
సల్వా జుడుం లేదా కోయ కమెండోలు లేదా స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా ఛత్తీస్ ఘఢ్ లొ శిక్షణ పొందుతున్న గిరిజన యువకులు
కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గడ్డి పెట్టినంత పని చేసింది. ఛత్తిస్ ఘఢ్ లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి గిరిజన తెగల్లోనే ఒక తెగకు శిక్షణ ఇచ్చి తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా పేరుపెట్టి రిగిజనంపైకి వదిలింది. దీనివలన గిరిజన తెగల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తి ఒక తెగపై మరొక తెగ దారుణంగా మారణ కాండకు తలపడడం మొదలైంది. గిరిజనులకూ, గిరిజనులకూ పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వినోదం చూశాయి. ఈ పద్దతిని కోర్టు తీవ్రంగా అభిశంసించింది. మావోయిస్టు తీవ్రవాదం ఎదుర్కోవడానికంటూ గిరిజన యువకులకు తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లు అనే బిరుదిచ్చి “కోయ కమెండోలు” అనీ, “సల్వా జుడుం” అనీ లేదా మరే ఇతర బలగాలు అని చెప్పడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీం కోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. వెంటనే వారినుండి ఆయుధాలను వశం చేసుకోవాలని ఆదేశించింది. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్.ఎస్. నిజ్జార్ లతో కూడిన సుప్రీం బెంచి, సామాజిక ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ నందిని సుందర్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారిస్తూ మంగళవారం ఈ తీర్పును ఇచ్చింది. కేవలం 5వ తరగతి మాత్రమే పాసైన యువకులకు ఆయుధాలిచ్చి, వారికి పోలీసులతో సమానమైన అధికారాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు బద్ధ వ్యతిరేకం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
“మాజీ లేదా ప్రస్తుత ఎస్.పి.ఓ లకు (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) ఇచ్చిన పేలుడు ఆయుధాలనూ (firearms), ఆ అయుధాలతో ప్రయోగించే మందుగుండు సామాగ్రి ఏదైనా సరే, వాటన్నింటినీ వెంటనే ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఈ ఫైర్ ఆర్మ్ పదం కిందికి తుపాకులు, రైఫిళ్ళు, లాంఛర్లు మొదలైనవన్నీ వస్తాయి, అవి ఏ కాలిబర్‌వి ఐనాసరే” అని బెంచి తీర్పును ప్రకటించింది. తీర్పును రాస్తూ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఎస్.పి.ఓ లను ఎట్టి పరిస్ధితుల్లోనూ, మరేవిధంగానూ ఉపయోగించడం ఆపేయాలని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాన్ని ఆదేశించారు. మావోయిస్టుల/ నగ్జలైట్ల కార్యకలాపాలను ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ, నియంత్రించడానికి గానీ ఎదుర్కొవడానికి గానీ తగ్గించడానికి గానీ నిర్మూలించడానికిగానీ ఎస్.పి.ఓ లను వినియోగించడాన్ని వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎస్.పి.ఓ లుగా ఇప్పటికే పనిచేస్తున్నవారికీ, ఎస్.పి.ఓ లుగా ఎన్నుకోబడి లేదా నియమించబడి, ప్రారంభ ఉత్తర్వులు అందుకున్న వారెవరైనా ఉంటే వారికీ, వారి జీవితాలను రక్షించడానికీ మరే ఇతర బలగాల నుండీ, మావోయిస్టులు/నగ్జలైట్లతో పాటు ఇంకెవరినుంచయినా, రాజ్యాంగం అనుమతించిన పరిమితులకు లోబడుతూ, సరైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సల్వా జుడుం లేదా కోయ కమెండోలతో పాటు, మరే ఇతర గ్రూపైనా ఏవిధమైన పద్దతిలోనైనా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా లేదా మరే ఇతర పద్ధతుల్లోనైనా ఏ ఒక్క వ్యక్తి యొక్క మానవ హక్కులను హరించే చర్యలకు పాల్పడకుండా అన్ని రకాలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఛత్తిస్ ఘఢ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
“సల్వా జుడుం గానీ లేదా కోయ కమెండోలుగా ప్రాచుర్యం పొందిన వారు గానీ నేర పూరిత కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలపైనా, గతంలోనూ సరైన రీతిలో పరిశోధన చేయని, పరిశోధన పూర్తి చేయని నేరస్ధ ఘటనలపైనా పరిశోధన జరపడానికి తగిన అన్ని చర్యలనూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ద్వారా, ఛత్తీస్ ఘఢ్ లో మావోయిస్టులు/నగ్జలైట్ల కు వ్యతిరేకంగా తిరుగుబాటు వ్యతిరేక చర్యలలో పాల్గొనడానికి ఎస్.పి.ఓలుగా నియమితులైన వారికీ, వారు పనిచేసిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకీ సంక్రమించిన హక్కులను ఛత్తిస్ ఘఢ్ ప్రభుత్వం తన విధానాల ద్వారా తీవ్రంగా ఉల్లంఘించిందని బెంచి పేర్కొంది.