ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలు ఇవే


గత బుధవారం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు రెండవ బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు ప్రకటించాయి. అందుకు ప్రతిగా గ్రీసు కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయాల్సిందేనని షరతు విధించాయి. తాను అమలు చేయనున్న పొదుపు చర్యలను గ్రీసు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వీటిని రానున్న బుధ, గురువారాల్లో గ్రీసు పార్లమెంటు ఆమోదించాలి. ఐతే ఐర్లండు, పోర్చుగల్ దేశాల మాదిరిగా గ్రీసు ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపక్షాలే కాదు, పాలక పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా వీటిని తిరస్కరించడానికి నిర్ణయించారు.

300 మంది సభ్యులు గల గ్రీసు పార్లమెంటులో పాలక సోషలిస్టు పార్టీకి, అధికారానికి వచ్చినపుడు 160 మంది సభ్యులు ఉన్నారు. గత సంవత్సరంలో అమలు చేసిన పొదుపు విధానాలను వ్యతిరేకిస్తూ ఐదుగురు పాలక సభ్యులు ప్రతిపక్షంలోకి దూకేశారు. మిగిలిన 155 మందిలో ఇద్దరు పొదుపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు. మరొకరు షరతులతో ఒక పత్రాన్ని తయారు చేసుకుని అవి ఆమోదిస్తేనే ఓటేస్తానని లేకుంటే వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. పాలక పార్టీ మంత్రులు, ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన ‘న్యూ డెమొక్రసీ’ పార్టీ సభ్యులు పొదుపు చర్యల్లో కొన్నింటికి అనుకూలంగా ఓటేస్తుందని ఆశిస్తున్నారు. కానీ ఆ పార్టీ ఇంతవరకూ మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించ లేదు. పైగా ఆ పార్టీ నాయకుడు ఆంటోనిస్ సమరాస్, పొదుపు చర్యలు గ్రీసు ఎదుర్కొంటున్న మాంద్యాన్ని (recession) మరింత తీవ్రం చేస్తాయని విమర్శించాడు.

మరోవైపు జర్మనీ ఆర్ధిక మంత్రి, గ్రీసు పాలక, ప్రతిపక్ష పార్టీలు విభేధాలను విస్మరించి పొదుపు చర్యలను ఆమోదించాల్సిందేనని లేకుంటే గ్రీసుకు అత్యవసరమైన 12 బిలియన్ యూరోల వాయిదా ఇచ్చేది లేదని హెచ్చరించాడు. శనివారం నాడు ఇ.యు, ఇ.సి (European Commission) లు పొదుపు చర్యలను ఆమోదించాలని గ్రీసు పార్లమెంటు సభ్యులను కోరాయి. గ్రీసులో కార్మిక సంఘాలు పొదుపు చర్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బుధ, గురువారాల్లో (జూన్ 29, 30 తేదీలు) జరిగే పార్లమెంటు చర్చలను వ్యతిరేకిస్తూ మంగళ, బుధ (జూన్ 28, 29) వారాల్లో రెండు రోజుల సమ్మెకు కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. గ్రీసు ఆర్ధిక మంత్రి పాలక పార్టీల సభ్యులు కొంతమంది పొదుపు చర్యల బిల్లును అడ్డుకునే ప్రమాదం ఉందని ఆదివారం హెచ్చరించాడు.

ఇ.యు, ఇ.సి లు గ్రీసు పార్లమెంటు ఆమోదించాలని కోరుతున్న, జర్మనీ ఆర్ధిక మంత్రి గ్రీసు పార్లమెంటు ఆమోదించాల్సిందేనని హెచ్చరిస్తున్న, గ్రీసు ఆర్ధిక మంత్రి ఓడిపోతుందేమోనని భయపడుతున్న ఈ పొదుపు చర్యల బిల్లులో ఇంతకీ ఏమేమి చర్యలను గ్రీసు ప్రభుత్వం ప్రతిపాదించింది? గ్రీసు ప్రభుత్వం రూపొందించిన పొదుపు బిల్లు రానున్న నాలుగు సంవత్సరాల్లో (2016 లోపల) 28 బిలియన్ యూరోల ($39.6 బిలియన్) మేరకు పన్నులు బాదాలని ప్రతిపాదించింది. దీనికి అనుబంధంగా ఈ సంవత్సరం 5.5 బిలియన్ యూరోలు ($7.78 బిలియన్) పొదుపు చేయాలని ప్రతిపాదించింది. ఇవి కాక 50 బిలియన్ యూరోల ($70.74 బిలియన్) మేరకు పబ్లిక్ రంగ కంపెనీలను అమ్మి సంపాదించాలని లక్ష్యం విధించుకుంది.

