ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు


President Obama speaks to soldiers Thursday at Fort Drum

సైనిక ఉపసంహరణను న్యూయార్క్‌లో సైనికులకు వివరిస్తున్న ఒబామా

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా లేదా అన్న విషయంలో గట్టి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒబామా ప్రకటనను వెంటనే సమర్ధించని వీరిద్దరు కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో ‘అంతిమంగా అధ్యక్షుడి నిర్ణయాన్ని మద్దతు ఇవ్వదలుచుకున్నామ’ని చెప్పారు. కానీ అంతర్గతంగా నిర్ధిష్ట అంశాలపై వాదోపవాదాలు జరిగాయనీ, మిలట్రీ కోరుకున్నంతగా వారు పొందలేకపోయారనీ గుసగుసలు పోతున్నట్లుగా పత్రిక పేర్కొంది. “అధ్యక్షుడి నిర్ణయం దూకుడుగా ఉండడమే కాక నేను ఇంతకుముందు భావించిన దానికంటె ఎక్కువ ప్రమాదం ఎదుర్కోనున్నామని చెప్పగలను” అని ముల్లెన్‌ను పత్రిక ఉటంకించింది. యుద్ధ సీజన్ వసంత ఋతువునుండి శరదృతువు వరకూ విస్తరించి ఉంటుందనీ ఈ లోగా సైన్యంలో గణనీయ సంఖ్యలో ఉపసంహరిస్తే తాలిబాన్ పునఃసమీకరణ కావడానికి అవకాశం ఇచ్చినట్లేననీ మిలట్రీ అధికారులు ఒకింత ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.

బుధవారం రాత్రి దేశాన్నుద్దేశించి ఒబామా ప్రసంగిస్తూ ఈ సంవత్సరం చివరిలోపల 10,000 మందినీ, వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల మరో 23,000 మందినీ అమెరికా సైనికుల్ని వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే దామాషాలో తమ సైనికులు 1000 మందిని ఉపసంహరిస్తామని ఫ్రాన్సు ప్రకటించగా, బ్రిటన్ ఒబామా ప్రకటనకు ముందు చెప్పిన 426 మందితో పాటు మరో 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించడానికి పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మిగిలిన 70,000 మందిని 2014 లోపు విరమిస్తామని ఒబామా చెప్పినప్పటికీ ఏదో ఒక కారణం చూపి గణనీయ మొత్తంలోనే ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆసియాలో వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల నిమిత్తం ఆఫ్ఘన్ యుద్ధానికి తెగబడిన అమెరికా ఆ లక్ష్యాన్ని పక్కనబెట్టి సైనికులందర్నీ ఉపసంహరిస్తుందని భావించడం అత్యాశే కాగలదు.

ఒబామా ప్రకటన అనంతరం మిలట్రీ అధికారుల్లోనే వివిధ అభిప్రాయాలు తలెత్తాయి. చాలామంది సైనికాధికారులు ఉపసంహరణ సంఖ్య అభిలషణీయం కాదని అంగీకరిస్తూనే అంతిమంగా తాలిబాన్‌తో పోరాటం విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ రావనీ వారు చెప్పదలుచుకున్నట్లుగా పత్రికల ద్వారా తెలుస్తోంది. అంతర్గత విభేదాలేమీ లేవని కొట్టిపారేస్తున్నవారూ లేకపోలేదు. అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నపుడు దానిపై అనుకూల ప్రతికూల అభిప్రాయాలు తలెత్తడం సహజం. వివిధ అభిప్రాయాలు ఉన్నాయని అంగీకరించేవారు కొందరూ, వ్యతిరేకించేవారు కొందరూ ఉండడం కూడా సహజమే. అధికారిక వ్యవహారాలు బైటపెట్టొచ్చా లేదా అన్న అంశంలోనూ, ఎంతవరకు బైట పెట్టొచ్చన్న అంశంలోనూ వివిధ అభిప్రాయాలుండటమే దీనికి కారణం.

అసలు ఉపసంహరించుకోదలుచుకున్న వారందరినీ రానున్న మార్చిలో ఒకేసారి ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆ నిర్ణయానికి ఒబామా మొగ్గు చూపకపోవడం పట్ల సైనికాధికారులు ఊపిరి పీల్చుకున్నట్లుగా అది తెలిపింది. రాజకీయ పార్టీలపరంగా చూసినా ఒకే పార్టీలో వివిధ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఫారెన్ రిలేషన్స్ కమిటీ సభ్యుడు రిపబ్లికన్ సెనేటర్ రిఛర్డ్ లుగార్, ఒబామా చెప్పిన సంఖ్య తక్కువేనన్నాడని పత్రికలు తెలిపాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో దేశ నిర్మాణ బాధ్యతను పక్కనబట్టి టెర్రరిస్టుల్ని చంపడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈయన క్లింటన్‌ను కోరాడట. తద్వారా ఆ సంస్ధల్ని నిర్మూలించి పాకిస్ధాన్ అణ్వాయుధాలు భద్రంగా ఉండేలా చూడాలని కోరాడట. అలాగే డెమొక్రట్ సభ్యులు కొందరు ఈ సంవత్సరం పది వేల కంటే ఎక్కువమందినే ఉపసంహరించాలని కోరారని తెలుస్తోంది. వారికి వచ్చే సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు కనిపిస్తూ ఉండవచ్చు.

అమెరికా సైనికాధికారుల అభిప్రాయాలు ఏమైనప్పటికీ తాలిబాన్ మాత్రం ఈ ఉపసంహరణ ప్రక్రిత “సింబాలిక్” అని మాత్రమే భావిస్తోంది. తమ పోరాటం ఆగేది లేదనీ, చర్చలూ లేవనీ స్పష్టం చేస్తున్నది. దానికి సాక్ష్యం అన్నట్లుగా హిల్లరీ చర్చలని చెప్పిన రోజే రెండు యాక్షన్‌లు జరిపారు. ఉపసంహరణ అన్న తర్వాత కూడా మానవబాంబులు పేలాయి.

వ్యాఖ్యానించండి