లెబనాన్ మాజీ ప్రధాని రఫిక్ హరిరి హత్య కేసులో నలుగురు హిజ్బొల్లా నాయకులపై కోర్టు విచారణ జరగడానికి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐ.సి.సి) ఆమోదించడాన్ని హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా తిరస్కరించాడు. రఫిక్ హరీరి 2005లో బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు. “గౌరవనీయులైన సోదరులను” ప్రపంచంలో ఏ శక్తీ అరెస్టు చేయలేదని నజ్రల్లా స్పష్టం చేశాడు. ఐ.సి.సి ట్రిబ్యునల్ విచారణకు నిర్ణయించిన నలుగురిని 30 రోజుల్లోగా అప్పగించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి నియమించిన “లెబనాన్ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్” (Special Tribunal for Lebanon – STL) హిజ్బొల్లాకి చెందిన నలుగురు హరిరి హత్యకు బాధ్యులనేందుకు తగీన ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతూ వారిపై నేరారోపణ చేసింది. ఫలితంగా నలుగురుపైనా ఐ.సి.సి విచారణ చేయవలసి ఉంది.
లెబనాన్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కుంటున్న నలుగురిని ఐ.సి.సి కి అప్పగిస్తేనే విచారణ కొనసాగుతుంది. సమితి నియమించిన లెబనాన్ ట్రిబ్యునల్‌ను హిజ్బొల్లా మొదటినుండి వ్యతిరేకిస్తూనే ఉంది. ట్రిబ్యునల్ తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని చెబుతూ వచ్చింది. లెబనాన్ ప్రధాని రఫిక్ హరిరితో పాటు మరో 22 మంది చనిపోయిన 2005 నాటి బాంబు దాడి వెనక తమ ప్రమేయం లేదని చెబుతూ వచ్చింది. హిజ్బొల్లా నాయకులపై లెబనాన్ ట్రిబ్యునల్ నేరారోపణ చేయనున్నదని సంవత్సరం క్రితమే బైటికి పొక్కింది. అప్పటినుండి హిజ్బొల్లా ట్రిబ్యునల్ నిష్పాక్షితను అనుమానిస్తూ, దాని తీర్పును ఆమోదించబోమని ప్రకటిస్తోంది. రఫిక్ హరిరి కుమారుడు, ఇటీవలివరకూ లెబనాన్ ప్రధానిగా పనిచేసిన సాద్ హరిరి ట్రిబ్యునల్ తీర్పును హర్షించాడు. ఇది “చారిత్రాత్మక ఘటన” గ అభివర్ణించాడు.
శనివారం టి.వి లో ప్రకటిస్తూ నజ్రల్లా ‘ట్రిబ్యునల్ తీర్పులోని ప్రతి ఆరోపణనూ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తీర్పు హిజ్బొల్లా సంస్ధపై దాడి చేయడంతో సమానమని పేర్కొన్నాడు. “మన సోదరులను వారు ఎన్నటికీ అరెస్టు చేయలేరు. 30 రోజులు లేదా 60 రోజులైనా సరే. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 300 సంవత్సరాలైనా సరే. జరగబోయేదేంటంటే పరోక్షంలోనే విచారణ జరుగుతుంది. అంతిమ తీర్పు ఎలా ఉండాలో ముందే నిర్ణయించిన విచారణ అది” అని హసన్ నజ్రల్లా టి.వి ప్రసంగంలో పేర్కొన్నాడు. “ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతిఘటనా పోరాట యోధులను ట్రిబ్యునల్ నిజాయితీగా విచారిస్తుందని భావించగలమా? ఈ ట్రిబ్యునల్‌ను మొదటినుండీ ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో ఏర్పాటు చేశారు” అని నజ్రల్లా వివరించాడు.
ట్రిబ్యునల్ ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదనడానికి సాక్ష్యంగా నజ్రల్లా కొన్ని డాక్యుమెంట్లను ప్రదర్శించాడు. 2009 లో లెబనాన్ ట్రిబ్యునల్‌ను లెబనాన్ నుండి అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉన్న హేగ్ నగరానికి తరలిస్తున్నపుడు అది 97 కంప్యూటర్లను ఇజ్రాయెల్ ద్వారా పంపినట్లు ఆ డాక్యుమంట్లు తెలుపుతున్నాయని ఆయన తెలిపాడు. ట్రిబ్యునల్ తీర్పు అంతర్యుద్ధానికి దారితీస్తుందన్న భయాలేవీ పెట్టుకోవద్దని ఆయన లెబనాన్ ప్రజలను కోరాడు. “ఎందుకంటే లెబనాన్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఉంది. అది ప్రతీకారం తీర్చుకోవదానికి ప్రయత్నాలు చెయ్యదు” అని హామీ ఇచ్చాడు. గురువారం ట్రిబ్యునల్‌కి సంబంధించిన లెబనాన్ ప్రతినిధి బృందం నుండి నేరారోపణలతో పాటు నాలుగు అరెస్టు వారంట్లు వచ్చినట్లుగా ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సయీద్ మీర్జా ప్రకటించాడు. ట్రిబ్యునల్ కూడా ఈ వార్తను ధృవీకరించింది. ఐతే ట్రిబ్యునల్ నలుగురి పేర్లను తెలపడానికి నిరాకరించింది.
