
ఆరుబయట నిలవ చేసిన ధాన్యం బస్తాలను టార్పాలిన్ కవర్‌తో కప్పి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న రైతు / కార్మికుడు
ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే సమయమనీ ప్రకటించేలా చేసింది. కానీ గత సంవత్సరం ‘ఆహార భద్రతా బిల్లు’ పై దేశవ్యాపిత చర్చను ప్రారంభించడంతో ఆహార భద్రత కోసం పెద్ద ఎత్తున ధాన్యం అవసరం ఉంటుందని ప్రభుత్వంలోని సోనియా వర్గం భావించడంతో శరద్ పవార్ ఆటలు సాగలేదు.
ఇప్పుడు బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడానికి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎగుమతులు బంగ్లాదేశ్ వరకేనా లేక విదేశీ మార్కెట్ మొత్తానికి ఇది వర్తింసుందా అన్న విషయం స్పష్టం కాలేదు. ఎందుకంటే ఎగుమతులపై నిషేధం ఉన్నపుడు కూడా ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి ప్రాతిపదికన బంగ్లాదేశ్ కి ధాన్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు కూడా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ మాత్రమే బంగ్లాదేశ్ కు అమ్మదలచినట్లుగా ధరపై వర్తమానం పంపినట్లుగా ప్రకటించింది తప్ప వ్యాపారులకు కూడా ఎగుమతుల అనుమతి ఇచ్చిందీ లేనిదీ తెలియలేదు.
టన్నుకి 547 డాలర్ల చొప్పున 200,000 టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (parboiled rice) బంగ్లాదేశ్‌కు ఎస్.టి.సి అమ్మజూపింది. అమెరికా తర్వాత వరి, గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి దేశాలలో ఇండియాదే అగ్ర స్ధానం. వరసగా ఐదు సంవత్సరాలు వర్షాభావం ఏర్పడడంతో ఈ రెండు ధాన్యాల ఎగుమతులపై కేంద్ర మూడేళ్ళనుండి నిషేధం విధించింది. నిషేధం ఉండగానే ఆగష్టు 2010లో పైన చెప్పిన విధంగా బంగ్లాదేశ్‌కి ఎగుమతులకు అనుమతి లభించింది. ధరలపై చర్చలవలన ఆ ఎగుమతుల్లో ఆలస్యం జరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆలస్యమైన ఎగుమతులే ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపింది. ఇది ఎగుమతులకు పచ్చా జెండా ఊపినట్లో కాదో తెలియడం లేదు.
ఐతే బుధవారం ఆహార మంత్రి కె.వి.ధామస్ తమ ప్రభుత్వం ఎగుమతులను పరిగణించడానికి సిద్ధంగానే ఉందనీ, 3.0 మిలియన్ టన్నుల వరకూ ప్రభుత్వ నిల్వలను అమ్మగలమని ప్రకటించాడు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 66 మిలియన్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయనీ, ఇంత మొత్తంలో ప్రభుత్వం వద్ద ఎన్నడూ నిలవ లేవనీ తెలుస్తోంది. గిడ్డంగులు ఖాళీ లేవని ప్రభుత్వాలు చెపుతున్నా నిజానికి గిడ్డంగులను ప్రవేటు వ్యక్తులకు మద్యంలాంటి సరుకుల నిల్వలకు అద్దెకి ఇచ్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్‌కి 200,000 టన్నుల బాసుమతియేతర బియ్యం, 100,000 టన్నుల గోధుమలు ఎగుమతి చేయడానికి గతంలో ప్రభుత్వం ఎస్.టి.సికి అనుమతి ఇచ్చింది. మరో ప్రభుత్వ రంగ సంస్ధ పి.ఇ.సి లిమిటెడ్‌కు మరొక 100,000 టన్నుల బియ్యం, 100,000 టన్నుల గోధుమలు బంగ్లాదేశ్‌కే ఎగుమతి చేసే విషయం చూడమని ప్రభుత్వం చెప్పింది. వీటన్నింటికంటె మంత్రి అమ్మజూపిన ధాన్యం మొత్తం (3 మిలియన్ టన్నులు) అధికంగా ఉన్నందున ప్రభుత్వం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నదని భావించవచ్చు. కానీ ప్రభుత్వ నిల్వలకు మాత్రమే ఆ అనుమతి ఉన్నట్లు మంత్రి ప్రకటన ద్వారా అర్ధమవుతోంది.
రానున్న పది రోజుల్లో ఇండియా అమ్మ జూపిన ధర బంగ్లాదేశ్‌కి అంగీకారం ఉందీ లేనిదీ చెప్పాలని కోరామని ఒక అధీకారి తెలిపాడు. టన్ను ధర 547 డాలర్లు కాగా, మరో 79 డాలర్లు (టన్నుకు) రవాణాకూ, భీమాకీ ఇవ్వాలని ఆ అధికారి తెలిపాడు. బియ్యం ధరలపై రెండు దేశాల మధ్య ఒప్పందం ఉంది తప్ప గోధుమల విషయంలో లేదని తెలుస్తోంది. దానిక్కారణం ఆ దేశం గోధుమలను దిగుమతి చేసుకునే అవకాశాలు తక్కువని ఎస్.టి.సి అధికారి తెలిపాడు. భారత గోధుమల్లో ఎక్కువ పోషక విలువలు ఉన్నందున వాటి ధర ఎక్కువనీ, డిస్కౌంట్ ఇచ్చాక కూడా ఆ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఇతర రకాల గోధుమలతో పోలిస్తే ఎక్కువేనని బంగ్లాదేశ్ ఎగుమతులకు అవకాశం లేకపోవడానికి అదే కారణమనీ ఆయన తెలిపాడు.
భారత గోధుమలలో ప్రొటీన్ భాగం ఎక్కువగా ఉంటుంది కనక టన్నుకు 360 నుండి 375 డాలర్ల వరకూ ఉంటుందనీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న తక్కువ ప్రోటీన్లున్న గొధుమలు టన్నుకు 320 డాలర్లు పలుకుతున్నాయనీ ఆయన తెలిపాడు. సంవత్సరానికి జూన్ వరకు భారత దేశంలో ధాన్యం ఉత్పత్తి 235.88 మిలియన్ టన్నులు ఉన్నప్పటికీ ఆహార భద్రతా చట్టం ద్వారా ప్రభుత్వం 70 శాతం జనాభాకి ఆహార లభ్యతను గ్యారంటీ చేయనున్నందున ధాన్యం ఎగుమతి పట్ల కేంద్రం ఈ మద్య జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
