“అన్ని విధాలుగా సరిగా ఉన్న డ్రాఫ్టు పార్లమెంటుకి వెళ్ళాలి. అప్పుడే చర్చ కూడా అర్ధవంతంగా జరుగుతుంది. లోపాలతో కూడిన డ్రాఫ్టుని పార్లమెంటులో ప్రవేశపెడితే ఇక ఏ విధమైన చర్చ జరుగుతుంది? సరైన డ్రాఫ్టు పార్లమెంటుకు వెళ్ళనట్లయితే మేము ఆగష్టు 16 నుండి తిరిగి ఆందోళన ప్రారంభిస్తాము” అని అన్నా చెప్పాడు. అన్నా బృందం అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సోనియా హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఐతే కాంగ్రెస్ ప్రతినిధి జనార్ధన్ ద్వివేది మాత్రం ప్రధాని, ఛీఫ్ జస్టిస్‌లను లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తేవడంతో పాటు, వివాదాస్పద అంశాలు ఏవీ సోనియాతో సమావేశంలో చర్చకు రాలేదని ప్రకటించాడు. అన్నా హజారే బృందం బైట ఏమి చెప్పుకున్నా తమకు సమస్య లేదని ఆయన అన్నాడు. ప్రభుత్వం నిర్ణయానుసారం పార్టీ నడుస్తుందని ఆయన చెప్పాడు.
అరవింద్ కెజ్రీవాల్ ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను లోక్ పాల్ పరిధిలోకి తేవాలని తాము సోనియాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించామని తెలిపాడు. లోక్ పాల్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వ డ్రాఫ్టుకు, పౌరసమాజ కార్యకర్తల డ్రాఫ్టుకు ఉన తేడాలను సోనియాకు వివరించామని తెలిపాడు. ఈ అంశాల గురించి తాను పరిశీలిస్తానని సోనియా స్పందించిందని ఆయన తెలిపాడు.
