చెట్టు కాయను కోసుకు తిందామని మిలట్రీ కాంప్లెక్సులోకి గోడదూకి వెళ్ళీన 13 ఏళ్ళ బాలుడిని ఆ కాంప్లెక్సు సెక్యూరిటీ గార్డు తుపాకితో కాల్చి చంపాడు. ఆ సైనికుడు ముందూ వెనకా చూడకుండా విచక్షణా రహితంగా తుపాకికి పనిచెప్పి ఓ తల్లి గర్భశోకానికి కారణమయ్యాడు. రక్షణ బలగాలు నివసించే నివాస కాంప్లెక్స్ లోకి దిల్షాన్ అనే బాలుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గోడ దూకి ప్రవేశించాడు. చెట్టుకి కాసిన పండుని కోసుకు తిందామని చెట్టు ఎక్కుతుండగా సెక్యూరిటీ గార్డు తుపాకిని బాలుడికి గురిపెట్టి కాల్చాడు. అది దిల్షాన్ కణతలోకి దూసుకుపోవడంతో ఆ బాలుడికి తీవ్ర రక్తస్రావం అయ్యి, కొన్ని గంటలపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఐతే రక్షణ అధికారులు మాత్రం కాల్పులు జరిగే అవకాశం లేదనీ, సాయుధులెవర్నీ గార్డులుగా నియమించలేదనీ చెబుతున్నారు.
చైన్నై లోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ రోడ్ లో ఉన్న రక్షక భటుల గృహ సముదాయంలో ఈ ఘటన జరిగింది. అన్నా సలైలోని ఇందిరాగాంధీ నగర్ నివాసి అయిన దిల్షాన్, ఇద్దరు మిత్రులతో కలిసి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో గృహ సముదాయంలోకి అనుమతి లేకుండా జొరబడ్డాడని పోలీసులు తెలిపారు. అక్కడ డ్యూటీలో ఉన్న గార్డు బాలుడిపై తుపాకి పేల్చడంతో అతని మిత్రులు పారిపోయారని వారు తెలిపారు. కణతగుండా తుపాకి గుండు దూసుకుపోవడంతో దిల్షాన్ అక్కడే పడిపోయాడు.
దిల్షాన్ పొరుగు వాడైన రాజా మణి, పరుగెత్తుకుంటూ వస్తున్న దిల్షాన్ మిత్రులను ఆపి ఏమైందని అడిగాడు. దిల్షాన్‌ని తుపాకితో కాల్చారనీ లోపల పడిపోయి ఉన్నాడనీ వారు చెప్పడంతో మణి పరుగెత్తుకెళ్ళి గోడదూకి చూడ్డంతో దిల్షాన్ తీవ్ర రక్తస్రావం అవుతూ కనిపించాడు. దిల్షాన్ మిత్రుల సాయంతో మణి దిల్షాన్‌ని బైటికి తెచ్చారు. అప్పటికి దిల్షాన్ తల్లి కాలనీవాసులు రావడంతో వారు రిక్షాలో దిల్షాన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ సంఘటనను ఖండించింది. బాలుడిపై కాల్పులు జరపడం ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదని, కాల్పులు జరిపిన వ్యక్తిని రాష్ట్ర పోలీసులకు అప్పగించాలనీ ఆమె డిమాండ్ చేసింది. కుమార్, కల్యాణిలకు రెండో కుమారుడైన దిల్షాన్, తన తండ్రికి జబ్బు చేయడంతో స్కూలుకి వెళ్ళడం మానేశాడు. ప్లాస్టిక్ వస్తువలను గ్రేడింగ్ చేసే పనికి కుదిరాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో ఆడుతూ పండు కోసం వెళ్ళి విచక్షణ నశించిన తుపాకి గుండుకి బలయ్యాడు.
ఈ వార్త విన్న ఇందిరా నగర్ వాసులు ఆగ్రహం చెంది ఆసుపత్రి వద్దా, ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ రోడ్ పైనా రాస్తారోకో చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్ళు రువ్వడంతో ఓ పోలీసు గాయపడ్డాడు. ఉత్తర చెన్నై పోలీసు జాయింట్ కమిషనర్, ఫోర్ట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామనీ, తమతోపాటు మిలట్రీ పోలీసులు కూదా దర్యాప్తు జరుపుతారనీ తెలిపాడు.
మిలట్రీ అధికారులు తుపాకి కాల్పులు జరగడానికి అవకాశం లేదంటున్నారు. “ఇందిరానగర్ వాసులు తుపాకి కాల్పులు విన్నామని చెబుతున్నారు. కానీ సాయుధ గార్డుల్ని ఇక్కడ నియమించలేదు” అని బ్రిగేడియర్ శశి నాయర్ విలేఖరులతో అన్నాడు. రాజీవ్ గాందీ ప్రభుత్వాసుపత్రిలో దిల్షాన్ కొన్ని గంటలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. కణతలోకి తుపాకి గుండు దూసుకుపొయిందనీ, రక్తం ఎక్కువగా పోయిందనీ వారు తెలిపారు. ముఖ్యమంత్రి బాలుడి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్లు తెలుస్తోంది.

