జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్


Christine_lagardeఅంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్‌” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్‌స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలు ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల అనంతరం మెరుగైన ఓటింగ్ సౌకర్యం పొందడంతో వాటి మద్దతు కీలకంగా మారింది. ఎమర్జింగ్ దేశాలు యూరప్ అభ్యర్ధికి వ్యతిరేకంగా నిలబడినవారికి మద్దతు ఇస్తాయని ఆశించిన వారికి చైనా ఆశాభంగం కలిగించిందని చెప్పవచ్చు.

55 సంవత్సరాల క్రిస్టిన్ లాగార్డే, ఐ.ఎం.ఎఫ్ కు మొట్టమొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్. యూరో జోన్ దేశాలు అప్పు సంక్షోభంలో మునిగి ఉన్న నేపధ్యంలో ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవి తమకే దక్కాలని అవి కోరుకున్నాయి. మొదటి నుండీ ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అమెరికా అభ్యర్ధిని నియమించగా, ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి యూరప్ దేశాలు తమ అభ్యర్ధిని నియమించుకునేవి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్డ్ జోలిక్ పదవీ కాలం వచ్చే సంవత్సరం మధ్యలో ముగుస్తుంది. ఆ పదవికి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ నియమితురాలు కానున్నట్లు అప్పుడే వార్తలు వస్తున్నాయి. హిల్లరీ కూడా ప్రపంచ బ్యాంకు పదవిని కోరుకుంటున్నట్లు ఆమె సన్నిహితులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

మంగళవారం అమెరికా లాగార్డేకి మద్దతు ప్రకటించాక లాగార్డే ఎన్నిక దాదాపుగా ధృవపడింది. ఆమెకు ఎమర్జింగ్ దేశాలు చైనా, ఇండొనేషియా, చైనా, బ్రెజిల్, రష్యాలు మద్దతు ప్రకటించడంతో ఆమె ఎన్నిక ఖాయమేనని భావించారు. అయితే ఆమె ప్రత్యర్ధి అగస్టిన్ ప్రపంచ దేశాలు పర్యటించి మద్దతు కూడగట్టుకోడానికి ప్రయత్నించడంతో కొంత పోటీ వాతావరణం తలెత్తింది. కానీ ఆయనకు లాటిన్ అమెరికా దేశాలు తప్ప ఇతర దేశాలు మద్దతు ఇవ్వలేదు. ఆఫ్రికా, ఆసియా, యూరప్ లు చాలా వరకూ లాగార్డేకే మద్దతునిచ్చాయి. అత్యధిక దేశాలు మద్దతు ప్రకటించడంతో ఐ.ఎం.ఎఫ్ బోర్డు లాగార్డెని ఎంపిక చేసింది.

వ్యాఖ్యానించండి