లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్


గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక.

Deomocracy for Libya

లిబియా ప్రజలను ప్రజాస్వామ్యం అనే లేబుల్ గల శవపేటికలో భద్రపరుస్తున్న నాటో దళాలు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులయితే గొప్పా? అనడుగుతారా? ఎంతమాట! మీకు తెలియదేమో వాళ్ళిప్పటికే ఇరాక్ పైన పది సంవత్సరాలు ఆంక్షలు విధించి, సద్దాం వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలున్నాయని ఓ చిన్న అబద్ధం మాత్రమే చెప్పి ఆ దేశంపై దాడి చేయడమే గాక ఇరాక్‌లో కనపడిన ప్రతిదాన్నీ నాశనం చేసి అక్కడ గొప్ప ప్రజాస్వామ్యాన్ని స్ధాపించేశారు.

ఆఫ్ఘనిస్ధాన్‌పై కూడా మూకుమ్మడిగా దాడి చేసి, రష్యా నాశనం చేయగా మిగిలిన దాన్ని కూడా నాశనమొనర్చి పది సంవత్సరాలుగా అక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం తీపిదనాన్ని రుచి చూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా ప్రజాస్వామ్య స్ధాపన చివరికొచ్చిందట! త్వరలోనే అదీ పూర్తవుతుందట!

ఆ అనుభవంతోనే లిబియాకి కూడా ప్రజాస్వామ్యం ఇవ్వడానికి కష్టపడి బాంబులూ, మిసైళ్ళూ పేలుస్తున్నారు. నమ్మక తప్పదు మరి! వాళ్ళీచ్చే ప్రజాస్వామ్యం శవపేటికలా కనిపిస్తే కనిపించొచ్చు. కాని అది అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు ఎంతో దయతో ప్రసాదించిన ప్రజాస్వామ్యం.

వ్యాఖ్యానించండి