అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం


అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే. అనుమానం అనవసరం. కాని అమెరికాకి ఆ అర్హత ఉన్నదా?

సెప్టెంబరు 11, 2001 టెర్రరిస్టు దాడులు చేయించాడని ఒసామా బిన్ లాడెన్ ను అత్యంత క్రూరంగా హత్య చేసి సరిగ్గా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. జంట టవర్లపై దాడికి బాధ్యత నాది కాదని లాడెన్ చెప్పినప్పటికీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం లేకుండా ఏక పక్షంగా నేరాన్ని మోపి దారుణంగా లాడెన్‌ని హత్య చేసిన అమెరికాకి మరొకరు ‘బల ప్రయోగం చేస్తున్నారంటూ’ ఖండించే అర్హత ఎక్కడినుండి వస్తుంది?

లాడెన్‌తో సంబంధాలు ఉన్నాయని సద్దామ్ హుస్సేన్ పై అబద్ధాలు ప్రచారం చేసింది అమెరికా. సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పింది అమెరికా. వాటి వలన అమెరికాకి, అమెరికన్ల భద్రతకూ ప్రమాదం ఉందని తన సొంత ప్రజలనే నమ్మించి మోసం చేసింది అమెరికా. ఆ పేరుతో ఇరాక్‌లోకి అంతర్జాతీయ పరిశీలకుల చేత అణువణువునా వెతికించింది. ఒక్కటంటే ఒక్క ఆయుధం కూడా దొరకలేదు. ఏమీ లేవని ఇన్‌స్పెక్టర్లు కూడా చెప్పారు. అయినా సరే కనపడకుండా దాచిపెట్టాడని ఇరాక్‌పై దారుణంగా దాడులు చేసింది అమెరికా.

దాడికి ముందు పది సంవత్సరాల పాటు పసిపిల్లల పాల డబ్బాలపై కూడా ఆంక్షలు విధించి లక్షల ఇరాక్ పిల్లలను చంపింది. దాడిలో ఇరాక్ ఆర్ధిక వ్యవస్ధ నంతటినీ చిన్నాభిన్నం చేసింది. ఇరాకీయుల జీవితాలను సర్వ నాశనం చేసింది. పరిశీలకులు ఏ ఆయుధాలు లేవని నిర్ధారించాక మాత్రమే దాడికి పాల్పడి తన పిరికి తనాన్ని రుజువు చేసుకుంది. ఎనికిది సంవత్సరాలకు పైగా ఇరాక్‌లో సైన్యాన్ని మోహరించి అటు అమెరికన్లకూ, ఇటు ఇరాకీయులకూ నరకాన్ని చూపింది. యుద్ధం వలన ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిని అమెరికన్లు నష్టపోగా, యుద్ధంలో మౌలిక సౌకర్యాలన్నీ చిన్నా భిన్నమై నష్టపోయింది ఇరాక్.

ఆఫ్ఘనిస్ధాన్‌పైన నేరం చేశాడో లేదో తెలియని ఒకే ఒక్క వ్యక్తి కోసం ఆంబోతులా విరుచుకుపడింది. లక్షల మంది ఆఫ్ఘన్లను బలిగొన్నది. ఇంకా ఆఫ్ఘన్లను, పాకిస్ధానీయులను చంపుతూనే ఉంది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లపై అమెరికా చేసింది బల ప్రయోగం కాదా? లిబియాపై చేస్తున్నది బల ప్రయోగం కాదా? ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, లిబియాలు ఎక్కడ? అమెరికా ఎక్కడ? ఆసియా, ఆఫ్రికాలతో అమెరికాకి ఏంపనని అచ్చోసిన ఆంబోతులా దాడి చేసినట్లు?

దక్షిణ చైనా సముద్రంలో వివిధ దేశాలు మాదంటె మాదని తగువులాడుకుంటున్నాయి. చైనా, జపాన్, వియత్నాం, ఫిలిప్పైన్స్, రష్యా దేశాలు ఆ తగువులో ఉన్నాయి. ఈ సముద్రంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయని భావిస్తున్నందున ఈ తగవులు జరుగుతున్నాయి. వియత్నాం ఇక్కడ కొద్ది రోజుల క్రితం మిలట్రీ ప్రదర్శన చేస్తుంటే చైనా నౌకలు దురుసుగా ప్రవర్తించాయని వియత్నాం ఆరోపించింది. కానీ రెండు దేశాలు కూర్చుని చర్చించుకున్నాయి. సంమయనం పాటించాలని నిర్ణయించుకున్నాయి. ఈ దేశాలన్ని దక్షిన చైనా సముద్రాన్ని ఆనుకుని ఉన్నవే. అందువలన తగవులు సహజం. కాని అవి చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

కాని అమెరికా?! తాలిబాన్ చర్చిద్దాం రమ్మంటే ఛస్ వీల్లేదని హుంకరించింది. అబద్ధాలు చెప్పింది. ప్రపంచాన్నంతటినీ వంచించింది. తీరా పది సంవత్సరాలు గడిచాక, యుద్ధంలో పరాజయం తప్పదని గ్రహించాక లక్షల మందిని చంపి అతి హీనాతి హీనమైన మారణహోమం సృష్టించాక ఇప్పుడు చర్చలు జరుపుదాం రమ్మంటోంది. అది కూడా ఆఫ్ఘన్ లో ఇంకా యుద్ధం చేస్తూనే చర్చిస్తుందట!?

అటువంటి అమెరికా పాలకుల సెనేట్, సార్వభౌమ వివాదాలను పరిష్కరించుకోవడానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదిస్తుందా? సిగ్గు లేకపోతే సరి!

వ్యాఖ్యానించండి