భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంలో అంతకు ముందు వారం కంటె తగ్గిపోయాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. జూన్ 17 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 310.562 బిలియన్ డాలర్లు ఉండగా జూన్ 24 నాటికి 309.020 బిలియన్ డాలర్లకు తగ్గాయని ఆర్.బి.ఐ శుక్రవారం తెలిపింది. విదేశీ మారక ద్రవ్యంలో ఐ.ఎం.ఎఫ్ లో ఇండియాకు ఉండే ఎస్.డి.ఆర్ హోల్డింగ్స్ కూడా కలిసి ఉంటాయి.
విదేశీ మారక ద్రవ్యం ఇతర ప్రధాన కరెన్సీలలో కూడా ఉన్నప్పటికీ అన్నింటినీ డాలర్లలోకి మార్చి విలువ ప్రకటించడం ఆనవాయితీ. ఉదాహరణకు భారత దేశ ప్రభుత్వం డాలర్లతో పాటు యూరోలు, పౌండ్లు, జపనీస్ యెన్‌లు తదితర కరెన్సీలలో కూడా విదేశీ ద్రవ్యాలను నిలవ చేసుకుంటుంది. అంతర్జాతీయ వ్యాపారం కోసం చెల్లింపులు చేయడానికి ఇవి అవసరమవుతాయి. వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్న దేశాల కరెన్సీలను కూడా నిలవ చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఒక ధోరణిగా ముందుకు వచ్చింది.
చైనా, ఇ.యు లాంటి దేశాలు, కూటమిలు తమ తమ కరెన్సీలలో కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉంచుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకోసం కొన్ని ఒప్పందాలను కూడా చేసుకుంటున్నాయి. ఉదాహరణకి చైనా, రష్యాల మధ్యా, చైనా, బ్రెజిల్ ల మధ్య మానిటరీ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల ప్రకారం చైనా, రష్యాల మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాపారంలో చైనా రూబుళ్ళలోనే రష్యాకు చెల్లింపులు చేయాలి. అలాగే రష్యాకూడా చైనాకు యువాన్‌లలో చెల్లింపులు చేయవవసి ఉంటుంది. ఈ ఒప్పందం చైనా, టర్కీలు కూడా కుదుర్చుకున్నాయి. తద్వారా విదేశీ వ్యాపారంలో తమ సొంత కరెన్సీని ఉపయోగించే అవకాశాలు పెరుగుతాయి. అలా సొంత కరెన్సీలో విదేశీ వ్యాపారం చేయగలగడం చాలా సౌలభ్యాన్ని కలగజేస్తుంది.
ఇటువంటి ఒప్పందాలు ప్రపంచ వ్యాపారంలోనూ, విదేశీ కరెన్సీ వ్యాపారాలలోనూ డాలర్ కి ఉన్న ఆధిపత్యం బలహీనపడుతుంది. తద్వారా అమెరికా ఆర్ధిక ఆధిపత్యానికి కూడా పాక్షికంగా గండి పడుతుంది. ఏదో ఒకటో రెండో కరెన్సీలకి ఆధిపత్యం ఉండడానికి బదులు అనేక దేశాల కరెన్సీలకు అంతర్జాతీయంగా మారక సౌకర్యం ఉన్నట్లయితే అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ఆ దామాషాలో సమన్యాయమ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమం అంతిమంగా అమెరికాకి ప్రతికూలంగా మారుతుంది.
ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ద్వారా ఆర్ధికంగా కుదేలయిన అమెరికా, ఆ యుద్ధాల వలనే ఏక ధృవ ప్రపంచం స్ధానంలో బహుళ ధృవ ప్రపంచం ఏర్పడడానికి, డాలర్ ఆధిపత్యం నశించడానికి స్వయంగా రహదారులు నిర్మించిందని చెప్పవచ్చు.
