అదంతా నా సోదరిపై దుష్ప్రచారం -స్ట్రాస్ కాన్ బాధిత మహిళ సోదరుడు


Dominique Strauss-Kahnఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్‌పై రేప్ ఆరోపణలు చేసిన మహిళ డ్రగ్స్ ముఠాలతోనూ, మనీ లాండరింగ్ ముఠాలతోనూ సంబంధాలున్నాయని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు కనుగొన్నట్లుగా వచ్చిన వార్తలను ఆమె సోదరుడు తీవ్రంగా ఖండించాడు. అదంతా తన సోదరిపై జరుగుతున్న దుష్ప్రచారమేననీ, ఆమెపై లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ రెలిపింది. ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాలకు తన సోదరిని బలి చేస్తున్నారని వాపోయాడు.

“నా సోదరిని అపఖ్యాతిపాలు చేయడానికి కనిపెట్టిన అబద్ధాలే ఇవన్నీ” అని గినియా మహిళ సోదరుడుగా రాయిటర్స్ చెబుతున్న మమౌదౌ చెప్పాడని ఆ సంస్ధ వెల్లడించింది. మమౌదౌను రాయిటర్స్ సంస్ధ టెలిఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలిపింది. గినియా రాజధాని కొనాక్రి కి ఉత్తరంగా 300 కి.మీ దూరంలో ఉన్న లాబె నుండి అతను మాట్లాడని తెలిపింది. మహిళ గుర్తింపును కాపాడడానికి మమౌదౌ కుటుంబ పేరును బైటపెట్టడం లేదని పేర్కొంది.

బలాత్కారం అరోపణలు వెలువడ్డాక తన సోదరితో మాట్లాడలేదని మమౌదౌ చెప్పాడు. మహిళ ఆరోపణల ఫలితంగా డొమినిక్ స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడమే కాక ఫ్రాన్సు అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలను కూడా జారవిడుచుకున్న సంగతి విదితమే. గినియా కడు పేద దేశం. అక్కడి ప్రజలు ముస్లిం మతస్ధులు. దైవాన్ని గాఢంగా నమ్మే ప్రజలు.

మమౌదు, ఆఫ్రికా నుండి వలస వెళ్ళిన తన సోదరి సంపన్నవంతమైన పశ్చిమ దేశాల ప్రపంచంలో నిష్పాక్షికంగా తీర్పు పొందగలదో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశాడు. “దేవుడిని నమ్మనప్పుడు మీరు ఏం చేయడానికైనా సమర్ధులు” అని ఆయన అన్నాడు. మే నెలలో రాయిటర్స్ సంస్ధ మహిళ సోదరుడిని గుర్తించిందని ఆ సంస్ధ తెలిపింది. అమెరికా లాయరు ఇచ్చిన సమాచారంతోనూ, న్యూయార్క్ లోని గినియా ప్రజలతో మాట్లాడ్డం ద్వారానూ, గినియా రాజధాని కొనాక్రిలో నివసిస్తున్న లాబె ప్రాంతవాసులతో మాట్లాడ్డం ద్వారా బాధిత మహిళ సోదరుడిని గుర్తించినట్లు రాయిటర్స్ తెలిపింది.

డొమినిక్ స్ట్రాస్ కాన్ పై ఉన్న కేసు అనూహ్య మలుపు తిరిగిందని భావిస్తున్న తరుణంలో రేప్ నేరం ఆరోపించిన మహిళ సోదరుడి ప్రకటన, పరిస్ధితిని యధాతధ స్ధితికి తెచ్చిందని భావించవచ్చునా? మమౌదు చెప్పినట్లు సంపదలతో పాటు పలుకుబడి కూడా ఉన్న స్ట్రాస్ కాన్‌కి ఆయన స్వదేశంలోని రాజకీయ పార్టీ కూడా మద్దతు ఉండడం సహజమే. స్ట్రాస్ కాన్‌కి జరిగిన నష్టం ఆ పార్టీకి కూడా నష్టంగా పరిణమిస్తుంది. రానున్న ఎన్నికల్లో నికొలస్ సర్కోజిపై సునాయాసంగా గెలవగలడని భావించిన స్ట్రాస్ కాన్, ఆయన పార్టీ తమ భవిష్యత్తు కోసం మమౌదు అనుమానాన్ని నిజం చేసే అవకాశాలను కొట్టిపారవేయలేం. ప్రస్తుత సమాజం ధనికుల పక్షమేనన్నది చేదు వాస్తవం

2 thoughts on “అదంతా నా సోదరిపై దుష్ప్రచారం -స్ట్రాస్ కాన్ బాధిత మహిళ సోదరుడు

  1. అతిగా కెలుకుడు కెలకుచు
    మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్‌
    కుతిదీరక నెనఱించిన
    గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్‌

  2. ఎబిసిడి గారూ,

    పద్యం అర్ధం ఏంటో తెలియడం లేదుగానీ, రచనలోని పటిమకు అభినందనలు అందుకోండి.

వ్యాఖ్యానించండి