అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు.
భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం పాకిస్ధాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్ లో సమావేశమైన వీరు కాశ్మిరు, టెర్రరిజం, ముంబై దాడులు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దహనం మున్నగు అంశాలను మాట్లాడుకున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో మాత్రం అణ్వాయుధాలతో పాటు, ఇతర సాంప్రదాయక ఆయుధాలకు సంబంధించి ఇరు దేశాల సామర్ధ్యంపై పరస్పరం విశ్వాసం కలిగించుకోవడానికి అంగీకరించునట్లుగా తెలిపారు. జులైలో ఇండియాలో జరగనున్న ఇరు దేశాల విదేశీ శాఖా మంత్రుల సమావేశానికి ముందస్తు ఏర్పాట్లకోసం విదేశీ కార్యదర్శుల సమావేశం జరిగినట్లు స్పష్టమయ్యింది.
ముంబైలో పాకిస్ధాన్‌కి చెందిన టెర్రరిస్టులు పదిమంది నవంబరు 26, 2008 లో దాడి చేసి తాజ్ హోటల్, యూదు కేంద్రం, రైల్వే టర్మినస్ లలో విధ్వంసం సృష్టించి 166 మందిని చంపేసినప్పటినుండీ ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. నిందితులను శిక్షించే వరకూ చర్చలనుండి ఉపసంహరించుకున్నట్లుగా ఇండియా ప్రకటించింది. మొదట దాడి చేసినవారు తమ దేశం వారు కాదని చెప్పిన పాకిస్ధాన్ క్రమంగా వాస్తవాలు వెల్లడి కావడంతో దాడుల పధకం కొంతవరకు పాకిస్ధాన్‌లో జరిగినట్లు అంగీకరించింది. ఏడుగురు నిందుతులను పట్టుకున్నామని చెప్పినా పాక్‌లో ఎవ్వరూ దోషులుగా ఇంతవరకూ తేల్చలేదు.
గత సంవత్సరం జులై నెలలో అమెరికా ఒత్తిడి మేరకు ఇరు దేశాలు చర్చల నాటకంలో భాగం పంచుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు కొనసాగినట్లయితే పాకిస్ధాన్, ఇండియా సరిహద్దులో సైన్యాన్ని మొహరించవలసి ఉంటుంది. కాని ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా, పాకిస్ధాన్‌ను భాగస్వామిగా ఎంచుకుంది. పాక్ భూభాగంలో తాలిబాన్, ఆల్-ఖైదాలు రక్షణ పొందుతున్నందున వారిని వెళ్ళగొట్టడానికి అమెరికా పాక్‌పై భారం మోపింది. అందుకోసం బిలియన్ల కొద్దీ డబ్బును పాకిస్ధాన్‌కి ఇస్తోంది. ఆఫ్ఘన్ సరిహద్దులో ఉన్న తాలిబాన్, ఆల్-ఖైదా మిలిటెంట్లతో తలపడాలంటే పాక్ సైన్యం ఇండియా సరిహద్దునుండి ఆఫ్ఘన్ సరిహద్దుకి తరలించాల్సి ఉంది. అందుకుగాను పాక్, ఇండియాల మధ్య శాంతి చర్చలకోసం ఒత్తిడి చేయడంతో గత సంవత్సరం జులైలో ఇరు దేశాలు బలవంతంగా కూర్చుని చర్చలు జరిపినట్లు నాటకమాడారు. ఆ చర్చలు ఇష్టం లేకుండా జరగడంతో ఇరు దేశాలు పత్రికా ముఖంగానే పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి.
ఆ తర్వాత క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా భారత దేశం క్రికెట్ దౌత్యం నెరిపింది. సెమీఫైనల్స్‌లో తలపడిన ఇండియా, పాక్ ల మ్యాచ్ సందర్భంగా మ్యాచ్‌ని తిలకించడానికి పాక్ ప్రధాని గిలానిని ఇండియా ప్రధాని ఆహ్వానించాడు. ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించడం ద్వారా వాతావరణం తేలికపడడానికి తోడ్పడ్డారు. క్రికెట్ దౌత్యం పునాదులపైనే తాజా విదేశీ కార్యదర్శుల సమావేశం జరిగింది. జులై నెలలో ఇండియాలో విదేశీ శాఖా మంత్రుల సమావేశంలో ఏదైనా ఒప్పందం జరిగే అవకాశాలు లేకపోలేదు. కౌంటర్ టెర్రరిజంపై పరస్పరం సహకరించుకోవడానికీ, ఇరుదేశాల ఆధీనంలో ఉన్న కాశ్మీరు భూభాగాల మద్య సంబంధాలు, రాకపోకలు మెరుగుపర్చడానికి కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
అమెరికా గ్లోబల్ ఆధిపత్యానికి చేస్తున్న ప్రయత్నాలకు అతీతంగా పొరుగు దేశాలు స్నేహ భావంతో మెలగవలసిన అవసరం ఉంది. ఇరు దేశాల మద్య అఘాతం బైటివారు అనుకూలంగా మార్చుకోగలరని గుర్తించి వారికా అవకాశం ఇవ్వకూడదని ఇరు దేశాలు గుర్తించవలసి ఉంది.
