గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం


భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే లీటర్ పెట్రోల్ ధర పది రూపాయలలోపే ఉంటుందని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. పెట్రోల్ ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తోడై పది రూపాయల పెట్రోలు దాదాపు వంద రూపాయలకు అమ్ముతున్నారని వారు చెబుతున్నారు.

ఈ ఆయిల్ ధరలే ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై వేస్తన్న పన్నుల్ని తగ్గించినట్లయితే ప్రజలకు తక్కువ ధరలకి ఆయిల్ లభించడంతో పాటు, ద్రవ్యోల్బణాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. కానీ ప్రభుత్వాలు వీలైతే పన్నుల్ని మరింత పెంచడానికి ఆసక్తి చూపుతున్నాయి తప్ప, ధరలు పెరుగుతున్నప్పుడల్లా గ్లోబల్ ధరలు పెరిగాయనీ, తమకు నష్టాలొస్తున్నాయనీ చెప్పడం తప్ప నిజంగా ప్రజలపై భారాన్ని తగ్గించి ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది మొదటి విషయం.

ఇక రెండో విషయం బుధవారం నాడు ప్రపంచంలో ఆయిల్‌ని ఎక్కువగా ఉపయోగించే దేశాలు సమావేశమయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగి దాని వలన ద్రవ్యోల్బణం కూడా పెరగడంతో ఆర్ధిక వృద్ధికి ఆటంకం కలుగుతోందని భావించి తమ వద్ద ఉన్న ఎమర్జెన్సీ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేశాయి. దానితో గురువారం ఆయిల్ ధరలు గ్లోబల్ మార్కెట్లో 6 శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు నాలుగు నెలల కనిష్ట స్ధాయికి పడిపోయింది. లెక్క ప్రకారం ఈ తగ్గుదల భారత ప్రజలకు అందవలసి ఉంది. అంటే ఇప్పుడు భారతీయుల చెల్లిస్తున్న పెట్రోల్ ధర లీటరుకు అంతే శాతం తగ్గవలసి ఉంది. కానీ భారత ప్రభుత్వం ఉద్దేశ్యాలు వేరే ఉన్నాయి.

గ్లోబల్ ఆయిల్ ధరలు తగ్గక ముందే భారత ప్రభుత్వం పెట్రోలు, డీజెల్, గ్యాస్ ధరలు పెంచాలని సూచిస్తూ వచ్చాయి. గురువారం గ్లోబల్ ధరలు తగ్గినందున ప్రభుత్వం ఈ ఆలోచనను వాస్తవంగా విరమించుకోవాలి. ఎన్నడూ లేనంతగా 6 శాతం ధరలు పడిపోయాయి కనుక ఆమేరకు ఆయిల్ కంపెనీలు చెబుతున్న నష్టాలు పూడినట్లే. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరునాడే భారత ప్రభుత్వం 7 శాతం పైగా పెట్రోల్ ధర పెంచింది. అంత పెంచి రెండు నెలలు కూడా కాలేదు, ఈ శుక్రవారం మంత్రులు సమావేశమై పెట్రోల్, డీజెల్, గ్యాస్ సిలిండర్ ధరలన్నింటినీ పెంచడానికి నిర్ణయించబోతున్నారు. ధరల పెంపుదలకు గ్లోబల్ ధరలు తగ్గుతున్న సందర్భాన్నె అవకాశంగా తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించడమే ఇక్కడ ఘోరాతి ఘోరం.

ఇండియా ద్రవ్యోల్బణం అధిక స్ధాయిలో ఉన్న సంగతి విదితమే. దీనివలన ఆర్ధిక వృద్ధి నెమ్మదించిన సంగతీ తెలిసిందే. మళ్ళీ ఆయిల్ ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. గ్లోబల్ స్ధాయిలో ఆయిల్ ధరలు తగ్గిన సమయంలోనే భారత్ లో ఆయిల్ ధరలు పెంచినట్లయితే పెరిగే ఆయిల్ ధరల ద్వారా పెరగనున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయవచ్చని భారత ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ ధరల తగ్గుదల ప్రజలవరకూ వచ్చినట్లయితే ఆమేరకు ప్రజలపైన భారం తగ్గుతుంది ప్లస్ ద్రవ్యోల్బణమూ తగ్గుతుంది. కానీ ప్రభుత్వ స్ధాయిలోనే ఆయిల ధరల తగ్గుదలను వినియోగించుకోవడం వలన అది కంపెనీకూ, ఇతర పరిశ్రమలకూ మాత్రమే తగ్గుదల వలన ప్రయోజనం లభిస్తుంది తప్ప ప్రజలకు మాత్రం యధా తధంగా ఆయిల్ ధరల పెరుగుదల భారం ఉంటుంది. ప్రజలపై భారం అంటే అది ఆయిల్ కంపెనీలకూ, ప్రభుత్వాలకీ ఆదాయం పెరగడమే.

ఆ విధంగా గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలవరకూ రానీయకుండా తమ ఆదాయం పెంచుకోవడానికీ, ఆయిల్ కంపెనీల ఆదాయం పెంచడానికి మాత్రమే భారత ప్రభుత్వం నిర్ణయించుకోవడం ప్రజలను మోసం చేయడమే. డీ కంట్రోల్ అన్నపుడు గ్లోబల్ స్ధాయిలో ఆయిల్ పెరిగినప్పుడే కాకుండా, తగ్గినపుడుకూడా అది ప్రజలకు చేరాలి. పెరిగినప్పుడు పెంపుదలను ప్రజలపై మోపి, తగ్గినపుడు ఆ లాభాన్ని తాము మాత్రమే పొందటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, ఇక ఈ ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నట్లు? విదేశీ కంపెనీల కోసం భారత దెశ రైతులు, కూలీల జీవనోధిని దెబ్బకొడుతున్న ఈ ప్రభుత్వాలు ఇక ప్రజల పక్షాన ఎప్పుడు పనిచేస్తాయి? ప్రభుత్వ కంపెనీలు అమ్మేయడం, అప్పులు తేవడం, తెచ్చిన అప్పుల్ని విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకే ధారపోయడం తప్ప భారత ప్రజల ఆర్ధికాభివృద్ధికి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు నడుం బిగిస్తాయి? ధనికులు, కంపెనీల లాభాలు పెంచి వారి ఆస్తులు పెంచి తద్వారా పెరుగుతున్న జిడిపి చూసి కాలర్ ఎగరేయడం తప్ప భారత ప్రజల సంపాదనా శక్తిని పెంచి తద్వారా సమగ్ర ఆర్ధికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు అసలు భావిస్తున్నాయా?

One thought on “గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

వ్యాఖ్యానించండి