“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ) పరిశీలకులను ఇజ్రాయెల్‌లోకి అనుమతించనప్పటికీ ఆ విషయంపై పశ్చిమ దేశాలు ఒక్క ముక్క కూడా మాట్లాడవు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేనప్పటికీ, ఐ.ఎ.ఇ.ఏ పరిశీలకులను అనేక సార్లు అనుమతి ఇచ్చినప్పటికీ, అణ్వాయుధాలు తయారు చేయడం తమ లక్ష్యం కాదనీ, కేవలం ఎనర్జీ, వైద్య ప్రయోజనాలకు మాత్రమే తాము యురేనియం శుద్ది చేస్తున్నామని ఇరాన్ అనేక సార్లు ప్రకటించినా పశ్చిమ రాజ్యాలు కక్ష గట్టి అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేయాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఇప్పటికీ నాలుగు సార్లు అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధించారు.
ఈ నేపధ్యంలోనే ఇరాన్ తాజా ప్రకటన చేసింది. రెండు రోజులనుండీ ఇరాన్ యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నది. మంగళవారం 14 మిసైళ్ళను ప్రయోగించి పరీక్షించింది. ఇజ్రాయెల్, అమెరికా లకు తన ఆయుధ సంపత్తిని చూపడానికే ఈ పరీక్షలని కూడా ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నదని రుజువైతే ఇరాన్ పై దాడి చేయడానికి కూడా వెనకాడమని ఇజ్రాయెల్, అమెరికాలు అనేక సార్లు ప్రకటించాయి. ఇరాన్ అణ్వాయుధ నిర్మాణాన్ని ఆపడంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే మిలట్రీ దాడులు తప్పవని ఇవి ప్రకటించాయి. వీరి ప్రకటనలను గుర్తు చేస్తూ, “తమపై దాడి చేస్తే తిరిగి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ హెచ్చరిక చేసింది. మంగళవారం పరీక్షించిన మిసైళ్ళలో 2000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని తాకగల మిసైళ్ళు కూడా ఉన్నాయి. ఒకే టార్గెట్ పైన ఒకే సారి రెండు మిసైళ్ళను ప్రయోగించి పరీక్షించామని ఇరాన్ అధికారిక వార్తా సంస్ధ ఇర్నా తెలిపింది.
“జియోనిస్టు ప్రభుత్వాన్నీ (ఇజ్రాయెల్), అమెరికా స్ధావరాలనూ దృష్టిలో పెట్టుకుని మా మిసైళ్ళ రేంజిని రూపొందించాము” అని ఇరాన్ సైనిక కమాండర్ అమీర్ ఆలి హాజిజాడే తెలిపాడని ఇరాన్ వార్తా సంస్ధ ఫార్స్ తెలిపింది. ఈ వార్తా సంస్ధ పాక్షికంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. తొమ్మిది జెల్‌జాల్ మిసైళ్ళు, సాహబ్-1, 2 మిసైళ్ళు రెండు రెండు చొప్పున, ఒక సాహబ్-3 మిసైల్ నూ ఇరాన్ సైన్యం పరీక్షించిందని ఇర్నా తెలిపింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా యుద్ధాలు విజయం దిశగా లేకపోవడంతోనే ఇరాన్ ధైర్యం సమకూర్చుకున్నదని రాయిటర్స్ వార్తా సంస్ధ అభిప్రాయపడింది. ఈ రెండు దేశాలతో పాటు మధ్య ప్రాచ్యంలో ఇతర చోట్ల కూడా అమెరికా సైనిక స్ధావరాలు ఉన్నాయి. బహ్రెయిన్ స్ధావరం అతి పెద్ద స్ధావరంగా ఉంది.
తమకు దగ్గర్లో స్ధావరాలు నెలకొల్పడం ద్వారా అమెరికా తమకు శ్రమ తప్పించిందని ఇరాన్ కమాండర్ అన్నాడు. వారి స్ధావరాలు130 కి.మీ, 250 కి.మీ నుండి మహా అయితే 700 కి.మీ లోపలే ఉన్నాయనీ వీటిపై దాడికి మా వద్ద ఉన మిసైళ్ళు సరిపోతాయని ఆయన తెలిపాడు. ప్రస్తుతం చేస్తున్న మిలట్రీ డ్రిల్లుకు ఇరాన్ “గ్రేట్ ప్రాఫెట్ 6” అని పేరు పెట్టింది. భూతలం, నీటి పైనా సాగే ఈ డ్రిల్లు ఈ ప్రాంతంలోని దేశాలకు శాంతి, స్నేహ సందేశాలను అందిస్తాయని ఇరాన్ తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా తమకు ఇజ్రాయెల్, అమెరికాల నుండి తప్ప మరే ఇతర దేశం నుండి మిలట్రీ దాడి ప్రమాదం లేదని అమీర్ ఆలీ తెలిపాడు.
