తీవ్రమవుతున్న యూరప్ అప్పు సంక్షోభం, పోర్చుగల్ రేటింగ్ ఢమాల్


Portugal Parliament

Portugal Parliament

గత సంవత్సరం రెండో అర్ధ భాగం అంతా ప్రపంచ కేపిటల్ మార్కెట్లను వణికించిన యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ మరొకసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మే, జూన్ నెలల్లో గ్రీసు సంక్షోభమే ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్లను ఆవరించింది. గ్రీసుకు రెండో బెయిలౌట్ ఇవ్వడానికి ఇ.యు ఒక ఒప్పందానికి రావడమూ, గ్రీసు తాజాగా సరికొత్త పొదుపు చర్యలను అమలు చేసే బిల్లును ఆమోదించడమూ విజయవంతంగా ముగియడంతో గ్రీసు తాత్కాలికంగా చర్చలనుండి పక్కకు తప్పుకుంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్ధ పోర్చుగల్ రేటింగ్ ను ఒకే సారి నాలుగు మెట్లు కిందికి తగ్గించడంతో ఆ దేశ సావరిన్ అప్పు రేటింగ్ జంక్ (junk) స్ధాయిలో రెండు మెట్లు కిందికి చేరుకుంది. అంటె చివరి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లను దాటి జంక్ కేటగిరీలోకి ప్రవేశించడమే కాక అక్కడ కూడా రెండు దశల కిందికి చేరుకుంది.

మూడీస్ రేటింగ్ పద్దతిలో ఇప్పటివరకూ పోర్చుగల్ Baa2 వద్ద ఉంది. ఇప్పుడది తదుపరి రేటింగ్ దశలైన Baa3, Ba1, లను దాటి Ba2 రేటింగ్‌ను మూడీస్ కేటాయించింది. Baa2, Baa3 రేటింగ్ లవరకూ మదుపుదారులకు అనుకూలమైన స్ధాయిల్లో చివరి స్ధాయిలు కాగా Ba1 నుండి ప్రారంభమయ్యే రేటింగ్ లు మదుపుదారులకు ప్రమాద స్ధాయి ప్రారంభాన్ని సూచిస్తాయి. ప్రమాద స్ధాయి అంటే ఆ రేటింగ్ తో ఉన్న అప్పులలో మదుపు చేసినట్లయితే కొన్ని మార్కెట్ పరిణామాలకు స్పందించి రాబడిని తగ్గవచ్చన్న హెచ్చరిక చేసినట్లు అర్ధం. ఈ రేటింగ్ సంస్ధల రేటింగ్ కోతల వలన మార్కెట్ లో అప్పటివరకూ లేని అలజడి నిజంగానే ప్రారంభమవుతుంది. పోర్చుగల్ రేటింగ్ ను తగ్గించినందున ఇక పోర్చుగల్ ట్రెజరీ విభాగం జారి చేసే ప్రభుత్వ బాండ్లలో డబ్బు మదుపు చేయడానికి ఇన్‌వెస్టర్లు సంకోచిస్తారు. మదుపు చేసే వాళ్ళు వడ్డీ ఎక్కువ డిమాంచే చేస్తారు. దానితో పోర్చుగల్ కి అప్పు తేలికగా దొరకదు. దొరికినా ఎక్కువ వడ్డీ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా రేటింగ్ తగ్గించే కొద్దీ వడ్డీ (యీల్డ్) డిమాండ్ పెరగడం, అంత వడ్దీ ఇచ్చుకోలేని పరిస్ధితుల్లో అసలు అప్పు దొరకడం దుర్లభంగా మారి అప్పటికే తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లింపులు చేయడానికి డబ్బు లేని పరిస్ధితి దాపురిస్తుంది. ఈ పరిస్ధితినే అప్పు సంక్షోభంగా పిలుస్తారు.

పోర్చుగల్‌కి సంబంధించినంత వరకూ ఈ సంవత్సరారంభంలో మొదటి సారి అప్పు సంక్షోభం తలెత్తింది. అప్పుడు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు బెయిల్ ఔట్ అప్పు మంజూరు చేసాయి. అప్పు ఇచ్చినందుకు కఠినమైన షరతులను ఆ దేశంపై విధించబడ్డాయి. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి వేతనాల కోత, ఉద్యోగాల కోత, సదుపాయాల రద్ధు తదితర చర్యలను అమలు చేయడంతో ఆర్ధిక వృద్ధి పడిపోయి మరింతగా అప్పు సంక్షోభంలోకి కూరుకు పోయింది. పోర్చుగల్ రెండో సారి బెయిలౌట్ ఇవ్వాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. చైనా బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుంటున్నాయని మూడీస్ హెచ్చరించడం, యూరోజోన్ ఫ్యాక్టరీ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, అమెరికాలో నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి ఇవన్నీ పోర్చుగల్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి.

