యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో గూగుల్ సంస్ధపై యాంటీ ట్రస్టు చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ నిర్వహించాలని ఎఫ్.టి.సి నిర్ణయించినట్లుగా “వాల్ స్ట్రీట్ జర్నల్” పత్రిక తెలిపింది.
గూగుల్ తన సెర్చి రిజల్ట్స్ ద్వారా వినియోగదారులను తన సొంత సైట్లకు, సేవలకు ఆకర్షిస్తున్నదీ లేనిదీ ఎఫ్.టి.సి పరిశోధిస్తున్నట్లుగా తెలిపింది. గూగుల్ ఈ వ్యవహారంపై ఇంకా ఏమీ వ్యాఖ్యానించలేదని బిబిసి తెలిపింది. 12 సంవత్సరాల గూగుల్ కంపెనీ ఇటీవల కాలంలో ఇటువంటి విచారణలను అనేకం ఎదుర్కొంది. అయితే ఇవన్నీ గూగుల్ చేపట్టిన “విలీనాలు మరియు స్వాధీనాల” (Mergers & Acquisitions or M&A) ను సమీక్షించడం వరకే అమెరికా ప్రభుత్వం పరిమితమైంది తప్ప లోతుగా విచారణ జరపలేదు. తాజా విచారణ గూగుల్‌కి సంబంధించిన సెర్చి-ప్రకటనల వ్యాపారంలోని మౌలిక అంశాలపై పరిశోధన జరుగుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. గూగుల్‌కి అత్యధికంగా డబ్బు సంపాదించి పెడుతున్న వ్యాపారం ఇదే కావడం గమనార్హం.
గూగూల్‌పై జరిగే పరిశోధన ఇంటర్నెట్ వ్యాపారంలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 1990ల నాటి మైక్రోసాఫ్ట్ విచారణ వలెనే గూగుల్ విచారణ కూడా భవిష్యత్తు నెట్ వ్యాపారాలకు మార్గదర్శకంగా పనిచేయాలని వారు ఆశిస్తున్నారు. తనపై విచారణ జరిగిన తర్వాత మైక్రోసాఫ్ట్ రెండు విడిపోవలసిన ప్రమాదం తప్పించుకున్నప్పటికీ, పర్సనల్ కంప్యూటర్ రంగంలో తన ఆధిపత్యాన్ని తన ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగించడాన్ని కట్టిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు. అయితే గూగుల్ విచారణ అంత సులభతరం కాకపోవచ్చని వాదిస్తున్నవారూ లేకపోలేదు. అమెరికా చట్టాల ప్రకారం గుత్త స్వామ్యం (monopoly) నేరం కాదు. ఆ గుత్త స్వామ్యం పోటీని నిరోధించేందుకు వినియోగిస్తేనే నేరంగా పరిగణిస్తారు. కోర్టులు సైతం యాంటిట్రస్టు చట్టం పరిధిని చాలావరకు కుదించాయని వీరు చెబుతున్నారు.
గూగుల్‌పై పోరాడుతున్నవారు చెప్పే అంశాలు భిన్నంగా ఉన్నాయి. “గూగుల్ పోటీ వ్యతిరేక ప్రవర్తనతో వ్యవహరిస్తుంది… ఇంటర్నెట్ వినియోగదారుల ముందు మెరుగైన ఉత్పత్తులు, సేవలను ఉంచడంలో ఇతర పోటీ సంస్ధల అవకాశాలను తద్వారా గూగుల్ నిరోధిస్తుంది. దాని ప్రవర్తన అంతిమంగా వినియోగదారులకు నష్టపరుస్తుంది. ఇంటర్నెట్‌లో గెలుపెవరిదీ, ఓటమెవరిదీ అన్నది వినియోగదారులు నిర్ణయించాలి తప్ప గూగుల్ కాదు” అని గూగుల్‌పై ఫిర్యాదు చేసిన సంస్ధల ప్రతినిధి ఫెయిర్ సెర్చి (Fairsearch.org) తెలిపింది. ఈ సంస్ధ మైక్రోసాఫ్ట్, ట్రావెల్ సర్వీసులు అందించే ఎక్స్‌పెడియా ఇంక్, కాయక్ డాట్ కామ్(Kayak.com), సాబర్ హోల్డింగ్స్ (Sabre Holdings) తదితర సంస్ధలకు ప్రతినిధిగా ఉంది. గూగుల్ సెర్చ్ ఫలితాల ద్వారా తాను అందించే మేపింగ్, షాపింగ్, ట్రావెల్ వెబ్‌సైట్లు తదితర సేవలవైపుకి వినియోగదారులను ఆకర్షిస్తున్నదని ఈ సంస్ధలు ఆరోపిస్తున్నాయి. సెర్చి ఫలితాలను యధాతధంగా అందించడానికి బదులు తన సేవలకు ఉన్నత ర్యాంకులు ఇచ్చుకోవడం ద్వారా వినియోగదారులను సర్వీసుల ఎంపికలో ప్రభావితం చేస్తున్నదని వీరి ఆరోపణ.
