ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం


Manmohan in Afghanisthanఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా, జపానో వచ్చి “వద్దొద్దు వెళ్ళొద్దు. మీరు వెళ్ళిపోతే మా భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుంది. స్వతంత్ర ఇండియా చుట్టూ ఉన్న దేశాల భద్రతకు ముప్పు తెస్తుంది” అని విన్నవించుకుంటే పోరాటంలో భారతీయులకు ఎలా ఉంటుంది?

ప్రస్తుత భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రజల దృష్టిలో అటువంటి దోషిగానే మిగిలింది. ఆఫ్ఘన్ దురాక్రమణనుండి తన సైనికులను ఉపసంహరిస్తానని ఒబామా 2009లో ప్రకటించినపుడు భారత ప్రభుత్వం ఉలిక్కి పడినట్లుగా వికీలీక్స్ ద్వారా వెల్లడైన సమాచారం చెబుతోంది. ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని ఎన్నికల్లో ఒబామా చేసిన వాగ్దానాల్లో ప్రముఖమైనది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి బదులు బారక్ ఒబామా 2009 మే నెలలో “ట్రూప్ సర్జ్” ప్రకటించాడు. అంటే కొత్తగా 33,000 మంది సైన్యాన్ని ఆఫ్ఘన్‌కి పంపడానికి నిశ్చయించాడు. “ట్రూప్ సర్జ్” ప్రకటిస్తూనే 2011 లో సైన్యం ఉపసంహరణ కూడా ప్రారంభిస్తానని ప్రకటించాడు. గత జూన్ నెలలో ఒబామా ప్రకటించిన ఉపసంహరణ ద్వారా నిజానికి ఒబామా అదనంగా పంపిన సైన్యాన్ని మాత్రమే వెనక్కి రప్పిస్తున్నాడు. అది కూడా ఈ సంవత్సరంలో పూర్తి కాదు. 2012 సెప్టెంబరు వరకూ ఈ 33,000 మందీ వెళ్తూనే ఉంటారు. వాళ్ళూ వెళ్ళాక మిగిలేది ఒబామా అధికారంలోకి వచ్చే నాటికి ఎంతమంది ఉన్నారో అంతేమంది సైనికులే. అంటే ఒబామా ఎన్నికల్లో చేసిన ఉపసంహరణ వాగ్దానం ఇంకా అలానే ఉండిపోయింది. ఐనా సరే “యుద్ధ కెరటం వెనక్కి మళ్ళింది” (The tide of war is receding) అని ఒక అలంకారాన్ని అమెరికా జనం మీదికి వదిలి దాని మాటున అసలు పరిస్ధితిని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు.

భారత ప్రభుత్వం 2009 లో రెండు సంవత్సరాల తర్వాత సైన్యం ఉపసంహరణ ప్రారంభిస్తానని ఒబామా చెప్పినపుడే ఉలిక్కి పడింది. అమెరికా వెళ్ళిపోతే భారత దేశ భద్రతకు ముప్పు ఉంటుందని చెపుతూ వెళ్ళొద్దని అమెరికాని కోరింది. నిత్యం అమెరికా సైనికుల పహారాలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు ఎన్ని ఇబ్బందులున్నా, బాంబు పేలుళ్ళనడుమ జీవనం కష్టంగా మారినా పర్లేదు గానీ, ఊహాత్మక భద్రతా సమస్య ఉన్నందున ఆఫ్ఘన్ గడ్డపై పరాయి దేశం కొనసాగాలని కోరడం స్వాతంత్ర్యం విలువ తెలిసినవారు కోరదగిన కోరికేనా? భారత ప్రభుత్వ అధికారులు అదే కోరారని, ఇస్లామాబాద్ నుండి, న్యూఢిల్లీ నుండీ అమెరికా రాయబారులు అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరాల ద్వారా వెల్లడయ్యింది. వికీలీక్స్ ద్వారా వెల్లడైన ఈ కేబుళ్ళను ‘ది హిందూ‘ పత్రిక ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే.

