ఆయిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయాల్సిందే -అహ్లూవాలియా


ధనిక స్కూళ్ళలో చదివి, ఆక్స్‌ఫర్డ్ లోనో, హార్వర్డ్ లోనో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఐ.ఎం.ఎఫ్ లాంటి ప్రపంచ వడ్డీ వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం చేసినవాళ్ళని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఏమవుతుంది? “నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే, ఒరే” అని ఓ కవి పాడినట్లుగానే అవుతుంది.

భారత దేశ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పరిస్ధితి కూడా అలాంటిదే. “ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు ఆ భారం ప్రజలమీద మోపడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్దంగా ఉండాల్సిందే” అని ఈ మేధావి ఓ గొప్ప సత్యాన్ని సెలవిచ్చాడు. రెండు రోజూల క్రితం భారత ప్రభుత్వం డీజెల్ రేటు 9 శాతం పెంచింది. గ్యాస్ రేటు దాదాపు 14 శాతం పెంచింది. అంతటితొ ఆగిపోతే అహ్లూవాలియాకి ఈ ప్రకటన చేసే శ్రమ తప్పేదేమో.

కాని కేంద్ర ప్రభుత్వం డీజెల్, గ్యాస్ రేట్లు పెంచడంతో పాటు డీజెల్ పైన ఎక్సైజు పన్ను కొంత తగ్గించింది. క్రూడాయిలు, పెట్రోలు ఉత్పత్తులపైన కస్టమ్స్ పన్ను కూడా కొంత తగ్గించింది. తద్వారా ప్రజలపైన పెద్ద భారం వేయలేదని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కంట్రోలు ఎత్తేశాక ఇప్పటికి పెట్రోల్ రేట్లను డజనుసార్లకు పైగా పెంచింది ప్రభుత్వం. ప్రపంచంలో ఆయిల్ అత్యధికంగా వినియోగించే దేశాలు సమావేశం అయ్యి తమ రిజర్వు నిలవలను పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయిస్తే క్రూడాయిల్ షేర్లు 10 శాతం పైగా పడిపోయాయి. కాని ఆ తగ్గుదలని ప్రజలకు అందలేదు. పెరిగితే మాత్రం మొహమాటం లేకుండా ప్రజల్ని బాదాల్సిందేనని అహ్లూవాలియా కేంద్ర ప్రభుత్వానికి బోధిస్తున్నాడు.

ఈ అహ్లూవాలియా పూర్వాశ్రమంలో ఐ.ఎం.ఎఫ్ ఉద్యోగి. 28 ఏళ్ళ వయసులోనే ప్రపంచ బ్యాంకులో ఒక డివిజన్‌కి ఛీఫ్ గా పని చేసిన మేధావి. ఐ.ఎం.ఎఫ్ ఎం.డి రేప్ కేసులో ఇరుక్కుని దిగిపోయాక ఆ పదవికి ఎన్నిక కాగల అవకాశాలు ఉన్నవారిలో అహ్లూవాలియా పేరు కూడా వినపడింది. కానీ ఆయనే నాకు ఆసక్తి లేదని అనేశాడు. వడ్డీ వ్యాపారంతో మూడో ప్రపంచ దేశాలను కుళ్ళబొడిచే ఐ.ఎం.ఎఫ్ లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన అహ్లూవాలియాకి భారతదేశం అంటే ఏంటో అర్ధం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కాకుంటే భారత దేశ ప్రజల ఆర్ధిక స్ధితిగతులు తెలిసినవారుగానీ, ప్రజల చేత నేరుగా ఎన్నికయినవారు గానీ ఇంత రెటమతంగా పెట్రోల్ రేటు పెరిగినప్పుడల్లా ప్రజల్ని బాదాల్సిందే అని స్టేట్‌మెంట్ ఇవ్వగలరా?

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ రోధమ్ క్లింటన్ భారత దేశ ఆర్ధిక మంత్రిగా ఉండాలని కోరుకుంది ఈ మహానుభావుడినే. “ఈ ప్రణబ్ ముఖర్జీ ఎవరు? అహ్లూవాలియా కాకుండా ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా ఎందుకు నియమించారు. ఈయన అమెరికాకి అనుకూలుడేనా?” అని ఆవిడ అసహనం వ్యక్తం చేసినట్లు వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటిక్ కేబుల్ వెల్లడించింది. డీజెల్ పైన కస్టమ్స్ పన్ను, ఎక్సైజ్ పన్ను తగ్గించినందుకు ప్రభుత్వం పైన రు.490 బిలియన్ (49,000 కోట్ల రూ.లు) భారం పడిందని అహ్లూవాలియా తెగ బాధపడుతున్నాడు. దానివలన ఇండియా బడ్జెట్ లోటు తగ్గే అవకాశాలు తగ్గిపోయాయని ఆయనకి బాధగా ఉంది.

పన్నులు తగ్గిస్తేనో, ఆయిల్ రేట్లు జనాలమీద వెయ్యకపోతేనో, వేతన జీవులకు సహజంగా పెరిగే కరువుభత్యం పెరిగితేనో, లేక వేజ్ రివిజన్ జరిగితేనో ప్రభుత్వాలు తమ పైన ఇంత భారం పడింది అని భారంగా నిట్టూర్పు విడుస్తుంటాయి. వీళ్ళ జేబులో సొమ్ములు కాజేసినట్లే ఫీలింగిస్తారు. అది కూడా వాస్తవమేనేమో. జీతాలు పెంచకుండా, ఆయిల్ రేట్లు జనాలపైకి నెడుతూ, డి.ఎ లాంటివేవీ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆ సొమ్మంతా కాంట్రాక్టుల్లో నొక్కేసి విదేశాల్లో స్విస్ జేబుల్లోకి తరలించుకుపోవచ్చుగదా.

వ్యాఖ్యానించండి