గూగుల్ ఇప్పుడు అమెరికాలో ప్రతి మూడు సెర్చిలలో రెండింటికి సేవలు అందిస్తోంది. అంటే అమెరికా సెర్చి బిజినెస్‌లో 2/3 వంతు గూగుల్‌దే. యూరప్‌లో చాలా దేశాల్లో అయితే 80 శాతం పైగా వ్యాపారం నిర్వహిస్తోంది. “గూగుల్ వినియోగదారుల కోసం నిర్మించబడింది తప్ప వెబ్‌సైట్ల కోసం కాదు. యూజర్లకు సమాధానాలివ్వడమే గూగుల్ పని” అని గూగుల్ గతంలో ఓ సారి చెప్పింది. ఈ మాటలు ఆరోపణలను తెలివిగా పక్కదారి పట్టించేవే తప్ప అసలు ఆరోపణలకు సమాధానం కాదన్నది స్పష్టమే. గత ఏప్రిల్‌లో అమెరికా పాలసీ గ్రూపుతో గూగుల్ కొన్ని ఆరోపణల విషయంలో ఒక ఒప్పందం చేసుకుంది. జీమెయిల్ వినియోగదారులందరినీ ఆటోమేటిక్‌గా తన సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ “గూగుల్ బజ్” సర్వీసు వినియోగదారులుగా మార్చివేయడాన్ని వీరు ఈ గ్రూపు తప్పు పట్టింది. జీమెయిల్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఇలా చేయడం వారిని మోసం చేయడమేనని నిర్ధారించింది. దీని ద్వారా గూగుల్ తన ప్రైవసీ పాలసీని తానే ఉల్లంఘించిందని నిర్ధారించింది.
గత సంవత్సరం యూరోపియన్ కమిషన్ కూడా యూరోపియన్ పోటీ చట్టాలను గూగుల్ ఉల్లంఘిస్తున్నదని అనేక కంపెనీలు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించింది. ఎఫ్.టి.సి కి చెందిన “బ్యూరో ఆఫ్ కాంపిటీషన్స్” సంస్ధను గూగుల్‌కి సబ్‌పూనా (subpoenas) ఇవ్వాలా వద్దా అని ఈ నెలల్లో ప్రవేటు చర్చలు జరిపిందనీ, అవి ఇచ్చే వైపుగా ఆ చర్చల సారాంశం ఉందనీ న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. మరోవైపు ఫైనాన్షియల్ టైమ్స్ కధనం ప్రకారం కాలిఫోర్నియా, న్యూయార్క్, ఓహియో రాష్ట్రాలకు చెందిన అటార్నీస్-జనరల్ కూడా గూగుల్‌పై యాంటీ ట్రస్ట్ పరిశోధనలు ప్రారంభించారు.
