“బకాయి ఉన్న రిఫైనరీలనుద్దేశించి హెచ్చరిక చేశాము. అటువంటి ఉత్తరం పంపినంత మాత్రాన ఇరాన్ ఆయిల్ ఎగుమతులను ఆపినట్లు కాదు. భారత మార్కెట్‌కు ఆయిల్ ఎగుమతులను ఆపాలన్న ఉద్దేశాలేవీ మాకు లేవు” అని ఎన్.ఐ.ఒ.సి అంతర్జాతీయ వ్యవహారాల అధిపతి మొహసేన్ ఘంసారీ చెప్పినట్లుగా ‘షనా’ తెలిపింది. జూన్ 27 తేదీతో భారత ఆయిల్ రిఫైనరీలకు ఇరాన్ నుండి ఒక ఉత్తరం అందింది. చెల్లింపుల సమస్యకు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే ఆగష్టునుండి ఆయిల్ సరఫరా ఆపేస్తామని హెచ్చరించినట్లుగా భారత రిఫైనరీలు, ఎన్.ఐ.ఒ.సి తెలిపినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
గత అనేక నెలలుగా ఇండియాకి సరఫరా చేసిన ఆయిల్ కి గాను చెల్లింపులు జరగడం లేదు. దానివలన ఇరాన్ నిజంగానే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అందువలన తన వ్యాపార జరుపుతున్న దేశాలపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఇండియా సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని త్వరగా కనిపెట్టాలని ఇరాన్ కోరిక. అందుకే భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి చూస్తున్నది. కాని ఇరాన్ సరఫరా ఆగిపోతే సౌదీ నుండి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. కనుక ఇరాన్‌కి ఇండియా మార్కెట్ ను నిలుపుకోవలసిన అవసరం కూడా ఉంది. పైగా జులై నెలకు ఇండియా కోసం అదనంగా ఉత్పత్తి చేసి సరఫరా చేస్తానని సౌదీ అరేబియా ప్రకటించింది కూడా. ఈ నేపధ్యంలో అటు ఇండియా మార్కెట్ పోగొట్టుకోలేక అలాగని దీర్ఘకాలం పాటు చెల్లింపులు లేకుండానే ఆయిల్ సరఫరా చేయలేక ఇరాన్ ఇరుకున పడిందని చెప్పవచ్చు.
ఇండియా నుండి 2 బిలియన్ డాలర్లు ఆయిల్ చెల్లింపుల నిమిత్తం ఇరాన్‌కు అందవలసి ఉంది. అయితే గత డిసెంబరులో అమెరికా ఒత్తిడి మేరకు ఆర్.బి.ఐ ఇరాన్ చెల్లింపుల మార్గాన్ని మూసేసింది. జర్మనీలోని హ్యాంబర్గ్ బ్యాంకు ద్వారా చెల్లింపుల మార్గాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ యూరోపియన్ యూనియన్ కూడా ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో ఆ మార్గం కూడా మూసుకుపోయింది. ఇరాన్ అణు విధానంపై కక్ష పెంచుకున్న అమెరికా, పశ్చిమ రాజ్యాలు, ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తున్నదనీ ఇరాన్ అణ్వాయుధాలు ప్రపంచ శాంతికి ముప్పు అని చెబుతూ భద్రతా సమితి చేత నాలుగు సార్లు వాణిజ్య ఆంక్షలు విధింపజేశాయి. అంతటితో ఆగకుండా అమెరికా, ఇ.యులు తాము ప్రత్యేకంగా మరిన్ని వాణిజ్య ఆంక్షలను ఇరాన్‌పై మోపాయి.
అంతర్జాతీయ ఆంక్షలు, సొంత ఆంక్షలు విధించడమే కాకుండా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని ఇండియా లాంటి దేశాలను కూడా ఒత్తిడి చేస్తున్నది అమెరికా. ఇండియాకు అణు పరికరాలు సరఫరా చేస్తుందన్న ఆశతో ఇండియా పాలకులు, ఆర్.బి.ఐ అమెరికా ఒత్తిడికి లొంగిపోయాయి. స్వతంత్ర విదేశీ విధానానికి తద్వారా తిలోదకాలిచ్చాయి. ఇంతా చేసి అమెరికాతో ఇండియా చేసుకున్న “పౌర అణు ఒప్పందం” ఇప్పుడు తీవ్రం ప్రమాదంలో పడిపోయింది. ఎన్.ఎస్.జి (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు) దేశాలు తాజాగా అణు పరికరాల వ్యాపారానికి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించుకున్నాయి. అందులో కొన్ని నిబంధనలను ఇండియాకు అణు పరికరాలను అమ్మకుండా ఉండటానికే రూపొందించారని కూడా నిపుణులు, భారత ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు.
ఇండియా ఎన్.పి.టి (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) పై సంతకం చేయకపోయినా ఇండియా అణు విధానంలో సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన శాంతియుత ప్రయోజనాల చరిత్రను గుర్తించి అణు పరికరాల అమ్మకానికి షరతులనుండి ఇండియాను మినాయించినట్లుగా పౌర అణు ఒప్పందం సందర్భంగా ఎన్.ఎస్.జి తీర్మానించింది. తాజాగా సవరించిన నిబంధనల ద్వారా ఇండియాకి ఇచ్చిన మినహాయింపును అమెరికా, యూరప్ తదితర దేశాలు రద్దు చేశాయి. పైకి మాత్రం అవి ఇండియాని ఉద్దేశించినవి కావని చెబుతున్నప్పటికీ ఆయా దేశాల అధికారుల ప్రవేటు సంభాషణల్లో ఇండియాకు ఇక మినహాయింపు లేనట్లేనని చెబుతున్నట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి.
