వన్‌డే, టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇండియా పర్యటించనున్న పాకిస్ధాన్


Cricket-diplomacy

పాక్, ఇండియాల మధ్య వరల్డ్ కప్ సెమీఫైనల్‌ మ్యాచ్ తిలకిస్తున్న సోనియా, యూసఫ్ రజా గిలానీ, మన్మోహన్ సింగ్

ముంబై టెర్రరిస్టు దాడులతో ఇండియా, పాకిస్ధాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలను కూడా ఇండియా తెంచుకున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడిన దాయాదులు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రక్రియను క్రికెట్ దౌత్యంతో ప్రారంభించారు. ఇండియా ప్రధాని, ఇండియా, పాక్‌ల సెమీఫైనల్ మ్యాచ్ తిలకించడానికి పాక్ ప్రధానిని ఆహ్వానించగా ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించి సంబంధాల మెరుగుదలకు తాము సిద్ధమని తెలిపాయి. జూన్ నెలలో భారత విదేశీ సెక్రటరీ నిరుపమారావు శాంతి చర్చల నిమిత్తం పాక్ వెళ్ళి పరస్పర అవగాహనకు మరొక అడుగు వేసింది.

తాజాగా 2012 సంవత్సరంలో పాకిస్ధాన్ క్రికెట్ జట్టు ఇండియా పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ టూర్ లో 3 వన్‌డేలు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడతారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పాక్ టూర్ ఉంటుందని ఐ.సి.సి మ్యాచ్‌ల టైం టేబుల్ ద్వారా తెలిసింది. పాక్ టూర్ కి ముందు ఇండియా రెండున్నర నెలల పాటు ఆస్ట్రేలియా పర్యటించి వస్తుందని టైం టేబుల్ తెలిపింది. 4 టెస్టులు 8 నుండి 11 వరకూ వన్‌డేలు ఆస్ట్రేలియా టూర్ లో భారత జట్టు ఆడుతుంది.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వెస్ట్ ఇండీస్ జట్టు ఇండియా పర్యటించి 3 టెస్టులు 5 వన్‌డేలు ఆడుతుంది. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఇంగ్లండు జట్టు భారత్ కి రానున్నదని తెలుస్తోంది. మొత్తం మీద ఇండియా క్రికెట్ జట్టుకు విశ్రాంతి దుర్లభం అయ్యేటట్లుంది. మ్యాచ్‌లు లేదా టూర్ల మద్య తగినంత విశ్రాంతి కావాలని ధోని లాంటివారు డిమాండ్ చేస్తున్నా, బిసిసిఐ అదేమీ పట్టించుకున్నట్లు లేదు. ఇంగ్లండు టూర్ వివరాలను బిసిసిఐ బుధవారం ప్రకటించింది. 5 వన్‌డేలు 1 టిట్వంటీ మ్యాచ్ ఆడతారు. అక్టోబరు 14, 26 తేదీల మధ్య హైద్రాబాదు, ఢిల్లీ, మొహాలి, ముంబై, కోలకతాల్లో వన్డేలు జరుగుతాయి. టి ట్వంటీ అక్టోబరు 29 న జరుగుతుంది.

2018లో అంతర్జాతీయ టోర్నమెంటు నిర్వహిస్తానని పాక్ కోరినట్లుగా ఐసిసి తెలిపింది. అప్పటి షేడ్యూలు వరకూ ఇంకా వెళ్ళనందున హామీలేవీ ఇవ్వలేదు, పుచ్చుకోలేదు అని ఆ సంస్ధ తెలిపింది. ఆటగాళ్ళ బద్రత అన్నీ చూసి నిర్ణయించాలని తెలిపింది. 2009 లో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగినప్పటినుండీ పాక్ టూర్ అంటెనే ఆటగాళ్ళు భయపడుతున్నారు. ఫలితంగా పాక్ పర్యటించి ఆడవలసిన ఆస్ట్రేలియా టూర్‌ను ఇంగ్లండులో నిర్వహించవలసి వచ్చింది. రానున్న రోజుల్లో పాకిస్ధాన్ శ్రీలంక, ఇంగ్లండులతో ఆడవలసి ఉండగా ఆ మ్యాచ్‌లు యు.ఎ.ఇ లో జరగనున్నాయి. దుబాయి, అబుదాబి నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇస్తాయి.

వ్యాఖ్యానించండి