ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లకు ఇరాన్ ఆయుధాల సరఫరా -అమెరికా


ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా సైనికులపై పోరాటం చేస్తున్న వారికి ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ.ఆర్.జి.సి) ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నదని అమెరికా శనివారం వెల్లడించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి అమెరికా సేనలు త్వరగా వెళ్ళిపోవడానికి ఇరాన్ ఈ విధంగా చేస్తున్నదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ ఈ సమాచారాన్ని కొట్టిపారేసింది. అమెరికా సైనికులను సుదీర్ఘకాలం పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో కొనసాగించాలని, అమెరికా భావిస్తోంది. దానికోసమే ఇరాన్‌పై ఇలాంటి కధలు ప్రచారం చేస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. మధ్య ప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా సైనిక స్ధావరాలను ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. కాని అమెరికన్లు సైన్యాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తుండడంతో వారిని మోసం చేయడానికి ఇరాన్‌పై నెపం నెడుతున్నదని ఇరాన్ అధికారులు గత వారం రోజుల్లో జరిగిన వివిధ సమావేశాల్లో, విలేఖరులతో చెప్పారు.

అమెరికా చెబుతున్నదాని ప్రకారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రాకెట్ సాయంతో పేలిపోయే ప్రొజెక్టైల్స్‌ను (rocket-assisted exploding projectiles)  ఇరాక్ లో ఉన్న మిలీషియాకు సరఫరా చేసింది. ఈ ఆయుధాల వల్లనే అమెరికా సైనికులు అనేక మంది చనిపోయారని అమెరికా సైన్యాధికారులు చెప్పారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ తాలిబాన్లకు లాంగ్ రేంజ్ రాకెట్లను కూడా ఇరాన్ సరఫరా చేసిందని వారు చెబుతున్నారు. సురక్షితమైన ప్రాంతాలనుండి అమెరికా, మిత్ర రాజ్యాల సైన్యాలను టార్గెట్ చేయగల శక్తి తాలిబాన్‌కు వీటి ద్వారా సమకూరిందని అమెరికా అధికారులు వివరించారు. అటువంటి ఆయుధాల సహాయం వలన మధ్య ప్రాచ్యం ప్రాంతంలోనూ, ఉత్తర్ ఆఫ్రికాలోనూ అధిపత్యం సాధించడానికి అమెరికా, ఇరాన్ ల మధ్య పోటీ పెరుగుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది. అమెరికా సేనల ఉపసంహరణ ఈ పోటీని మరింత పెంచుతుందని ఆ పత్రిక అంటోంది.

మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో అమెరికా కాపాడుతూ వచ్చిన నియంతృత్వ ప్రభుత్వాలను ప్రజా తిరుగుబాట్లు కూలదోస్తున్న సంగతి విదితమే. ఈ ప్రజా ఉద్యమాలను అడ్డు పెట్టుకుని అమెరికా కూడా ఈ ప్రాంతంలో తనకు నచ్చని ప్రభుత్వాలను కూలదోయడానికి కృత్రిమ ఉద్యమాలను రెచ్చగొడుతున్నది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి సైనిక ఉపసంహరణ అనంతరం ఆ దేశాల్లో తన అనుకూల ప్రభుత్వాలు కొనసాగాలని కూడా అమెరికా కోరుకుంటున్నది. ఈ నేపధ్యంలోనే ఇరాన్ మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నదని అమెరికా అధికారులు సూచిస్తున్నారు. “ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు తమ దాడుల తీవ్రతను ఉచ్ఛస్ధాయిలో కొనసాగించడానికి అవకాశం ఉంది. ఐనప్పటికీ ఇరాక్ భద్రతా బలగాలకు అవసరమైన అన్ని సహాయాలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని ఇరాక్‌లోని అమెరికా సైనిక కమాండర్ మెజర్ జనరల్ జేమ్స్ బుచానన్‌ని వాల్ స్ట్రీట్ జర్నల్ ఉటంకించింది.

