రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు


Telangana

Telangana

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని జానారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. తాజా వార్తల ప్రకారం తెలంగాణకు చెందిన 11 మంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. డిప్యుటీ సి.ఎం రాజీనామా చేయనని చెప్పినట్లు ‘ది హిందూ’ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు కాబోలు!?

రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి రాజీనామాలు చేయలేదన్న జానారెడ్డి ప్రకటన కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు సరిపోలుతోంది. “ఎం.ఎల్.ఎ ల రాజీనామాలు వారి భావ ప్రకటన మాత్రమే” అని చిదంబరం ఈ రోజు ఉదయం ప్రకటించాడు. అంతే కాకుండా డిసెంబరు 9 ప్రకటనను డిసెంబరు 23 నాటి ప్రకటనతో విడదీసి చూడరాదని కూడా ఆయన చెప్పాడు. డిసెంబరు 9 నాటి ప్రకటన తర్వాత ఏర్పడిన పర్యవసానాల రీత్యానే డిసెంబరు 23 ప్రకటన వెలువడిందని చిదంబరం చెప్పాడు. డిసెంబరు 23 ప్రకటనతో డిసెంబరు 9 ప్రకటన రద్దయినట్లేనని చిదంబరం చెప్పదలిచాడు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు లెక్కలోకి రాదనే చిదంబరం చెబుతున్నాడు. అయితే తెలంగాణపై చర్చలకు ఇప్పటికీ కేంద్రం సిద్ధమేననీ, అందుకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధపడితేనే సమస్య పరిష్కారం అవుతుందనీ ఆయన చెబుతున్నాడు.

రాజకీయ పార్టీలు రెండు ముఠాలుగా విడివడి రెండు అభిప్రాయాలు చెప్పడాన్ని చిదంబరం ఎత్తి చూపుతున్నాడు. రెండు అభిప్రాయాలు కాకుండా ఒక రాజకీయ పార్టీ ఒకే అభిప్రాయం చెప్పగలిగితే పరిష్కారం సులువవుతుందని చిదంబరం పరోక్షంగా సూచిస్తున్నాడు. చిదంబరం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ మాటలు అంటున్నాడని భావించవచ్చు. డిసెంబరు 9 కి ముందు  జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణకు అంగీకరించడంతోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అవే రాజకీయ పార్టీలు మళ్ళీ వెనకడుగు వేసి ఆ ప్రకటనకు నిరసనగా రాజీనామాలు చేయడంతో రెండో ప్రకటనను కేంద్రం వెలువరించింది. కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర రాజకీయా పార్టీలూ, వారి అభిప్రాయాలు ఇలా ప్రభుత్వ పరమైన చర్యలలో భాగంగానే రెండు ప్రకటనలు వచ్చాయనీ, దానికి కారణం రాజకీయ పార్టీల ద్వంద్వ విధానమనీ పరోక్షంగా చిదంబరం ఎత్తి చూపుతున్నాడని భావించాలి.

చిదంబరం చెబుతున్నది వాస్తవమే. రాజకీయ పార్టీలు ఓట్లకోసం అడ్డగోలు ప్రకటనలు చేస్తుండడం, ఒక పార్టీగా తెలంగాణ ఏర్పాటుపై ఒక విధానానికి కట్టుబడి ఉండవలసిన రాజకీయ పార్టీలు ఎక్కడ వెనకబడతామో అన్న ఆందోళనతో ప్రాంతాలవారిగా ప్రకటనలు, విధానాలు ప్రకటించడం వలన తెలంగాణపై తెగని ముడి పడింది. అవునో, కాదో చెప్పాలి తప్ప అవును ప్లస్ కాదు అంటే వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం నిర్ణయం చెబుతున్నట్లు? రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రజలకు ఉమ్మడిగా చెవుల్లో పూలు పెట్టి చోద్యం చూస్తున్నారు. ఒక సమస్య పైన ఒక విధానాన్ని తీసుకోలేని రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీగా ఎలా నిలుస్తుంది? విధానాలు లేని పార్టీలు అసలు పార్టీలేనా? ఈ సంక్షోభం, అయోమయం అంతా ప్రస్తుత రాజకీయ వ్యవస్ధను హీనాతి హీనంగా మార్చిన దాని ఫలితమే.

కేంద్రం చేసిందీ తక్కువ కాదు. కేంద్రంలోని పాలక పార్టీ యే రాష్ట్రంలోనూ ఉంది. “తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేదీ మేమే” అంటూ పనికిమాలిన ప్రకటనలు తప్ప ఆచరణలో చూపే ప్రయత్నం అసలు జరగలేదు. ఒక డిమాండ్ కోసం ప్రతిపక్షాలు, ప్రజలు కలిసి పాలక పార్టీపైనా, ప్రభుత్వం పైనా పోరాటం చేయడం మాములు విషయం. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎం.ఎల్.ఎ లంతా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లే అర్ధం. కానీ తెలంగాణ విషయంలో పాలక పార్టీకి చెందిన ఎం.ఎల్.ఎ లు కూడా నిరాహార దీక్షలు చేయడం ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేపట్టడం ప్రజలను నిలువునా మోసగించడం తప్ప మరొకటి కాదు. ఒక రాజకీయ డిమాండ్ సాధనకు పాలక పార్టీ ఎం.ఎల్.ఎలు మద్దతు ఇస్తున్నట్లయితే ఆ డిమాండ్ నెరవేర్చడానికి పాలక ఎం.ఎల్.ఎ లు ప్రభుత్వంలోనే అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనట్లయితే ప్రభుత్వం నుండి తప్పుకుని బైటికి వచ్చి ఆందోళనలు చేయాలి. అప్పుడు దృశ్యం స్పష్టంగా ఉంటుంది. పాలక ఎం.ఎల్.ఎ ల రాజీనామాలతో ప్రభుత్వం కూలినట్లయితే ఎన్నికలు జరిగితే అప్పుడు తెలంగాణకు ఏ పార్టీ ఏం చేబుతుందో తేలుతుంది.

అలా కాకుండా ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంటారు. అన్ని పదవులూ అనుభవిస్తూ ఉంటారు. తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ మేమే అంటారు. కాని కాలం గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళెపుడిస్తారో, ఎప్పుడు తెస్తారోనని ప్రజలు పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉండాలి. ఈ నాటకాన్ని ఇలాగే కొనసాగించి తదుపరి పార్లమెంటు ఎన్నికలవరకూ సాగదీయాలని కేంద్రంలో ప్రభుత్వం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహంలా కనిపిస్తోంది. కాని ప్రజల పట్ల భాధ్యత ఉన్న పార్టీ ఐతే రాజకీయ ప్రయోజనాలకంటె ముందు ప్రజల ప్రయోజనాలు చూడాలి. వారి ఆకాంక్షలు నెరవేర్చడమో, ప్రత్యామ్నాయం చూపి నచ్చజెప్పడమో చేయాలి. ప్రజలకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నందునే పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ తెలంగాణపై నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్య పెడుతున్నాయి. ఇప్పటికయినా రాజకీయ పార్టీలు ద్వంద్వ విధానాల్ని వీడి ప్రజలకు ఏది మంచిదో నిర్ణయించుకుని ఆ విధానానికి కట్టుబడి ఉన్నట్లయితే అటో ఇటో తేలుతుంది.

వ్యాఖ్యానించండి