2009 డిసెంబరులో వెస్ట్ పాయింట్‌లో ఉన్న మిలట్రీ అకాడమీలో ప్రసంగిస్తూ తన ఉపసంహరణ పధకాన్ని ఒబామా ప్రకటించాడు. 2010 ప్రారంభంలో అమెరికా సెనేటర్ ‘క్లెయిర్ మెక్‌కాస్కిల్’ ఇండియా పర్యటనకు వేంచేశారు. అప్పుడు భారత దేశ ‘జాతీయ భద్రతా సలహాదారు’ (National Security Advisor – NSA) గా శివశంకర్ మీనన్ పని చేస్తున్నాడు. సెనేటర్‌తో మీనన్ మాట్లాడుతూ “అమెరికా సైన్యాన్ని ఉపసంహరిస్తుందని గ్రహిస్తే పాకిస్ధాన్, ఇండియా వలన భద్రతా సమస్య ఉందని సాకు చూపించి పశ్చిమాన ఆఫ్ఘన్ సరిహద్దులోని తీవ్రవాదంతో పోరాటం ఆపేస్తుంది. ఆ సాకుతో అక్కడి సైన్యాన్ని భారత సరిహద్దులకు తరలిస్తుంది” అని హెచ్చరించాడు. ఫలితంగా ఆఫ్ఘన్ తీవ్రవాదం మరింత రెచ్చిపోతుందని మీనన్ అమెరికా సెనేటర్‌ని హెచ్చరించాడు. ఈ భయంతోటే ఇండియా ఆఫ్ఘనిస్ధాన్‌లో మరింత ఎక్కువ పాత్ర నిర్వాహించాలని కోరుకుంటోందని ది హిందూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎక్కువ పాత్ర పోషించడంలో భాగంగా, ఇటీవల భారత ప్రధాని ఆఫ్ఘన్ పర్యటించినపుడు ఇంతకు ముందు హామీ ఇచ్చిన 1.3 బిలియన్ డాలర్ల అభివృద్ధి సాయానికి మరో 500 మిలియన్ డాలర్లను జతచేశాడు. అంటే మొత్తం 1.8 బిలియన్ డాలర్ల (రు.8100 కోట్లు) సాయాన్ని ఇండియా ఆఫ్ఘన్‌కి ఇస్తోంది. “తా దూర కంతలేదు, మెడకో డోలు” అంటే ఇదే కాదా!? సహాయం అధికం చేయడంతో పాటు ఆఫ్గనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించిన “తాలిబాన్‌తో సంబంధాల పునరుద్ధరణ” పధకాన్ని తన పూర్తి మద్దతుని కూడా ప్రకటించాడు. ఇక్కడ భారతీయులు ‘తాలిబాన్ తీవ్రవాద సంస్ధ, అంత క్రూరమైంది, ఇంత ఘోరమైంది’ అని కారాలూ మిరియాలూ నూరుతుంటే అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్‌లు వాళ్ళతోనే చర్చలు జరపాలంటున్నారు, మన ప్రధాని కూడా మంచిదే, జరపండి అని తధాస్తు అనేసి వస్తున్నాడు.

ఫిబ్రవరి 25, 2010 తేదీన ఇండియాలోని అమెరికా రాయబారి తిమోతి జె. రోమర్ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కి ఓ కేబుల్ పంపాడు. దాని నెంబరు 250737, రహస్యం (కాన్ఫిడెన్షియల్) కూడా. “భారత దేశంలో అధికులు భావిస్తున్నదాని కంటే ఎక్కువగా అమెరికా ఆఫ్ఘనిస్ధాన్‌లో విజయం సాధించడానికి అవకాశాలున్నాయని మీనన్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘన్‌లో మూడు యుద్ధాల్లో ఓడారు. అందుకే ఇప్పటి కూటమి కూడా ఆఫ్ఘన్ చేతిలో ఓడుతుందని భావిస్తున్నారు. కాని ఇతరులు ఆ దేశాన్ని లొంగదీసుకోగలిగారని ఆయన అన్నాడు” అని రోమర్ రాశాడు. ఒక మూడవ ప్రపంచ దేశం, అందునా దాదాపు రెండొందల సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గడమే కాక దేశ సంపదని పెద్ద మొత్తంలో పరాయి దేశానికి కోల్పోయిన దేశం లోని పాలకులు, అధికారులు చెప్పవలసిన మాటలా ఇవి? ఒక స్వతంత్ర దేశాన్ని ఆక్రమించిన దురాక్రమణ దేశాల గుంపుని ప్రోత్సహిస్తూ మాట్లాడ్డం, పొరుగు దేశాన్ని లొంగదీయండి అని కోరుతూ దురాక్రమణదారులతో కుమ్మక్కు కావడం మర్యాదస్తులకు తగినదేనా? భారత ప్రజలు ఆలోచించాలి. బ్రిటిష్ వాడు వెళ్ళి అరవై ఏళ్ళు దాటినా బుర్రా, బుద్ధీ ఇంకా దాస్యంలోనే మగ్గడం భారత పాలకుల లక్షణమని డిసైడైపోవచ్చా?

