అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?


ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా చెల్లించలేక పోతోంది. అమెరికా ఒత్తిడి మేరకు భారత రిజర్వు బ్యాంకు ఇరాన్ చెల్లింపుల మార్గాన్ని మూసివేయడమే అందుకు కారణం.

ఇరాన్ ఆయిల్ సరఫరా కంపెనీ ‘నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ’ (ఎన్.ఐ.ఒ.సి) ఆగష్టునుండి ఇండియా రిఫైనరీలకి ఆయిల్ సరఫరా చేయడం ఆపేస్తానని ప్రకటించింది. బాకీ ఉన్న 12 బిలియన్ డాలర్లను చెల్లించేందుకు మార్గం చూడనట్లయితే సరఫరా ఆపేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని ఆ కంపెనీ తెలిపినట్లుగా కంపెనీ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఆ అధికారులు తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడలేదని రాయిటర్స్ తెలిపింది. ఇరాన్ రోజుకు 400,000 బ్యారెళ్ళ ఆయిల్ ఇండియాకి సరఫరా చేస్తుంది. ఇది భారత అవసరాల్లో 12 శాతం తీరుస్తుంది. ఇండియాకి ఆయిల్ సరఫరా దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా సరఫరా చేస్తున్నది ఇరానే.

గత డిసెంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్‌కు చేసే చెల్లింపులను క్లియర్ చేయడం ఆపేసింది. జర్మనీ లోని హ్యాంబర్గ్ నగరంలో ఉన్న ఇ.ఐ.హెచ్ బ్యాంకు ద్వారా ఇరాన్ ఆయిల్ చెల్లింపులు చేయడానికి భారత్‌ని జర్మనీ ఈ సంవత్సరారంభంలో అనుమతించింది. కాని యూరోపియన్ యూనియన్ ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో ఆ దారి కూడా మూసుకుపోయింది. ఆర్.బి.ఐ అమెరికా ఒత్తిడికి లొంగకపోయినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. ఆర్.బి.ఐ లొంగిపోవడం అంటే భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లే. జులై నెలకు గానూ సౌదీ అరేబియా తాను ఎప్పటిలాగే చేసే సరఫరాకు అదనంగా సరఫరా చేయడానికి అంగీకరించింది. ఈ అంగీకారం తర్వాతే ఇరాన్ నిర్ణయం వెలువడింది.

ఇటీవలి వరకూ ఇరాన్, ఇండియాల మద్య సత్సంబంధాలే ఉండేవి. పాకిస్ధాన్ మీదుగా పైపులైన్ నిర్మించి గ్యాస్ సరఫరా చేయడానికి ఇరాన్, ఇండియాలో పది సంవత్సరాల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మన్మోహన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దానితో పైప్ లైన్ ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకుంది. ఇందులో ఇండియా ప్రధాని మన్మోహన్ పాత్ర అధికంగా ఉంది. అమెరికా ఒత్తిడి వలన ఇండియా, ఇరాన్ లు నష్టపోయాయి తప్ప అమెరికాకి ఏ నష్టమూ లేదు. ఇరాన్‌పై అమెరికా అధిపత్యం రుజువు చేసుకోవడానికి అమెరికా తెచ్చిన ఒత్తిడికి లొంగిపోవడం భారత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పు. పైపులైన్ ఒప్పందం రద్దుతో పాటు భద్రతా సమితి ఇరాన్ పై ఆంక్షలు విధిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది. దీనితోనే ఇరాన్‌తో సంభంధాలు క్షీణించాయి.

ఐతే అంతర్జాతీయ ఆంక్షలు ఉన్న నేపధ్యంలో ఇరాన్ ఒంటరైన పరిష్దితిని ఇండియా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియాకి సరఫరా మానేస్తే ఇరాన్‌కే నష్టం అని భారత అధికారి ఒకరు చెప్పడం దానికి రుజువు. అగ్ర రాజ్యంతో చేరి దాని మెంటాలిటీని భారత అధికారులు అలవరుచుకున్నట్లు కనిపిస్తొంది. అది అవాంఛనీయం.

వ్యాఖ్యానించండి