నిన్నటివరకూ గ్రీసు అప్పు సంక్షోభం, ఇప్పుడు పోర్చుగల్ రేపు ఐర్లండా, లేక స్పెయినా లేకా ఇటలీనా? అన్న అనుమానాలు మార్కెట్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. గ్రీసు, పోర్చుగల్, ఐర్లండుల సంక్షోభం యూరోజోన్ లోని ఇతర బలహీన దేశాలైన స్పెయిన్, ఇటలీ లను కూడా కబళిస్తుందన్న అనుమానాలు గత సంవత్సరమూ వ్యాపించాయి. తాజాగా మూడీస్ పుణ్యమాని మళ్ళీ అవి తలెత్తాయి. గత వారంలో మార్కెట్ ర్యాలీ ఫలితంగా కొంత ముందుకు కదిలిన షేర్లు పోర్చుగల్ ఉదంతంతో బేర్ మార్కెట్ పుంజుకుంటుందని భయపడుతున్నారు. మార్కెట్ మళ్లీ వెనక్కి వెళ్ళే అవకాశాలున్నాయని విశ్లేషకులువ్యాఖ్యానిస్తున్నారు. పోర్చుగల్ రేటింగ్ తగ్గింపు ఖచ్చితంగా ప్రతికూల వార్తేనని సంక్షొభం అత్యంత బలహీన దేశాలనుండి ఒక మాదిరి బలహీన దేశాలకు వ్యాపిస్తున్నదనడానికి గుర్తనీ న్యూయార్క్ లొని ‘డెసిషన్ ఎకనమిక్స్’ సంస్ధ విశ్లేషకుడు రాయిటర్స్ కు తెలిపాడు. అంతిమంగా రేటింగ్ తగ్గింపులు డాలర్ కు స్నేహ పూరితంగానూ, యూరోకు ప్రతికూలంగానూ ఉన్నాయని ఆ సంస్ధ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే యూరోలలో ఉన్న పెట్టుబడులు బద్రత కోసం డాలర్ వైపు పరుగెడతాయని ఆ సంస్ధ సూచిస్తోంది.

పోర్చుగల్ తర్వాత ఇప్పటికే అప్పు సంక్షోభంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి ఒక సారి బెయిలౌట్ పొందిన ఐర్లండు రంగం మీదికి రావచ్చని భావిస్తున్నారు. ఐతే ఐర్లండు సంక్షోభం ఇతర అప్పు సంక్షోభాల వంటింది కాదనీ అక్కడ బ్యాంకులు మాత్రమే బలహీనపడ్డాయని, దేశ ఆర్ధిక వ్యవస్ధ గాడిలోనే ఉందనీ చెబుతున్నవారు లేకపోలేదు. ఐర్లండు తర్వాత స్పెయిన్ గానీ, ఇటలీ గానీ కొత్తగా సంక్షోభం ఏరియాలోకి ప్రవేశించవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. గ్రీసు పార్లమెంటు కఠినాతి కఠినమైన పొదుపు బిల్లును ఆమోదించినప్పటికీ దాన్ని అమలు చేయడం కూడా సవాలేననీ, గ్రీసు సంక్షోభం అప్పుడే ముగిసినట్లు కాదనీ కూదా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈవిధంగా సంక్షోభంలో పడిన ప్రతి దేశానికి బెయిలౌట్ ఎలా ఇస్తారని జర్మనీ పౌరులు ప్రశ్నిస్తున్నారు. బెయిలౌట్లను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా జర్మనీ ఛాన్సలర్ ప్రవేటు మదుపుదారులు కూడా కొంత నష్టాన్ని భరించాలని కోరుతోంది. ప్రవేటు మదుపుదారులు నష్టం భరించడమంటె అది సెలెక్టివ్ డిఫాల్టే నని ఎస్&పి రేటింగ్ సంస్ధ ప్రకటించి మరొక బాంబు పేల్చింది. దానితో గ్రీసు పరిస్ధితి మళ్ళీ మొదటికి రాదుకదా అనీ భయపడుతున్నారు.

వ్యాఖ్యానించండి