ఇరాక్‌లో జూన్ నెలలో 15 మంది అమెరికా సైనికులు చనిపోయారు. రెండేళ్ళలో ఒకే నెలలో ఇంతమంది చనిపోవడం ఇదే ప్రధమం అని అమెరికా అధికారులు చెప్పారు. ఈ మరణాలకు దారితీసిన దాడులను షియా మిలీషియా బాధ్యులని అమెరికా ఆరోపించింది. వారికి ఇరాన్ రివల్యూషనరీ గార్డులే శిక్షణ ఇచ్చారని అమెరికా అంచనా. ఆఫ్ఘన్ తాలిబాన్లు ఈ మద్య ప్రయోగించిన రాకెట్లు గతం కంటె రెట్టింపు దూరం టార్గెట్ చేయగల శక్తి గలవిగా అమెరికా అధికారులు గుర్తించారట. రాకెట్ల తయారీ, అవి దొరికిన ప్రాంతాలను బట్టి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన విదేశీ యూనిట్ ‘ది ఖాడ్స్ ఫోర్స్’ (The Qods Force) ప్రయోగించిన ఆయుధాలేనని గట్టి నమ్మకం కుదిరిందని అమెరికా సైనికాధికారులు చెప్పారని జర్నల్ తెలిపింది. పర్షియా గల్ఫ్ లో ఇరాన్ మిలట్రీ కార్యకలాపాలు కూడా పెరిగాయని అమెరికా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇది కాకుండా ఇరాన్‌లో అధ్యక్షుడు అహ్మదినెజాద్, సుప్రీం లీడర్ అయితుల్లా ఖమెనీ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనీ అధ్యక్షుడికి సన్నిహితంగా ఉండే చాలామందిని అరెస్టు చేశారనీ పత్రికలు రాస్తున్నాయి. ఇవి అహ్మదీ నెజాద్ కొనసాగింపుపై అనుమానాలను రేకెత్తిస్తొందని పత్రికల అంచనా. మధ్య ప్రాచ్యంలోనూ, ఉత్తరాఫ్రికాలోనూ రాజకీయ తిరుగుబాట్లకు కూడా ఇరాన్ మద్దతు బాగా పెరుగుతోందనీ, సిరియా తిరుగుబాటును అణచివేయడానికి ఇరాన్ సైనిక సలహాదారులను కూడా పంపించిందని అమెరికా భావిస్తున్నదని వాల్ స్ట్రీట్ జర్నల్ భావిస్తోంది. అలాగే ఈజిప్టు, బహ్రెయిన్, యెమెన్ తదితర అమెరికా అనుకూల పాలకులున్న చోట్ల గూఢచారులను పంపుతూ, ప్రచార కార్యక్రమాలను కూడా ఇరాన్ చేపడుతున్నదని అమెరికా భావిస్తున్నట్లు జర్నల్ చెబుతోంది.

ఇరాన్ అధికారులు దీన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. “ఇది అమెరికా చేస్తున్న ప్రచారం. వారే రూపొందించుకున్న పధకం ప్రకారం తొందరలోనే ఇరాక్ నుండి వెళ్ళిపోవలసి ఉంది. ఆ వెళ్ళిపోవడానికి వారికి చాలా బాధగా ఉంది. వారి పధకాల ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ సొంత సమస్యలను పరిష్కరించుకోవడమే ఉత్తమం” అని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రామిన్ మెహమన్‌పరాస్త్ అన్నాడు. “అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లోకి సైతం జోక్యం చేసుకుంటున్నాయి. ఇరాన్ ప్రతిపక్ష గ్రూపులకు మద్దతు ఇస్తూ ఎగదోస్తున్నాయి” అని ఇరాన్ ఆరోపిస్తోంది.

అమెరికా, ఇరాన్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా అమెరికా తన ఆధిపత్యం కోసం సాధారణంగా చేసే అక్రమాలన్నీ ఇపుడు ఇరాన్ చేస్తోందని ఆరోపించడమే ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తోంది. లిబియాలో తిరుగుబాటు ఎగదోయడానికి గడ్డాఫీ వ్యతిరేకులకు అమెరికాలోనే శిక్షణ ఇచ్చి పంపింది అమెరికా. లిబియా తిరుగుబాటుదారులు ప్రభుత్వ వైమానిక దాడులకు చెల్లాచెదురు కావడంతో భద్రతా సమితి చేత “నో-ఫ్లై జోన్” విధింప జేసి లిబియా ప్రభుత్వ విమానాలు ఎగరకుండా నిరోధించింది. తిరుగుబాటుదారులకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు మిలట్రీ సలహాదారులని పంపించాయి. ఆయుధాలను రహస్యంగా సరఫరా చేశాయి. హెలికాప్టర్ల ద్వారా అధునాతన ఆయుధాలని లిబియా తిరుగుబాటుదారులకు అందించానని ఫ్రాన్సు అంగీకరించింది. పైగా లిబియా పౌరుల రక్షణకు ఆయుధాల సాయం అవసరమని చెప్పింది. భద్రతా సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని, ఆ తీర్మానం ఇవన్నీ చేయమని చెప్పకపోయినా సరే, ఇవన్ని చేస్తున్నాయి. లిబియాలో ఇరు పక్షాలకీ ఆయుధాలు అందకుండా భద్రతా సమితి లిబియాపై ఆయుధ నిషేధం విధించినా అది వారికి అడ్డు కాలేదు. సిరియాలో కూడా ఈ కార్యక్రమాలకు అమెరికా పాల్పడింది.

