ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి జూన్ నెలలో కూడా క్షీణించడం కొనసాగింది. జూన్ నెలలో మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తొమ్మిద నెలల కనిష్టస్ధాయిలో నమోదైందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుండడం వలన అప్పు సేకరణ ఖరీదు పెరగడంతో దాని ప్రభావం మాన్యుఫాక్చరింగ్ రంగంపై పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నిర్వహించే పి.ఎమ్.ఐ సూచిక (Purchasing Managers’ Index) ప్రకారం మే నెలలో పి.ఎమ్.ఐ సూచి 57.5 నమోదు చేయగా జూన్ నెలలో అది 55.3 కు చేరింది. పి.ఎం.ఐ 50 కి పైగా ఉన్నట్లయితే మాన్యుఫాక్చరింగ్ రంగ విస్తరిస్తున్నదనీ, తక్కువగా ఉంటే కుచించుకుపోతున్నదనీ అర్ధం.
కొత్త ఆర్డర్లు ఇంకా తక్కువ స్ధాయిలోనే ఉన్నాయనీ, పాత ఆర్డర్ల కొనసాగింపు కూడా తగ్గిపోయాయనీ హెచ్.ఎస్.బి.సి విశ్లేషకుడు తెలిపాడు. కొత్త ఆర్డర్లు స్ధిరంగానే ఉన్న పెరగడం లేదని ఆయన పేర్కొన్నాడు. ఎగుమతుల ఆర్డర్లు కూడా చాలా నెమ్మదిగా విస్తరిస్తున్నాయని తెలిపాడు. కొత్త ఆర్డర్ల పెరుగుదల రేటు నవంబరు 2009 తర్వాత ఇదే తక్కువని ఆయన వివరించాడు. కార్మికుల కొరత, విధ్యుత్ కోతలు తదితర కారణాల వలన వరుసగా పదిహేనవ నెల కూడా పాత ఆర్డర్లు కుప్పపడిపోవడం కొనసాగుతున్నది. సామర్ధ్యంలో లోపాలను ఇది ఎత్తి చూపిస్తుంది. ఐతే సామర్ధ్య లోపానికి మౌలిక రంగాలు ఇంకా వెనకబడి ఉండడం కారణంగా కొనసాగుతోంది. ప్రభుత్వం మౌలిక రంగాలను మెరుగుపరచ వలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.
కంపెనీలు సరుకులను కొంటున్నా మెల్లగా అది సాగుతోంది. ఇన్‌పుట్ ధరలు పెరుగుతుండడం ఇందుకు దోహదపడుతోంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులతో ధరలు పెరడం కొనసాగుతున్నది. వీటివలన పరపతి సౌకర్యం పడిపోవడం, ముడి సరుకుల ధరలు పెరగడం వెరసి మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు మూలనపడడం జరుగుతోంది. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉంది కనుక రానున్న రోజుల్లో కూడా ఉత్పత్తి నెమ్మదించడం కొనసాగే అవకాశం ఉంది. అంతిమంగా జిడిపి వృద్ధి రేటుపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్ధితులను పరిష్కరించకుండా జిడిపి లెక్కలు మాత్రం ఆశావహంగా ప్రకటించడం భారత పాలకులకు సులభంగా మారింది.

