ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కధనం ప్రచురించింది.
అబ్బోత్తాబాద్‌పై రైడింగ్ జరిపి ఒసామా బిన్ లాడెన్‌ను హత్య చేయడం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న కరాచీ నావల్ బేస్ పై తీవ్రవాదులు దాడి చేసి యుద్ధ విమానాలను నాశనం చేసి పదిమంది సైనికుల్ని చంపడం… తదితర ఘటనలపై విమర్శలు వెల్లువెత్తడంతో, నావల్ బేస్ లో తాలిబాన్ సానుభూతిపరులు ఉన్నారని వార్తలు ప్రచురించిన షహజాద్‌ను ఐ.ఎస్.ఐ చంపిందని ఆ పత్రిక తెలిపింది. పాక్ సమాచార మంత్రి ఫిరదౌస్ ఆషిక్ అవాన్ “చట్టాలను అమలు చేసే సంస్ధలనూ, భద్రతా బలగాలను అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. దానిలో భాగమే ఈ ఆరోపణలు” అని తెలిపాడు.
అగ్నికి వాయువు తోడైనట్లుగా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, “విలేఖరి షహజాద్ హత్యలో ఐ.ఎస్.ఐ పాత్ర ఉన్నదన్న కధనం, (అమెరికాకు) పాకిస్ధాన్‌తో సాగుతున్న గూఢచర్య యుద్ధంలో మరొక శతఘ్ని లాంటిది” అంటూ ట్విట్టర్‌లో రాసుకున్నాడు. ఈయన వికీలీక్స్ కి అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ అందించాడని భావిస్తున్న సైనికుడు బాడ్లీ మేనింగ్‌ను జైలులో నరకయాతనలు పెడుతుండడాన్ని ఖండించి, ఆనక విమర్శలు రావడంతో రాజీనామా చేశాడు.
ఇదిలా ఉండగా హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ పాక్ ప్రతినిధి ఆలి దయాన్ హసన్, షహజాద్ హత్యకు సంబంధించి అమెరికా వద్ద గూఢచర్య సమాచారం ఉన్నట్లయితే దాన్ని వెంటనే బహిరంగం కావించాలని కోరాడు. షహజాద్ కిడ్నాప్‌కి గురయ్యాక మొట్టమొదట షహజాద్‌ను ఐ.ఎస్.ఐ కిడ్నాప్ చేసిందనడానికీ నమ్మదగ్గ సమాచారం ఉందని వెల్లడించింది ఈయనే. అటువంటి సమాచారాన్ని షహజాద్ హత్యలో పాల్గొన్న వారిపై నేరం రుజువు చేసే విధంగా, చట్టం ముందుకు నిలబెట్టే విధంగా వెంటనే వెల్లడి చేయాలని ఆ సంస్ధ వాదిస్తోంది.
విలేఖరి షహజాద్ తనకు ఐ.ఎస్.ఐ నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న సంగతిని అక్టోబరు 2010లో చెప్పిన ముగ్గురిలో హసన్ కూడా ఒకరు. మే 29 తేదీన షహజాద్ కిడ్నాప్‌కి గురయ్యాక అతని భార్య మొట్టమొదటి సారిగా కలుసుకుని మాట్లాంది కూడా హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హసనే. అప్పటినుండి షహజాద్ శవం కాలవలో బైటపడే వరకూ హసన్, షహజాద్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఇతర సంస్ధలను హెచ్చరిస్తూ వచ్చాడు.