లెబనాన్ ఇంటీరియర్ మంత్రి మార్వాన్ షర్బిల్ “ఆ నలుగురు” పేర్లను వెల్లడించాడు. వారు ముస్తఫా బదర్ ఆల్-దిన్, సలీం ఆల్-అయ్యష్, అస్సాద్ సాబ్రా, హస్సన్ ఉనైసీ అని ఆయాన తెలిపాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ ప్రకటించింది. వీరిలో బదర్ ఆల్-దిన్ 1983లో వరుసగా జరిగిన బాంబు పేలుళ్ళలో నిందితుడుగా కువైట్‌లో జైలు శిక్ష అనుభవించాడు. ఈయన హిజ్బొల్లా అత్యున్నత కమాండర్ గా పని చేస్తూ 2008లో డమాస్కస్ బాంబింగ్‌లో హత్యకు గురైన “ఇమాద్ ముఘన్‌యే” కి దగ్గరి బంధువు (brother in-law) కూడా. ట్రిబ్యునల్ తీర్పునుండి లీకయిన కొన్ని భాగాల్ని బట్టి అది ప్రధానంగా సెల్ ఫోన్ సాక్ష్యం పైనే ప్రధానంగా ఆధారపడినట్లు స్పష్టమవుతోందని బిబిసి విలేఖరి “ఓవెన్ బెన్నెట్-జోన్స్” అభిప్రాయం వ్యక్తం చేశాడు.
లెబనాన్ ప్రభుత్వం ఇప్పుడు 30 రోజుల్లోగా ఆ నలుగురిని ఐ.సి.సికి అప్పగించవలసి ఉంది. కాని లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బొల్లా అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. కనుక అప్పగింత జరగని పని. ఇజ్రాయెల్‌కి ఉత్తరాన ఉన్న లెబనాన్‌ను ఇజ్రాయెల్ కొన్ని సంవత్సరాల పాటు ఆక్రమించింది. లెబనాన్ ప్రజలు పోరాడి ఇజ్రాయెల్‌ను తరిమి కొట్టారు. ఇజ్రాయెల్ అడపా దడపా లెబనాన్‌పై దాడి చేస్తూ ఉంటుంది. తన గూఢచారులను లెబానాన్ నిండా నింపింది. హిజ్బొల్లా నాయకులను తన గూఢచార సంస్ధ మొస్సాద్ చేత హత్య చేయిస్తుంది. కాని 2006లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు హిజ్బోల్లా విజయవంతంగా తిప్పి కొట్టింది. ఇజ్రాయెల్ పైన ఒక ముస్లిం సంస్ధ యుద్ధం చేసి గెలవడం ఆధునిక చరిత్రలో, ఇజ్రాయెల్ దేశాన్ని అమెరికా, ఇంగ్లండులు కుట్ర పూరితంగా ఏర్పాటు చేశాక అదే ప్రధమం. అత్యాధునిక ఆయుధాలు ఇజ్రాయెల్ కలిగి ఉన్నప్పటికీ కేవలం సాంప్రదాయక ఆయుధాలతో ఇజ్రాయెల్‌ని ఓడించడం ప్రపంచం అంతటా పీడిత పక్షపాతులలో సంతోషాన్ని నింపింది. ఇజ్రాయెల్ అప్పటినుండి అవమాన భారంతో వేగిపోతోంది. మరో అవకాశం కోసం నిస్పృహగా ఎదురుచూస్తోంది.
ఇజ్రాయెల్, అమెరికాలు చరిత్రలో చాలా ఘోరమైన నేరాలకు పాల్పడ్డాయి. యుద్ధ నేరాలకు పాల్పడ్డాయి. జాతి దురహంకారానికి అను నిత్యం పాల్పడుతుంటారు. పాలస్తీనియుల కనీస మానవహక్కులను కూడా ఉల్లంఘిస్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్ స్ధానికంగా అరబ్ దేశాలపై పెత్తనం చెలాయిస్తుంటే అమెరికా ప్రపంచమంతంటా పెత్తనం చెలాయిస్తుంది. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఒక్క దేశానికే అణ్వాయుధ సంపత్తి ఉంది. దానితో అరబ్ దేశాలకు రక్షణ లేకుండా పోయింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ ఆధిపత్యానికి గండిపడుతుందని అమెరికా, పశ్చిమ రాజ్యాలు ఇరాన్ అణు విద్యుత్ కోసం అణు కేంద్రాలను నిర్మిందుకుంటున్నప్పటికీ బాంబు కోసమే అంటూ అభాండాలు మోపి సమితి చేత నాలుగు సార్లు అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధింపజేశాయి. కాని 300కు పైగా అణ్వాయుధాలను కలిగి ఉన్న ఇజ్రాయెల్ అణు కేంద్రాలను తనిఖీ చేయాలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) గానీ, అంతర్జాతీయ న్యాయస్ధానంగానీ, అమెరికా దాని పశ్చిమ రాజ్య మిత్రులుగానీ ఎన్నడూ కోరలేదు, ప్రయత్నించలేదు. అరబ్ దేశాలు కోరినా పట్టించుకోలేదు. కానీ అరబ్ దేశాలపైనా, ముస్లిం దేశాలపైనా లేని ఆరోపణలు చేసి వాటిపై ఆంక్షలు విధించడానికీ, ఆ దేశాలపై దురాక్రమణ యుద్ధాలకు తెగబడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

