టెర్మినేటర్ హీరో ష్వార్జ్‌నెగ్గర్ అక్రమ సంబంధం, విడాకులు కోరిన భార్య


ప్రిడేటర్, టెర్మినేటర్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకోవడమే కాక ఆ పలుకుబడితో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా కూడా ఎన్నికయిన హాలీవుడ్ ఏక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ నుండి విడాకులు కోరుతూ అతని భార్య మేరియా ష్రివర్ కోర్టు మెట్లు ఎక్కింది. రోబోట్ పాత్రలో టైం మిషన్‌ సాయంతో కాలంలో వెనక్కి ప్రయాణించి భూమిని యంత్రాల నుండి కాపాడ్డానికి ప్రయత్నించిన టెర్మినేటర్ హీరో అక్రమ సంబంధం వలన తన వైవాహిక జీవితాన్ని సైతం టెర్మినేట్ చేసుకోనున్నాడు. తన ఇంటిలో పనిచేసే సిబ్బందిలోనే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కాలిఫోర్నియా రాష్ట్ర మాజీ గవర్నర్ పదేళ్ళ క్రితమే ఒక బిడ్డను కూడా కన్నాడని వార్తా సంస్ధలు కొన్ని నెలల క్రితం బైటపెట్టాయి.

ష్వార్జ్‌నెగ్గర్ నుండి విడాకులు తీసుకోవడాని నిర్ణయించుకున్న మేరియా పాతికేళ్ళుగా భర్తతో కాపురం చేస్తోంది. మాజీ జర్నలిస్టు అయిన ఆమెకు హీరోగారితో నలుగురు బిడ్డలు ఉన్నారు. అక్రమ సంబంధంతో రహస్యంగా బిడ్డను కన్నాడని తెలిశాక మేరియా భర్త నుండి విడిపోయే వేరే ఇంటిలో జీవనం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పిల్లలలో మైనారిటీ తీరని ఇద్దరు పిల్లలు ఉమ్మడి సంరంక్షణలో ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు బిబిసి తెలిపింది. విడాకులకు వేసిన పిటిషన్లో ‘పరిష్కరించుకోవడానికి వీలుకాని విభేధాల వలన’ విడాకులు కోరుతున్నట్లుగా మేరియా పేర్కొన్నది. మైనారిటీ తీరని పుత్రుల వయసు 17, 13 సంవత్సరాలని, భార్య భర్తలు విడిపోయినప్పటికీ వీరు మాత్రం ఉమ్మడి సంరంక్షణ ఉండాలని మేరియా కోరింది.

2003 లో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ష్వార్జ్‌నెగ్గర్, గత జనవరిలో తన పదవికి రాజీనామా చేశాడు. హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి నిర్ణయించుకున్నందున రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ రాణించగల కిటుకు బహుశా ష్వార్జ్‌నెగ్గర్‌కి తెలిసినట్లు లేదు. భారత దేశంలో అనేక మంది నటులు తమ నటనా జీవితం ద్వారా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ఎం.పిలుగా, ఎం.ఎల్.ఎ లుగా ఎన్నికయ్యాక కూడా నిరభ్యంతరంగా, నిరాటంకంగా సినిమాలలో నటనలను కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారతీయ నటులు కమ్ రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యాక ప్రజల గురించి పట్టించుకోవలసి ఉంటుందన్న భాధ్యతలను గాలికొదిలి తిరిగి నట సంపాదనలో పడిపోతారు. అందుకే ఒకసారి గెలిచిన వారు రెండో సారి గెలవడం వీరిలో అరుధుగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు తమ రాజకీయ జీవితంలో అత్యధిక భాగం నటనతోనే గడుపుతారు కనకనే సినిమా నటులు రాజకీయ నాయకులుగా కూడా చెలామణి కాగలుతున్నారు.

ష్వార్జ్‌నెగ్గర్ భారతీయ నట రాజకీయనాయకుల కంటె ఒకాకు ఎక్కువే చదివినట్లున్నాడు. హాలీవుడ్ సినిమాలతో పాటు రాజకీయ జీవితంలో కూడా నటిస్తూనే నిజజీవితంలో భర్తగా కూడా నటించ గలిగాడు. ఆయనగారు సినిమాల్లో హీరోగా నటించినా, నిజ జీవితంలో భార్య పాలిట, కాలిఫోర్నియా ప్రజల పాలిట విలన్‌గా జీవించడమే ఇక్కడ విషాధం. ష్వార్జ్‌నెగ్గర్, మేరియా ష్రివర్ లు వివానికి ముందు సంపాదన విషయంలో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదట. కనుక అమెరికా చట్టాల ప్రకారం ష్వార్జ నెగ్గర్ ఆస్తుల్లో మేరియాకు సగ భాగం వస్తుందని తెలుస్తోంది. 1986 నుండీ ష్వార్జ్‌నెగ్గర్ సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించిన ఆస్తుల్లో అతని భార్యకు విడాకుల అనంతరం సగ భాగం తగ్గడమే మేరియాకు కొంత ఊరట కలిగించే విషయం.

2 thoughts on “టెర్మినేటర్ హీరో ష్వార్జ్‌నెగ్గర్ అక్రమ సంబంధం, విడాకులు కోరిన భార్య

  1. ఈ అక్రమసంబంధాల విషయంలో మాత్రం మన దేశ రాజకీయనాయకులు , నటులు అమెరికా కన్నా ఎంతో అభివ్రుద్ధి చెందారు . నాటి ఘనీఖాన్ చౌదరి దగ్గర్నుండి నేటి తివారి దాకా అందరూ శ్రుంగారపురుషులే ! ఎం.జి.రామచంద్రన్ కి జయలలిత ఏమవుతుంది ? ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తెలుగు గడ్డపై జీవించకపోవటం అతని దురద్రుష్టం ! ఇక్కడయితే .. అభిమానసంఘాలు అతని భార్య ఇంటి ముందు ధర్నా చేసి కోర్టు కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి తెచ్చేవి . ఒకవేళ విడాకులు మంజూరయినా భార్యకి ఏ పదో పరకో చెందేట్లు కోర్టు తీర్పు చెప్పేది !

  2. కదా రమణ గారూ. భారతదేశంలో సినీ నటుల అభిమానులు వారి వారి నటనలను బట్టిగాక, వారు సినిమాల్లో చేసే “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ” లను చూసి అభిమానం పెంచుకుంటారు. ఆయా హీరో పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుని ఆనందపడతారు. అది నటన అన్న సంగతి కూడా మర్చిపోయేంతగా ఐడెంటిఫై చేసుకుంటారు. సినిమాలో ఎం.జి.ఆర్ భార్య జయలలితే గానీ, అసలావిడ కాదు కదా! అందుకని రాజకీయవారసురాలు కూడా ఆమే కావాలన్నది మన అభిమానులు విధించుకున్న రూలు కాబోలు.

    ఏ హీరోయిజమూ లేని రాజకీయ నాయకులనే క్షమించే భారత ప్రజలు, హీరోల అవలక్షణాలన్నీ క్షమించ దగ్గవిగా, చిన్న విషయాలుగా భావించి వదిలేయడంలో ఆశ్చరం లేదనుకుంటా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో ఉన్నవారు నిజ జీవితంలో ఏం చేసినా పట్టించుకోనవసరం లేదు మరి! మీరన్నట్లు ష్వార్జ్‌నెగ్గర్ ఇక్కడ పుట్టుంటే మేరియా ఇంటిముందు టెంట్లు వెలిసి ఉండేవే.

వ్యాఖ్యానించండి