ఆఫ్ఘనిస్ధాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ కదీర్ ఫిట్రాట్ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. గవర్నరు పదవికి రాజీనామా చేసి మరీ పారిపోయిన కదీర్ అమెరికాలో తేలాడు. ఆయనకి అమెరికాలో నివాస గృహం ఉందని తెలుస్తోంది. కాబూల్ బ్యాంక్ అనే ప్రవేటు బ్యాంకులో జరిగిన అవినీతిపై అబ్దుల్ కదీర్ దర్యాప్తు జరిపాడు. అవినీతికి పాల్పడినవారి పేర్లను పార్లమెంటులో బహిర్గతం చేశాడు. ఆయన బైటపెట్టిన పేర్లలో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మహమూద్ కర్జాయ్, అధ్యక్షుడి ఇతర బంధువులు ఉండటం విశేషం. హమీద్ కర్జాయ్‌పై అనేక అవినీతి ఆరోపణలు గతంలో తలెత్తాయి. ఆయన అవినీతిపై అమెరికా అధికారులు కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతి వల్లనే అమెరికా నిధులు ఆఫ్ఘన్ లొని తమ సైన్యాధికారుల ద్వారా ఖర్చు చేయడం ప్రారంభించిందని పత్రికలు రాశాయి కూడా.
కాబూల్ బ్యాంకులో జరిగిన అవినీతిపై తాను జరిపిన విచారణలో ప్రభుత్వం జోక్య చేసుకుందని కదీర్ ఆరోపించాడు. తానిక ఆఫ్ఘనిస్ధాన్‌కి తిరిగి రానని చెప్పాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి కదీర్ రాజీనామా విద్రోహం కిందికి వస్తుందని తెలిపాడు. అధ్యక్షుడి ప్రతినిధి వహీద్ ఒమర్ అసలు కదీర్ పైనే విచారన జరుగుతున్నదని తెలిపాడు. కాబూల్ బ్యాంకు అనేక మంది ప్రవేటు వ్యక్తులకు మిలియన్ల డాలర్లను రుణాలుగా ఇచ్చిందనీ, రుణాలకు సంబంధించి సరైన సెక్యూరిటీలు చూడలేదనీ పరిశోధకులు తెలిపారు. రుణాలు వసూలు కాక బ్యాంకు పతనదశకు చేరుకుంది. గత సెప్టెంబరులో అమెరికా బ్యాంకుకు బెయిలౌట్ మంజూరు చేసింది. అతి పెద్ద ప్రవేటు బ్యాంకు ఐన కాబూల్ బ్యాంకునుండె ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు పొందేవారు. పోలీసులు, టీచర్లకు కూడా వేతనాలు ఇక్కడే.
అబ్దుల్ కదీర్ తనకు విశ్వసనీయ వర్గాల నుండి తనకు ప్రాణ భయం ఉన్నట్లుగా సమాచారం ఉందని తెలిపాడు. సమాచారం ఇచ్చిన వారు ఎవరో ఆయన చెప్పలేదు. సమాచారం మాత్రం ఖచ్చితమైనదని చెప్పాడు. గత పది నెలలుగా కాబూల్ బ్యాంకు అవినీతికి సంబంధించి ప్రత్యేక ప్రాసిక్యూషన్‌నూ, ప్రత్యేక ట్రిబ్యునల్‌నూ ఏర్పాటు చేయాలని తాను ఒత్తిడి తెచ్చానని కదీర్ తెలిపాడు. కాబూల్ బ్యాంకు అవినీతిలో పాలు పంచుకున్నవారి పేర్లను పార్లమెంటులో వెల్లడించినందునె తనపై కక్ష గట్టారని చెప్పాడు. కదీర్ అధ్యక్షుడి సోదరుడి పేరు వెల్లడించినప్పటికీ అతనిపై విచారణ జరగలేదు. గత మే నెలలో అవినితి వ్యతిరేక కార్యాలయం, కాబూల్ బ్యాంకు ఎటువంటి పత్రాలు లేకుండా 467 మిలియన్ డాలర్లు రుణాలిచ్చారని తేల్చింది.
ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఆఫ్ఘన్లకు తగినంత బ్యాంకింగ్ అనుభవం లేదని అందువలన బ్యాంకులో జరిగే విషయాలు తెలియలేదని చెప్పాడు. విదేశీ సలహాదారులపై కూడా నేరం మోపాడు. నిందితులపై విచారణ జరిపి శిక్షిస్తానని కూడా చెపుతూ వచ్చాడు కానీ ప్రధాన నిందితులపై కేసులు నమోదు కాలేదు.
