బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!


David Cameron and his wife Samantha

బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఆయన భార్య సమంతా

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక పేర్కొన్నది.

అమెరికా సైనికుల్లో 5000 మందిన వచ్చే జులైలోనూ, మరో 5000 మందిని ఈ సంవత్సరం ఆఖరికి వెనక్కి రప్పిస్తామని ఒబామా ప్రకటించాడు. మిగిలిన 23,000 మందిన వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపు వెనక్కి తెచ్చేస్తామని ఆయన ప్రకటించాడు. ఫ్రాన్సు సైన్యం 4000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నారు. వారిలో పావు వంతు అంటే 1000 మందిన వచ్చే సంవత్సరం ఆఖరులోగా వెనక్కి రప్పించనున్నట్లు ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి తెలిపాడు.

బ్రిటన్ ప్రధాని ఈ సంవత్సరం ఆరంభంలో అధికారంలోకి వచ్చాక 426 మంది బ్రిటన్ సైనికుల్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాడు. 200 మంది ఇప్పటికే బ్రిటన్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా చెబుతున్న 500 మంది, వీరు కాక అదనం అని సదరు విశ్వసనీయమైన వ్యక్తి చెప్పినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. బ్రిటన్ సైనికులు 10,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నారు. అమెరికా తర్వాత అధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్ధాన్‌కి సైన్యాన్ని పంపింది బ్రిటనే.

ఒబామా గత సంవత్సరం “ట్రూప్స్ సర్జ్” పేరుతో 30,000 అదనంగా పంపినపుడు అప్పటి బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ బ్రిటన్ సైనికుల్ని 500 మందిని అదనంగా పంపాడు. ఇప్పుడు ఒబామా తన “సర్జ్” ని ఉపసంహరించుకుంటున్నందున బ్రిటన్ కూడా తన “సర్జ్”ని ఉపసంహరించనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. హెల్మండ్ రాష్ట్ర రాజధాని లష్కర్ గాహ్ భద్రతను బ్రిటన్ చూస్తోంది. ఆ పట్టణ సెక్యూరిటీ బాధ్యత ఆఫ్ఘన్లకు అప్పగిస్తున్నందున బ్రిటన్ ఉపసంహరణ తేలిక అవుతుందట.

అయితే బ్రిటన్ ఉపసంహరణ ఎంతమందీ అనేది ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదని పత్రిక తెలిపింది. రానున్న రోజులు లేదా వారాలు లేదా నెలల్లో 426 కాక అదనపు ఉపసంహరణ ఎంతమందీ అనేది కామెరూన్ ప్రకటిస్తాడని ఆ పత్రిక తెలిపింది.

వ్యాఖ్యానించండి