యూరప్‌లో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం


Wen Xiabao in Birmigham

బర్మింగ్‌హామ్‌లో విమానం దిగుతున్న చైనా ప్రధాని వెన్ జియాబావొ

యూరప్‌లో చైనా వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో విస్తారమైన సహజ వనరులను వెలిలి తీయడంలోనూ, వెలికి తీసిన వనరులలో అధిక భాగాన్ని చైనాకి తరలించుకు వెళ్ళడంలోనూ చైనా చురుకుగా వ్యవహరిస్తోంది. అలాగే యూరప్‌లో సైతం చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. చైనా కంపెనీలు యూరప్‌లో కార్యకలాపాలను నిర్వహించడం పెరిగింది. చైనా వద్ద అత్యధిక మొత్తంలో నిలవ ఉన్న విదేశీమారక ద్రవ్యం తమ దేశాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఇంగ్లండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆకాంక్షిస్తున్నాయి. యూరో జోన్ దేశాలు ఆప్పు సంక్షోభంలో ఉన్న నేపధ్యంలో యూరో పతనం కాకుండా కాపాడడానికి చైనా పెట్టుబడులు తరలించాలని యూరోజోన్ దేశాలు సైతం చైనాపై నమ్మకం పెట్టుకున్నాయి.

చైనా ప్రధాని వెన్ జియా బావో ప్రస్తుతం ఐదు రోజుల పర్యటన నిమిత్తం యూరప్‌లో ఉన్నాడు. శనివారం ఆయన హంగేరీలో పర్యటించాడు. యూరప్ అప్పు సంక్షోభం ప్రారంభంలో గ్రీసు తర్వాత హంగేరీ బలికానున్నదని వార్తలు వచ్చాయి. అయితే హంగెరీ తృటిలో తపించుకుంది. దాని వెనక చైనా హంగేరీలో పెట్టుబడులు పెట్టడం, సహాయం ప్రకటించడం కూడా ప్రధాన పాత్ర పోషించినట్లుగా భావిస్తున్నారు. శనివారం చైనా హంగేరీకి 1బిలియన్ డాలర్లు సహాయంగా ప్రకటించాడు. హంగేరీలో పరిశ్రమలు స్ధాపించడానికి చైనా హంగెరీల మధ్య అంగీకారం కుదిరింది. చైనా చేస్తున్న సహాయం హంగేరీ అభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుందని హంగేరీ అధ్యక్షుడు వెన్ జియాబావోకు కృతజ్ఞతలు కూడా తెలియ జేశాడు. చైనా కార్ల పరిశ్రమను హంగేరీలో స్ధాపించనున్నట్లు తెలుస్తోంది.

హంగేరీ పర్యటన అనంతరం చైనా ప్రధాని బ్రిటన్ చేరుకున్నాడు. ఆదివారం చైనా, ఇంగ్లండు ల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. మూడు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సభ జరగనుంది. దీనిని యు.కె-చైనా వ్యూహత్మక శిఖరాగ్ర సభగా పిలుస్తున్నారు. బ్రిటన్, చైనాలో ప్రతి సంవత్సరం వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించుకుంటున్నాయి. గత సంవత్సరం ఇది బీజింగ్‌లో జరిగింది. చైనా, యు.కె ల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఈ సమావేశాలను ఉద్దేశించారు.

తన విదేశీ మారక ద్రవ్యం నిల్వలను వివిధీకరించనున్నట్లుగా చైనా గత సంవత్సరం నుండి ప్రకటిస్తున్నది. చైనా వద్ద కనీసం 3 ట్రిలియన్ డాలర్ల విలువ గల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉన్నాయి. వీటిలో 2 ట్రిలియన్లు డాలర్ల రూపంలో ఉన్నాయని భావిస్తున్నారు. మిగిలిన 1 ట్రిలియన్ డాలర్లు, పౌండ్లు, యెన్‌లతో పాటు తన వ్యాపార భాగస్వాములైన మూడో ప్రపంచ దేశాల కరెన్సీలలో కూడా నిలవ ఉంచుకుంది. డాలర్లలో ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని బాగా తగ్గించి ఇతర ప్రధాన కరెన్సీలకు మళ్ళిస్తానని చైనా ప్రకటిస్తోంది. ఆ మళ్ళింపు ద్వారా యూరోలో పెట్టుబడులను ఆకర్షించాలని యూరో జోన్ భావిస్తోంది.

అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, డాలర్లలో విదేశీ మారక ద్రవ్యాన్ని చైనా సంపాదిస్తోంది. తద్వారా డాలర్‌తో తన కరెన్సీ యువాన్ విలువను పెరగకుండా చూస్తోందని కూడా అమెరికా, యూరప్ లు ఆరోపిస్తున్నాయి. మరో పక్క యూరో ట్రెజరీ బాండ్లలో చైనా పెట్టుబడులు పెట్టాలని ఇ.యు అభిలషించడం పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అంతర్గత వైరుధ్యాల ప్రభావమే. అయితే చైనా వద్ద నిజానికి విదేశీ మారక ద్రవ్యం ఎంత మేరకు నిలవ ఉన్నదీ ఎవరికీ అంతుబట్టనీ రహస్యమే. చైనా ఎప్పుడూ ఆ వివరాలను వెల్లడించలేదు. ట్రెజరీ బాండ్ల కోనుగోళ్ళను బట్టి అంచనా వేయడమే తప్ప సరైన సంఖ్య తెలియదు. వివిధ విదేశీ మారక కరెన్సీలని కొనిపెట్టుకోవడం ద్వారా ఆ కరెన్సీలతో తన యువాన్ విలువ పెరగకుండా చూసుకోవడం చైనా విధానంగా ఉంటున్నది.

ఇంగ్లండులోని బర్మింగ్‌హాం దగ్గర లాంగ్‌బ్రిడ్జిలో చైనా కార్ల కంపెనీ ఎం.జి కార్ ప్లాంటును చైనా నెలకొల్పింది. ఇది గతంలో ఎం.జి రోవర్ కార్లను తయారు చేసేది. ఇప్పుడు షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీనికి కొనుగోలు చేసింది. ఆదివారం చైనా ప్రధాని ఈ కార్ల కంపెనీని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఎం.జి6 మాగ్నెట్టే కారుని వెన్ చేతులమీదుగా విడుదల చేస్తారని చెబుతున్నారు. దీనిని ఇంగ్లండులో డిజైన్ చేయగా, విడిభాగాలను చైనాలో తయారు చేసి తిరిగి బ్రిటన్ కి తరలించి అసెంబ్లింగ్ చేస్తారు. ఆ విధంగా విడిభాగాల తయారీకి చైనాలోని చౌక శ్రమను చైనా ప్రభుత్వం కూడా వినియోగించుకుంటోంది.

హంగేరీలో ఉండగా పత్రికలు వెన్ జియాబావోను పత్రికలు గ్రీసు అప్పు సంక్షోభం గురించి ప్రశ్నించాయి. గ్రీసు సంక్షోభం విస్తరిస్తున్న నేపధ్యంలో తాను యూరప్‌కి చెదరని నమ్మకాన్ని తెచ్చినట్లుగా వెన్ వారికి తెలిపాడు. యూరప్, అప్పు సంక్షోభం నుండి బైటపడగలదని వెన్ ఆకాంక్షించాడు. సంక్షోభం నుండి బైటికి రావడానికి యూరోజోన్ దేశాలకు చైనా ఇతోధికంగా సహాయం చేస్తుందని ప్రకటించాడు. చైనా గత సంవత్సరం ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా జపాన్‌ను అధిగమించింది. ఈ నేపధ్యంలో చైనా పెట్టుబడుల కోసం యూరప్ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చైనా యూరప్ కంపెనీలను కొనేసి స్వాధీనం చేసుకోవడం పెరిగిందని బిబిసి తెలిపింది.

లండన్, బర్మింగ్‌హామ్ ల మధ్య నిర్మించనున్న హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి బిడ్ దాఖలు చేయనున్న ప్రతినిధులు వెన్ జియాబావో వెంట వచ్చినట్లుగా బిబిసి తెలిపింది. హెచ్.ఎస్2 గా దీన్ని పిలుస్తున్నారు. హెచ్.ఎస్2 కి అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం, అనుభవం తమకు ఉందని చైనా రాయబారి లియు గ్జియావో మింగ్ తెలిపాడు. జర్మనీ, ఫ్రాన్సులలో కూడా చైనా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. చైనాకి చెందిన ప్రఖ్యాత లెనోవో ల్యాప్ టాప్ తయారీ సంస్ధ జర్మనీలోని రిటైల్ ఎలక్ట్రానిక్ కంపెనీ మెడాయిన్ ని కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

జపాన్ తర్వాత అమెరికా, యూరప్ లలో పెట్టుబడులను అత్యధికంగా విస్తరించుకుంటున్న దేశంగా చైనా ఎదుగుతోంది. తద్వారా చైనా ఆర్ధిక కార్యకలాపాలు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s