్ దేశం, పాక్ ప్రజలు ఏ విధంగా పావులుగా మారిందీ వెల్లడి కావలసి ఉంది.

వ్యాఖ్యానించండి