చిత్రం ఏంటంటే, ఇరాన్ ఏ తప్పులు చేస్తోందని అమెరికా అంటున్నదో అవన్నీ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ తదితర దేశాలు ఎప్పుడూ చేసేవే. ఐనా సరే సిగ్గులేకుండా ఇరాన్ అవి చేస్తోందని చెప్పడమే కాక అది తప్పని కూడా అంటున్నాయి. తాము చేయడమే కాక తన మిత్ర దేశాలు చేసినా పట్టించుకోలేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లకు తన విదేశీ యూనిట్లను పంపిందనీ, సిరియాకు మిలట్రీ సలహాదారులను పంపిందనీ అమెరికా ఆరోపించడాన్ని పైన చూశాం. సౌదీ అరేబియా, కతార్ దేశాలు బహ్రెయిన్‌లో ప్రజా తిరుగుబాటుని అణచి వేయడానికి తమ సైన్యాన్ని పంపాయి. దాని గురించి ఒక్క మాట కూడా అమెరికా, ఇ.యు లు మాట్లాడలేదు. అవేమీ జరగనట్లు నటించాయి. లిబియాకి మిలట్రీ సలహాదారూలను పంపించి కూడా ఇరాన్ సిరియాకి మిలట్రీ సలహాదార్లను పంపించిందని ఆరోపించడం ఏ కోవలోకి వస్తుంది? ఇరాక్, ఆఫ్టనిస్ధాన్ దేశాలపై దాడి చేసి వందల వేల సైన్యాన్ని అమెరికా, యూరప్ లు దించి యుద్ధం చేస్తూ, ఆ దేశాలకు ఇరాన్ తనవాళ్ళకు శిక్షణ ఇచ్చి పంపుతున్నదంటూ ఆరోపించడానికి అమెరికాకి నోరెలా వచ్చింది?

అమెరికా, యూరప్ లది ద్వంద్వ న్యాయం. తమకొక న్యాయం. ఇతరులకొక న్యాయం. బలహీనులకి అసలు న్యాయమే ఇవ్వాల్సిన అవసరం లేదు. తాము చేస్తే రైటు, ఇతరులు అదే చేస్తే నేరం, ఘోరం, అన్యాయం, అక్రమం… ఇవన్నీను. నిజానికి ఇరాన్ అమెరికా ఆరోపించినవన్నీ చేస్తున్నదనేందుకు సాక్ష్యాలేవీ లేవు. ఎక్కడో ఒక రాకెట్ దొరికిందట! అది ఇరాన్‌దేనట! కాబట్టి ఇరాన్ పాత్రమొత్తం రుజువైపోయిందట! తాము లిబియా అధ్యక్షుడు గడ్దాఫీ ఇంటిపై వారాల తరబడి బాంబులేసినా, అతని మనవళ్ళనూ, కొడుకునీ చంపినా వారికి మాత్రం గడ్దాఫీని చంపే ఉద్దేశ్యమే లేదని చెప్తే ప్రపంచం చెవిలో పూలు పెట్టుకుని నమ్మాలట! ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లకు పొరుగుదేశం ఇరాన్. తమ దేశాల్లో జరిగే పరిణామాల పట్ల ఏ దేశమైనా అప్రమత్తంగా ఉంటుంది. తనకూ, తన ప్రజలకూ ముప్పు ఉందేమో పరిశీలిస్తుంది. ముప్పు వచ్చేటట్లయితే అది రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇరాన్ చేసింది అదే. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ ప్రభుత్వాధిపతులను ఇరాన్ కి ఆహ్వానించింది. అమెరికా సైన్యాలు ఎక్కువ కాలం తమ ప్రాంతంలో ఉండటం క్షేమకరం కాదని హెచ్చరించింది. అమెరికా ఎంత త్వరగా ఖాళీ చేస్తే అంతమంచిదని వివరించింది. ఏ దేశమైనా చేసే కనీస కార్యక్రమం ఇది.

ఆ మాటకొస్తే ఇరాక్, అఫ్ఘనిస్ధాన్ లనుండి ఖాళీ చేయమని అమెరికా ప్రజలే కోరుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లో రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది కోరుతున్న అంశాన్ని ఇరాన్ గానీ, ఇండీయా గానీ చెబితే నేరం కాబోదు. అవసాన దశకు చేరుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తేరుకోవాలంటే ఈ యుద్ధాలను అమెరికా ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. లేకుంటే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ల పరిస్ధితే అమెరికాకి దాపురించదని నమ్మకం లేదు.

వ్యాఖ్యానించండి