ఇవన్నీ గ్రీసు ప్రభుత్వం ప్రతిపాదించిందని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు నిర్దేశించిన షరతులు. ఇవి సాధించడానికి బిలియన్ల కొద్దీ ఆస్తులున్న ధనికులపై పన్నులు వేయడానికి బదులు గత సంవత్సరం బాదుడుతో బక్కచిక్కిన కార్మికులు, ఉద్యోగులపైనే మరిన్ని పన్నులు వేసి, వేతనాలు కత్తిరించి, పెన్షన్లు తగ్గించాలని గ్రీసు ప్రభుత్వం ప్రతిపాదించింది. అది ప్రతిపాదించిన పొదుపు చర్యలు ఇవిగో ఇలా ఉన్నాయి.

 • ఆదాయపు పన్ను విధించడానికి ఇపుడున్న కనీస వార్షిక ఆదాయ పరిమితిని 33 శాతం తగ్గించింది. ఇప్పటివరకూ ఇది 12000 యూరోలు (16,970 డాలర్లు) ఉండగా దాన్ని 8,000 యూరోలకు (11,310 డాలర్లు) తగ్గిస్తారు. ఆదాయం పన్ను కనీసం 10 శాతం నుండి మొదలవుతుంది. 30 సం. లోపు వారినీ 65 సం. పైబడిని వారినీ మినహాయింపు ఇచ్చారు.
 • అధిక ఆదాయం (కేవలం 12,000 పైబడిన వారు మాత్రమే) ఉన్నవారిపైన ఆదాయ పన్ను కాక అదనపు పన్ను వేస్తారు. ఇది 1 శాతం నుండి 5 శాతం వరకూ ఉంటుంది. 12,000 నుండి 20,000 వరకు ఆదాయం ఉంటే 1 శాతం, 20,000 నుండి 50,000 వరకు 2 శాతం, 50,000 నుండి 100,000 వరకూ 3 శాతం, 100,000 కు పైన 4 శాతం, చట్ట సభల సభ్యులు, పబ్లిక్ సర్వెంట్లకు 5 శాతం అదనపు పన్ను వేస్తారు.
 • చిన్న చిన్న సంస్ధలకు హీటింగ్ ఆయిల్ ఖరీదుని వాహనాల ఆయిల్ ఖరీదుతో సమానం చేస్తారు. ఇళ్ళ విషయంలో సమానం చేయకపోయినా హీటింగ్ ఆయిల్ ఖరీదు పెంచుతారు.
 • మాధ్యమిక స్ధాయి ఉత్పత్తులపై వాట్ (Value Added Tax) 11 నుండి 13 శాతానికీ, ప్రాధమిక స్ధాయి ఉత్పత్తులపై వ్యాట్ ను 5.5 నుండి 6.5 శాతానికీ పెంచుతారు.
 • టూరిస్టు పరిశ్రమకు పన్నులు తగ్గిస్తారు. కొన్ని కార్పొరేట్ కంపెనీల సంపాదనపై కూడా పన్నులు తగ్గిస్తారు. ఈ చర్యలో ఖర్చు పెరగడం తప్ప తగ్గేదేమీ లేదు. ప్రజలపై బాదుడు, కార్పొరేట్లకు పంచుడు.
 • పోర్టులు, ఎయిర్ పోర్టులను కూడా అమ్మేస్తారు.
 • ఇంటిపన్ను విధించే ఇళ్ళ కనీస విలువను కూడా దారుణంగా 50 శాతం తగ్గించారు. ఇప్పటివరకు ఇంటి ఖరీదు 400,000 యూరోలు ఆపైన ఉంటేనే పన్ను వేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 200,000 యూరోలకు తగ్గించేశారు.
 • 2011 సం.లో ప్రభుత్వ ఖర్చును 400 మిలియన్ యూరోల మేరకు తగ్గించాలి. ప్రభుత్వ ఖర్చు తగ్గించడం అంటే ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలను రద్దు చేయడం లేదా కోత పెట్టడం ద్వారా మిగిల్చడమే. అంతే గానీ ప్రవేటు కంపెనీలకు ఇచ్చే బడ్జెట్ మద్దతు గానీ, వారిపై పన్నులను గానీ, ఎగవేసే రుణ సదుపాయాలు గానీ తగ్గించడం ద్వారా మిగల్చే ప్రశ్నే ఉండదు.
 • ఆదాయపు పన్నుల ఎగవేతను అరికట్టాలి. పన్నులు ఎగ్గొట్టే అవకాశాలు ధనికులకే వస్తాయి తప్ప ఉద్యోగులకు రాదు. గ్రీసులొ ఆదాయపు పన్ను ఎగవేత వలన సంవత్సరానికి 20 బిలియన్ యూరోల ఆదాయం తగ్గిపోతున్నదని అధికారిక అంచనా. వాస్తవ సంఖ్య దీనికి రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఈ ఎగవేత అరికడితే ఉద్యోగులపై విధిస్తున్న కోతలు, రద్దులను చాలా వరకూ తగ్గించ వచ్చు. కాని ప్రభుత్వాలకి ప్రజలపైన జులుం చేసే శక్తి ఉంటుంది గానీ పెత్తందారులను అరికట్టే శక్తి ఉండదు. ఉన్నా ఉపయోగించరు, వారూ వారూ మితృలు కనుక.
 • దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులలో ఐదవ వంతును (20 శాతం) వారి ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఐదోవంతు అంటే 150,000 ఉద్యోగులను ఇంటికి పంపనున్నారు. దానితో అధికారికంగా 16 శాతం ఉన్న నిరుద్యోగానికి అదనపు నిరుద్యోగులు వచ్చి చేరతారు.
 • కార్మికులు పనిచేసే వేళల్లో, పని చేసే పద్ధతుల్లో గణనీయమైన్ మార్పులు చేపడతారు. ఏదో ఒక ఆకర్షణీయమైన పేరు పెట్టి పనివేళలని పెంచడం, పని వేగాన్ని పెంచడం చేస్తారన్నమాట.
 • సామాజిక సదుపాయాలను తగ్గిస్తారు లేదా రద్దు చేస్తారు. పెన్షన్లు, నిరుద్యోగ సహాయం తదితరాలు వీటిలో ఉంటాయి.
 • స్వయం ఉపాధి కల్పించుకున్నవారి పైన సంవత్సరానికి 300 యూరోల ఆదాయపు పన్ను.

