ఇండియా పశుదాణా ఎగుమతుల్లో ప్రమాదకరమైన రసాయనం -చైనా హెచ్చరిక


ఇండియా నుండి ఎగుమతి అవుతున్న పశువుల దాణాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చైనా క్వాలిటీ విభాగం హెచ్చరించింది. చైనా ఆరోపణలను అధ్యయనం చేస్తున్నట్లు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ బి.వి మెహతా చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రమాదకరమైన రసాయనం “మాలఖైట్ గ్రీన్” భారతదేశం నుండి దిగుమతి అయిన ‘రేప్ గింజల గానుగ పిండి’ (rapeseed meal – రేప్ గింజల నుండి నూనె తీయగా మిగిలే పిప్పి) లో కనుగొన్నామని చైనా సంస్ధ తెలిపింది.

చైనాలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిటీ సూపర్‌విజన్, ఇన్‌స్పెక్షన్ అండ్ క్వారంటైన్ (General Administration of Quality Supervision, Inspection and Quarantine) విభాగం యొక్క ఫ్యుజియన్ బ్రాంచి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, గువాంగ్ డాంగ్ రాష్ట్రానికి దిగుమతి ఐన సరుకులో ఈ రసాయనాన్ని కనుగొన్నామని తెలిపింది. భవిష్యత్తులో అటువంటి సరుకులు వచ్చినట్టయితే తిప్పి పంపడం గానీ లేదా నాశనం చేయడంగానీ చేస్తామని ఆ సంస్ధ తెలిపింది. ఈ పరిశ్రమకి సంబంధించిన భారత అధికారులు ఇంతవరకూ చైనా వెళ్ళిన ఏ కార్గోను కూడా రద్దు చేయడం జరగలేదని తెలిపారు.

భారత దేశంలో వ్యవసాయ సరుకుల ఎగుమతిదారుల్లో అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన వాణిజ్య కంపెనీ సి.ఇ.ఓ మాట్లాడుతూ “అసలేం జరిగిందీ మాకింకా సమాచారం అందలేదు. చైనా పెద్ద మొత్తంలో రేప్ గింజల పిప్పిని దిగుమతి చేసుకుని ఉండవచ్చు. దానివలన స్ధానిక పరిశ్రమకు నష్టం వాటిల్లడంతో వారు అలా చెప్పడానికి అవకాశం ఉంది” అని చెప్పాడు. ఈయన పేరు చెప్పడానికి నిరాకరించాడని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. కానీ గతంలో గుంటూరుకి చెందిన ప్రముఖ పొగాకు వ్యాపారి రష్యాకు పొగాకు ఎగుమతుల పేరుతో రాళ్ళు ఎగుమతి చేసి ఆ దేశం చేత శాశ్వతంగా నిషేధానికి గురైన సంగతి జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.

రానున్న మూడు సంవత్సరాల్లో చైనాకు వెళ్ళే ఆయిల్ మీల్ (వివిధ గింజలనుండి నూనె తీయగా మిగిలిన పిప్పి) ఎగుమతులను రెట్టంపు చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. జనవరి నుండి మే నెల వరకూ చైనా మొత్తం 771,000 టన్నుల రేప్ గింజల పిప్పిని దిగుమతి చేసుకుందనీ, ఇది సంవత్సరం చేసుకున్న దిగుమతి కంటె 82 శాతం ఎక్కువనీ జర్నల్ ‘చైనా జాతీయ ధాన్యం మరియు నూనెల సమాచార కేంద్రం’ ను ఉటంకిస్తూ తెలిపింది. ఈ కేంద్రం ‘సాధారణ కస్టమ్స్ పాలనా విభాగం’ నుండి సమాచారం సేకరించినట్లు తెలిపింది. అదే ఇండియా నుండి జనవరి, మే నెలల మధ్య కాలంలో 351,000 టన్నులు దిగుమతి చేసుకుందనీ, అది సంవత్సరం కిందటితో పోల్చితే 89 శాతం అధికమనీ కేంద్రం తెలిపింది.

చైనా ఇండియా నుండి పెద్ద మొత్తాల్లో రేప్ గింజల పిప్పి, సోయా పిప్పి తో పాటు కొద్ది మొత్తాల్లొ వేరుశనగ పిప్పి కూడా దిగుమతి చేసుకుంటుందని తెలుస్తోంది. ఆయిల్ మీల్ ను ఇండియానుండి జపాన్ అన్ని దేశాల కంటె అధికంగా దిగుమతి చేసుకుంటుంది. గత మార్చితో ముగిసిన సంవత్సరంలో జపాన్ మొత్తం 5.1 మిలియన్ టన్నుల ఆయిల్ మీల్, ఇండియా నుండి దిగుమతి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 59 శాతం అధికం. అలాగే వియత్నాం, దక్షిణ కొరియా, ఇండొనేషియా దేశాలు కూడా ఇండియా నుండి నూనె గింజల పిప్పిని దిగుమతి చేసుకుంటున్నాయి.

వ్యాఖ్యానించండి