ఇంటర్నెట్‌ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్


తమది గొప్ప ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశాలే ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని కోరిన వాటిలో ముందుంటున్నాయి. గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం అమెరికా, బ్రెజిల్ ల తర్వాత ఎక్కువసార్లు వినియోగదారులపై నిఘా పెట్టమనిగానీ, వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వమని గానీ భారత ప్రభుత్వమే ఎక్కువ సార్లు కోరింది. గత సంవత్సరం (2010) జులై నుండి డిసెంబరు లోపు భారత ప్రబుత్వం 1699 సార్లు యూజర్ ఎకౌంట్ల సమాచారాన్ని కోరిందని గూగుల్ తెలిపింది. గూగుల్‌ని వినియోగదారుల సమాచారాన్ని 25 దేశాలు కోరాయని ఆ సంస్ధ తెలిపింది.ఇండియా ప్రభుత్వం కోరిన సమాచారాన్ని కొన్నింటికి పూర్తిగానూ, మరికొన్నింటిగానూ పాక్షికంగానూ సమాచారం అందించినట్లు కూడా గూగుల్ తెలిపింది. మొత్తం మీద భారత ప్రభుత్వం సమర్పించిన వినతుల్లో 79 శాతం వాటికి పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ సమాచారం ఇచ్చానని ఆ సంస్ధ తెలిపింది. అంటే గూగుల్ ముందు భారత ప్రభుత్వం జులై నుండి డిసెంబరు వరకూ ఆరు నెలల్లో 1699 సార్లు యూజర్ల సమాచారం కోరితే, గూగుల్ 1342 సార్లు వివిధ స్ధాయిల్లో సమాచారం ఇచ్చిందన్న మాట!

గూగుల్ పారదర్శకత పేరుతో గత సంవత్సరం నుండి ప్రభుత్వాల సమాచార సేకరణపై వివరాలను విడుదల చేస్తున్నది. ప్రతి ఆరు నెలలకు ఈ సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం పైన చెప్పిన కాలంలోనే 282 అంశాలను తొలగించమని 67 సార్లు కోరిందని చెప్పింది. అయితే బ్రెజిల్, జర్మనీలతో పోలిస్తే ఇవి తక్కువేనని తెలిపింది. బ్రెజిల్ 12,000 అంశాలను తొలగించమని 263 సార్లు కోరగా, జర్మనీ 118 సార్లు కోరిందని గూగుల్ తెలిపింది. గత సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ప్రభుత్వాలనుండి అందిన వినతులతో పోలిస్తే జులై నుండి డిసెంబరు వరకు అందిన వినతుల సంఖ్య రెట్టింపయ్యిందని తెలిపింది. ఈ  మొత్తంలో 22 శాతం వరకే గూగుల్ స్పందించి సమాచారం ఇచ్చిందట. కాని బ్రెజిల్ ఇచ్చిన వినతుల్లో 76 శాతానికి స్పందించినట్లు సంస్ధ తెలిపింది.

“చట్టాలను అమలు చేసే సంస్ధలు బ్లాగ్‌ లను తొలగించమనీ, యూట్యూబ్ లో ఉన్న వీడియోలను తొలగించమనీ అడిగారు. ముఖ్యమంత్రులను విమర్శించేవీ లేదా వివిధ రాష్ట్రాల్లోని సీనియర్ అధికారులను విమర్శించేవీ ఇలా తొలగించాలని కోరిన బ్లాగులు, వీడియోలూ ఉన్నాయి” అని గూగుల్ వెల్లడించింది. “కాని అటువంటి వినతులకు మేము స్పందించలేదు” అని చెప్పింది. ప్రభుత్వాలు అడిగే సమాచారం స్వభావం, నిర్ధిష్టతలను బట్టి సమాచారం ఇవ్వడం జరుగుతుందని గూగుల్ ఎఫ్.ఎ.క్యూలలో గూగుల్ చెబుతుంది.

“ఇండియానుండి వచ్చిన వినతుల్లో ఆరు కోర్టునుండి వచ్చాయి. అందులో నాలుగు బ్లాగ్‌లలోని అంశాలకు సంబంధించినవి” అని సంస్ధ తెలిపింది. ఇండియాలో ప్రభుత్వాలు సమాచారం కోరినప్పుడు  వినియోగదారులకు ఉండే అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛకూ, బ్లాగుల్లోని ఆయా అంశాల స్వభావానికి మధ్య గూగుల్ సమతూకంగా స్పందించడానికి ప్రయత్నించినట్లుగా తెలిపింది. అంటె కొన్ని సార్లు ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్ధలు ఆయా అంశాలు జరగకూడని పరిమాణాలకు దారితీయవచ్చని అనుమానించినప్పుడు స్పందించక తప్పదని గూగుల్ అభిప్రాయం. “స్వేచ్ఛగా మాట్లాడే హక్కునూ, రాజకీయ హక్కునూ ఇండియా గుర్తిస్తుంది. కానీ ఆ హక్కులు కొన్ని సార్లు హింసకు దారితీసే అవకాశం ఉందని ప్రభుత్వ సంస్ధలు చెబుతాయి” అని గూగుల్ కి చెందిన న్యాయ సలహాదారు నికోల్ వాంగ్ చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.

అప్‌డేట్

గూగుల్ ఉత్పాదనల వారీగా తొలగింపు అభ్యర్థనల సంఖ్యను వాటి కారణాలను, వాడుకరుల భోగట్టా గురించి అభ్యర్థనల సంఖ్యలను ఇక్కడ చూడవచ్చు: http://www.google.com/transparencyreport/governmentrequests/IN/?p=2010-12 (సమాచారం అందించినవారు: వీవెన్)

One thought on “ఇంటర్నెట్‌ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్

  1. గూగుల్ ఉత్పాదనల వారీగా తొలగింపు అభ్యర్థనల సంఖ్యను వాటి కారణాలను, వాడుకరుల భోగట్టా గురించి అభ్యర్థనల సంఖ్యలను ఇక్కడ చూడవచ్చు: http://www.google.com/transparencyreport/governmentrequests/IN/?p=2010-12

వ్యాఖ్యానించండి