గత సంవత్సరం అమలు చేసిన పొదుపు విధానాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ 5.5 శాతం కుచించుకు పోయింది. ఈ సంవత్సరం 4 శాతం వరకూ కుచింపుకు గురవుతుందని భావిస్తున్నప్పటికీ వాస్తానికి 5.5 శాతం కంటే ఎక్కువ కుచింపు ఉండగలదని ప్రవేటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొదుపు చర్యలు ఒక్క గ్రీసుకే పరిమితమైనవి కావు. సంక్షోభంలో ఉన్న దేశాల ప్రజలపై మరీ అడ్డగోలు విధానాలు అమలు చేస్తుండగా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి ధనిక దేశాలు కూడా తమ ప్రజలపైన పొదుపు చర్యలను తరతమ స్ధాయిల్లో రుద్దుతున్నాయి. అధిక ఉత్పత్తి సంక్షోభంతోనూ, కేపిటల్ రియలైజేషన్ సంక్షోభంతోను కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడి, అవివార్యమైన పెట్టుబడిదారీ సంక్షోభానికి గురవుతుండడంతో దాన్నుండి బైటకు రావడానికి ఈవిధంగా పేద, సంక్షుభిత దేశాల పైనా, స్వదేశ ప్రజానికం పైనా పొదుపు చర్యలతో దాడులకు దిగుతున్నాయి ప్రభుత్వాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s