గూగుల్ చేతిలో అనేక సర్వీసుల సంస్ధలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఎక్స్‌పెడియా, ట్రిప్‌అడ్వైజర్ లాంటి ట్రావెల్ కంపెనీలు గూగుల్‌పై ఫిర్యాదు చేశాయి. ఆరోగ్యానికి సంబంధించిన వెబ్‌సైట్ వెబ్‌ఎండి (webMD.com), స్ధానిక వ్యాపారాల సమీక్షలను అందించే వెబ్‌సైట్లు yelp.com, Citysearch.com సంస్ధలూ కూడా తమ తమ వ్యాపారాల్లో గూగుల్ తన సొంత సర్వీసులను ప్రమోట్ చేసుకుంటూ పోటీ చట్టాలను ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశాయి. గతంలో వివిధ సర్వీసులు అందించే వెబ్‌సైట్లకు వినియోగదారులను నేరుగా పంపే లక్ష్యం పెట్టుకున్న గూగుల్ ఇప్పుడు అన్ని రంగాల్లొని వ్యాపార సంస్ధలను కొనేసి, తన సంస్ధలవైపుకి ట్రాఫిక్ ని మళ్ళించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇతర వ్యాపార సంస్ధలకు వర్తించే నియమ నిబంధనలను తన సర్వీసు సైట్లకు వర్తింపజేయకుండా పోటీ సానుకూలతను తనకు తాను ఇచ్చుకుంటోందని అనేక సంస్ధలు బహిరంగంగానే గూగుల్‌ని నిందించాయి. ఇతర సైట్లలోని కంటెంట్‌సైతం అది దొంగిలించిందని కొన్ని సంస్ధలు ఆరోపించాయి. తాను ఉచితంగా అందించే బ్లాగర్ సేవలలో బ్లాగర్లను కాపీ చేయవద్దని నిర్దేశించే గూగుల్ తానే స్వయంగా కాపీయింగ్‌కి పాల్పడడం విడ్డూరం. “ఇతర పబ్లిషర్ల వెబ్‌సైట్లలో నిర్మించిన కంటెంట్లను గూగుల్ కాపీ చేసి తన వెబ్‌సైట్లే నెంబర్ వన్ గా చెప్పుకుంటూ ప్రమోట్ చేస్తుంది” అని Citysearch.com, Urbanspoon.com, InsiderPages.com వెబ్‌సైట్లని నిర్వహించే సిటీగ్రిడ్ మీడియా అధినేత జే హెర్రాట్టీ ఆరోపించాడు. తాను గూగుల్‌తో సంప్రతించి ఈ అంశాలను వారి దృష్టికి తెచ్చినప్పటికీ వారు వినిపించుకోలేదనీ తమ ఎజెండా ప్రకారం వెళ్ళడానికే నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోందనీ జే తెలిపాడు.
సెర్చి ప్రకటనల రంగంలో తనకు ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని ఇతర వ్యాపారాల్లో సైతం తన ఆధిక్యతను సాధించడానికి గూగుల్ ప్రయత్నిస్తున్నదని గూగుల్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం తాను ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెడుతుండే సరికి అక్కడ అప్పటికే ఉన్న సంస్ధలు తాము ఆధిక్యత సాధిస్తామేమోనన్న భయాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని సమాధానం ఇస్తోంది. అంటే ఆరోపణలకు ఇచ్చే సమాధానాల్లోనే తాము ఆధిక్యత సాధించేశాం అన్న భావాన్ని గూగుల్ వదులుతోంది. మేము సాధించిన విజయాలను చూసి ఇతర వ్యాపార సంస్ధలకు గుబులు పుట్టడాన్ని మేము అర్ధం చేసుకుంటున్నామంటూ కొంటె ప్రకటనలు గూగుల్ చేస్తోంది. గూగుల్ చేస్తున్న మరో ముఖ్యవాదన ఈ ఆరోపణలు చేసే కంపెనీలన్నింటి వెనకా మైక్రోసాఫ్ట్ ప్రోత్సాహం ఉందని ప్రత్యారోపణ చేయడం. ఐతే గూగుల్ చెబుతున్నట్లు ఇతర సంస్ధల వెనక తాను లేననీ, కాకపోతే తమ ఆందోళనలను ఎక్కడికి చేర్చాలో తెలిపే మార్గదర్శకం మాత్రమే తాను చేస్తున్నాననీ మైక్రోసాఫ్ట్ సంస్ధ చెబుతోంది.