మన శివశంకరుల వారు అంతటితో ఆగలేదు. అమెరికా రాయబారి మాటల్లో చెబితే “ఇండియా ఆఫ్ఘనిస్ధాన్‌లో చేపట్టిన చిన్న చిన్న కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టుల గురించి మీనన్ సెనేటర్‌తో తెగ బాకాలూదాడు. ‘ఆఫ్ఘనిస్ధాన్‌లోని మంత్రిత్వశాఖల చుట్టూ తిరిగి ఆఫ్ఘనిస్ధాన్ దేశస్ధులతో నేరుగా సంబంధాలను సాధించడానికి మాకు ఒకటిన్నరేళ్ళు పట్టిందని చెప్పుకున్నాడు. సంభంధాల కోసం అంత కాలం పట్టినా వారు చేపట్టిన ప్రాజెక్టుల వలన విపరీతమైన ప్రయోజనం ఒనగూరిందని సెనేటర్‌కి చెబుతూ మీనన్ భుజాలు చరుచుకున్నాడు” అని రాయబారి మీనన్ ఘనత గురించీ, భారత దేశం పట్ల తమకున్న చిన్నచూపునీ ప్రత్యక్షరంలోనూ ప్రతిఫలింపజేశాడు. ఇండియా గొప్పతనానికి ఉదాహరణగా ఒక సంఘటన కూడా చూపాడట మీనన్. ఇండియా స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులు కోరితే 13,000 మంది చేశారట. అందరూ క్వాలిఫై కాలేదు గానీ, అవకాశాల కోసం ఆఫ్ఘన్లు ఎంతగా ఎదురు చూస్తున్నారో దాని ద్వారా అర్ధం అవుతోందని మీనన్ చెప్పాడని రాశాడు రోమర్. “విజయం అనేది మిలిట్రీ ప్రయత్నం కంటే మించినదాని వలన సిద్ధిస్తుంది” అని ఒక పాఠం చెప్పు ముగించాడని రోమర్ రాశాడు.

సెనేటర్, అమెరికా 300,000కి పైగా ఆఫ్ఘన్లకు సైనిక శిక్షణ ఇస్తుందని హామీ ఇచ్చాడట. అపుడు మీనన్ “మీ అమెరికా వ్యవస్ధ ఉంది చూశారూ, ఎంత త్వరగా నేర్చుకుంటారండీ మీరు! ప్రపంచంలో మరే ఇతర దేశమూ అంత త్వరగా నేర్చుకోలేదని నేను ఘంటాపధంగా చెప్పగలను, మీరు నమ్ముతారో లేదో?” అని హాశ్చర్యపోయి సర్టిఫికెట్ కూడా పడేశాట్ట! కేబుల్ ద్వారా తెలిసింది.

అదండీ సంగతి! భారత పాలకులు త్వరగా నేర్చుకోక పోయినా లేటుగానైనా తెలుసుకుంటే అదే పదివేలు. అసలు అమెరికా ఆఫ్ఘనిస్ధాన్‌ తగలడిన కారణాల్లో ఎమర్జింగ్ దేశాలుగా దూసుకొస్తున్నాయంటున్న చైనా, ఇండియాలపైన చెకింగ్ పెట్టడం కూడా ఒకటనీ, ప్రపంచాధిపత్యం వ్యూహంలో అదొక భాగమనీను. భారత ప్రజలు తెలుసుకున్న రోజున వారికా అవకాశం ఎలాగూ దక్కదు.

వ్యాఖ్యానించండి