తెలంగాణ రాష్ట్రం కోసం అంతిమ సమరం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులలో సగం కంటే ఎక్కువమంది సోమవారం రాజీనామా చేశారు. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు, పతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 28 మంది ఎం.ఎల్.ఎ లు తమ రాజీనామా లేఖలను డిప్యుటీ స్పీకర్‌కు అందించినట్లు ప్రకటించారు. అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎ.పి లొ పరిస్ధితి అదుపులోనే ఉందనీ, రాజీనామాలు ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన మాత్రమేననీ ప్రకటించాడు. కేంద్రం అయితే ఇంతవరకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అసలు ఒక అవగాహనకు కూడా రాలేదనీ పత్రికలను సమావేశపరిచి మరీ చెప్పాడు. చిదంబరం వ్యాఖ్యలను చూస్తే ఎం.ఎల్.ఎ ల రాజీనామాలు వారిని ఏమీ కదిలించలేదని అర్ధం అవుతోంది. రాజీనామాలు ఆమోదించకుండా మరికొంత కాలం సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీలో సరైన సమయంలో రాజీనామా చేస్తామని అనేక నెలలనుండి ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ ఎం.పిలు సరైన సమయంలో స్పీకర్ వద్దకు వెళ్ళడంలో విఫలమయ్యారు. స్పీకర్ మీరా కుమార్ అపాయింట్‌మెంట్ తీసుకుని కూడా ఆ సమయానికి స్పీకర్ వద్ద హాజరు కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎం.పి ల కోసం కొద్ది సేపు చూసిన పార్లమెంటు స్పీకర్ మీరా కుమార్ తన ఛాంబర్ నుండి వెళ్ళిపోయారు. ఐతే స్పీకర్ తన ఛాంబర్ నుండి వెళ్ళిపోయాక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎం.పిలు అక్కడకి చేరుకున్నారు. స్పీకర్ లేనందున వారి రాజీనామాలు వాయిదా పడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజీనామా చేసిన ఎం.ఎల్.ఎ లలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. కె. జానారెడ్డి, జె. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొ ఇద్దరు రాజీనామా చేశారు. ఈసారి సోనియా గాంధీకి కాకుండా డిప్యుటీ స్పీకర్ కి రాజీనామాలు సమర్పించడం గమనార్హం. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎం.ఎల్.ఎ లు ఉన్నారు. టిడిపికి చెందిన 5గురు ఎం.ఎల్.ఎ లు పనుల నిమిత్తం అమెరికాలో ఉన్నందున రాజీనామా ఛేయలేకపోయారని తెలుస్తోంది. టిడిపి రెబెల్ ఎం.ఎల్.ఎ నాగం జనార్ధన రెడ్డి ఆదివారమే రాజీనమా పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎం.ఎల్.ఎ, జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ కూడా డిప్యుటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు రాజీనామా లేఖ సమర్పించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఓక కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ తన రాజీనామా లేఖను ఫాక్స్ చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రాజీనామా అనంతరం టి.ఆర్.ఎస్ ఎం.పిలు కె.సి.ఆర్, విజయశాంతిలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ ఎం.పిలు డజను మంది ఉన్నారు. కె.కేశవరావు రాజ్యసభ సభ్యుడు. లోక్ సభ సభ్యుల్లో మధుయాష్కీ గౌడ్ అమెరికాలో ఉండగా మరొక ఎం.పి సురేష్ షేట్కార్ తల్లి అనారోగ్యం పాలు కావడం వలన రాలేక పోయారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎం.పిలు తమ రాజీనామా పత్రాలు ఇవ్వడానికి స్పీకర్ వద్ద తాజా అపాయింట్‌మెంటును కోరినట్లు తెలిపారు.
ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీ, ఎ.పి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్, తెలంగాణ ప్రజాప్రతినిధులు మరొకసారి చర్చలకు హాజరు కావాలని కోరాడు. ఎం.ఎల్.ఎ లనుండి ప్రతినిధులు ఢిల్లీ రానున్నారనీ వారితో చర్చలు జరుపుతాననీ ఆజాద్ తెలిపాడు. అంతకు ముందు తెలంగాణ ఎం.ఎ.ఎ లు మంత్రులు సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపారు. సమావేశం నుండి బైటికి వచ్చిన వారు తాము రాజీనామా చేయదలుచుకున్నామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి చిదంబరం ఎం.ఎల్.ఎ ల రాజీనామాలను తేలిగ్గా కొట్టీపారేయడం చర్చనీయాంశం. రాజీనామాల వలన ఆందోళన చెందుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు కనిపించడం లేదు. పరిస్ధితి ఏవైపుకు దారితీస్తుందో ఆసక్తికరంగా మారింది. చాలా రోజులనుండి రాజీనామా చేపుతూ వస్తున్న ఎం.ఎల్.ఎ లు తీరా రాజీనామా చేసినా తెలంగాణపై తాము నిర్ణయం తీసుకోలేదనడం మరొక డ్రామాకు తెరలేస్తుందా, అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


తెలంగాణా అంశం క్లైమాక్స్ కి చేరుకుందని అనుకుంటున్నాను . కాంగ్రెస్ పార్టీ తను తీసుకున్న గోతిలో తనే పడింది . చిదంబరం , ఆజాద్ లాంటి అతితెలివి నాయకులు అసమర్ధులు . సోనియా గాంధి ఒక ఉత్సవ విగ్రహం . ఇకపై రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే !
చిదంబరం ప్రకటనను బట్టి కేంద్రం అంత సీరియస్ గా ఉన్నట్లు లేదని భావించాలి. లేదా మీరన్నట్లు అతి తెలివైనా అయుండాలి. రాజకీయ నాయకులు, పార్టీలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకు వాళ్ళని ఏం చేసినా పాపం లేదు.
Hats off to the MLA’s & MP’s who resigned. Jai Telangana.