గూగుల్‌కి సబ్‌పూనాలు జారీ చేయాలని ఎఫ్.టి.సి తీసుకున్న నిర్ణయం గూగుల్ ఘోరాలను రుజువు చేసే సాక్ష్యాలు దానికి లభించాయనడానికి సంకేతమని వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనా వేస్తోంది. విచారణ సంవత్సరం పైనే తీసుకుంటుందని కూడా అది అంచనా వేస్తోంది. గూగుల్ విషయంలో ఈ నిర్ణయానికి రావడానికి ఎఫ్.టి.సి జస్టిస్ డిపార్ట్‌మెంట్ తో చాలా తీవ్రంగా ఘర్షణ పడిందని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక చెబుతోంది. ఫెడరల్ యాంటీ ట్రస్ట్ చట్టాలను అమలు చేసే బాధ్యత ఎఫ్.టి.సి, జస్టిస్ డిపార్ట్‌మెంట్ రెండింటికీ ఉందని తెలుస్తోంది. దరిమిలా కొన్ని నెలలనుండీ గూగుల్ బిజినెస్ పద్ధతులపై ఎఫ్.టి.సి సమాచారం సేకరిస్తూ వచ్చింది. గూగుల్ బజ్ కి సంబంధించిన ఆరోపణలపై రానున్న 20 సంవత్సరాల వరకూ తన ప్రైవసీ సూత్రాల అమలు విషయంలో స్వతంత్ర ఆడిట్ జరిపి సదరు నివేదికలను ఎఫ్.టి.సి కి సమర్పిస్తానని గూగుల్ ఒప్పందం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని గూగుల్ ఉల్లంఘించిన దరిమిలా ఎఫ్.టి.సి ఈ ఒప్పందాన్ని గూగుల్‌కి తప్పని సరి చేసింది.
గత ఏప్రిల్ లోనే గూగుల్ ట్రావెల్ సాఫ్ట్‌వేర్ అందజేసే సాఫ్ట్‌వేర్ సంస్ధ ITA Software ను కొనేసింది. ఈ కొనుగోలును ఆమోదించడానికి వీలుగా జస్టిస్ డిపార్ట్‌మెంటు ఈ రంగంలో గూగుల్ ఆపరేషన్లను పర్యవేక్షించడానికి గూగుల్ అంగీకరించింది. 2008 సం. లో యాహూ ఇంక్ తో గూగుల్ చేసుకున్న ప్రకటనల ఒప్పందాన్ని జస్టిస్ డిపార్ట్‌మెంట్ అడ్డుకుంది. ఈ ఒప్పందవలన ప్రకటనల రంగంలో 90 శాతం మార్కెట్‌ని గూగుల్ నియంత్రించే ప్రమాదం ఉన్నందున ఒప్పందాన్ని అడ్డుకున్నట్లు జస్టిస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
పరిశీలిస్తే గూగుల్ విన్యాసాలకు అంతే లేనట్లు కనిపిస్తోంది. మార్కెట్ శక్తులకు కళ్ళెం వదిలాక లాభాల కోసం పెట్టుబడిదారీ గుత్త సంస్ధలు పోటీని నిరోధించడానికి ఎన్ని అరాచకాలకు పాల్పడేదీ తెలుసుకోవడానికి గూగుల్ వ్యవహారం ఓ చక్కని ఉదాహరణ. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు, దాని ఇష్టులు ఎంతో గొప్పగా మురిసిపోతూ చెప్పుకునే “పోటీ సిద్ధాంతం” పర్యవసానాలు ఇలా ఉన్నాయి. గూగుల్ పై ఫిర్యాదు చేస్తున్న మైక్రోసాఫ్ట్ సైతం గతంలో ఇవే విధానాలకు పాల్పడి దొరికిపోయిందని గుర్తు చేసుకుంటే పోటీని చంపేసి ఆధిక్యతను సాధించదం బహుళజాతి గుత్త సంస్ధలకు ఏ రంగంలోనైనా సాధారణమేనని అర్ధం కాగలదు.
