ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా


ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ సైనికుల్ని ఉపసంహరిస్తామని ఫ్రాన్సు అధ్యక్ష భవనం ప్రకటించింది. ఫ్రాన్సు అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో సంప్రదింపులు జరిపిన అనంతరం ఫ్రాన్సు ప్రకటన వెలువడిందని బిబిసి తెలిపింది.

అమెరికా 111,000 మంది సైనిల్ని పంపగా ఇంగ్లండు 10,000 మందినీ, ఫ్రాన్సు 4,000 మందినీ సైనికుల్ని ఆఫ్ఘన్ దురాక్రమణకు పంపాయి. అమెరికా జులై నెలలో 5000 మందినీ, ఈ సంవత్సరం చివర్లో మరో 5000 మందినీ సైనికుల్ని ఉపసంహరించుకుంటుందని ఒబామా ప్రకటించాడు. ఒబామా అధికారంలోకి వచ్చాక ‘ట్రూప్ సర్జ్’ పేరుతో అదనంగా పంపిన సైనికుల్లో మిగిలిన 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరించగలమని ఒబామా ప్రకటించాడు. ఈ నిర్ణయంలొ ఇక మార్పు ఉండదనీ, చెప్పినట్లుగా అనుకున్న సమయానికి అనుకున్నంతమందిని వెనక్కి పిలిపిస్తామని ఒబామా ప్రకటించాడు. “యుద్ధ కెరటాలు వెనక్కి వెళ్తున్నాయి (tide of war is receding) అని ఒబామా అమెరికా ప్రజలకు తెలిపాడు. “అమెరికా! ఇక స్వదేశంలో ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుచుకోవలసిన సమయం ఆసన్నమయింది” అని ఒబామా అమెరికా ప్రజలనుద్దేశించి చెప్పాడు.

ఒబామా ప్రకటన వెలువడ్డాక ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఒబామాతో ఫోనులో సంప్రదింపులు జరిపాడు. అనంతరం అమెరికా ఉపసంహరణ దామాషాలో ఫ్రాన్సు సైనికులు వెనక్కి వస్తారని ఫ్రాన్సు అధ్యక్ష భవనం ప్రకటించింది. అమెరికా నిర్ణయం సరైందని కూడా ఫ్రాన్సు ప్రకటించింది. బ్రిటన్ మాత్రం సమీప భవిష్యత్తులో తమ సైనికుల్ని వెనక్కి రప్పించే ఆలోచన ఏదీ తనకు ఉన్నట్లుగా ఇంకా ప్రకటించలేదు. గతంలో 2015 లోపు ఉపసంహరించుకుంటాననీ, పరిస్ధితులు అనుకూలిస్తే ఆ లోపుగానే ఉపసంహరించుకుంటాననీ ప్రకటించింది. అంతే కాకుండా కొంత సైన్యం ఆఫ్ఘనిస్ధాన్‌లో మరో 30 సంవత్సరాలు కూడా ఉండవలసి రావచ్చునని బ్రిటన్ ప్రతినిధి అంతకుముందు ప్రకటించాడు. బ్రిటన్ ప్రకటనను బట్టి అమెరికా కూడా ఆఫ్ఘనిస్ధాన్‌లో శాశ్వత సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుందని భావించవచ్చు.

కనుకనే అమెరికా సైనిక ఉపసంహరణ ప్రకటనను “సింబాలిక్” అని తాలిబాన్ కొట్టిపారేసింది. విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్ధాన్‌నుండి పూర్తిగా వెళ్ళీపోయేవరకూ తమ పోరు ఆగదని ప్రకటించింది. అమెరికా ఉపసంహరణ సంఖ్య అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగానూ, నెమ్మదిగానూ ఉండగా, అమెరికా మిలట్రీ ఇచ్చిన సలహా లేదా కోరిక కంటే చాలా ఎక్కువగానూ, వేగంగానూ ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి నామమాత్రంగానే ఉపసంహరణ జరగాలనీ, సైనిక ఒత్తిడి లేనట్లయితే తాలిబాన్ చర్చలకు సిద్ధపడడం సాధ్యం కాదని అమెరికా బలగాల అధిపతి డేవిడ్ పెట్రాస్ తెలిపినప్పటికీ ఒబామా, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఏదో మేరకు సంతృప్తి పరచడానికి ప్రయత్నించాడని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఉపసంహరణ ప్రకటనను డేవిడ్ పెట్రాస్ అంగీకరించలేదని బిబిసి తెలిపింది.

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ రోధమ్ క్లింటన్ కూడా ఉపసంహరణ పట్ల అంత సంతోషంగా లేదనీ, మిలట్రీ అభిప్రాయాలతో హిల్లరీ ఏకిభవిస్తున్నదనీ తెలుస్తోంది. డిఫెన్సు సెక్రటరీ, రాబర్ట్ గేట్స్, హిల్లరీలో అయిష్టంగానే సైనిక ఉపసంహరణకు ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఒబామా ప్రకటన తమ దేశానికి శుభవార్తగా పేర్కొన్నాడు. తమ దేశ భద్రతను చూసుకోవడానికి తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వ భద్రతా బలగాల ప్రతినిధులు కొందరు తమ బలగాల సామర్ధ్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా క్రమపద్ధతిలో ఉపసంహరణ చేయాలనీ, ఒక్కసారిగా చేస్తే ఆఫ్ఘన్ బలగాలకు కష్టాలే ననీ వ్యాఖ్యానిస్తున్నారు.

జూన్ 2011 నాటికి విదేశీ బలగాలు దాదాపు 140,000 గా ఉన్నాయని బిబిసి తెలిపింది. ఆఫ్ఘన్ బలగాల సంఖ్య అక్టోబరు 2011 నాటికి 170,000 కు చేరుకోవాలని నాటో నిర్ధేశించింది. తాలిబాన్‌తో చర్చలు ప్రకటించిన అమెరికా దాన్ని ఎంతవరకూ సాధిస్తుందో చూడవలసిందే. తాలిబాన్ టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసి ప్రచారం చేసిన అమెరికా, పశ్చిమ రాజ్యాలు, తామిక పోరాడలేమని అర్ధమయ్యాక ఆ సంస్ధ అర్జెంటుగా టెర్రరిస్టు లక్షణాలను కోల్పోవడం ప్రపంచ ప్రజలు గమనించవలసిన ముఖ్య విషయం. ఆఫ్ఘన్ పై దాడికి అమెరికా ప్రకటించిన కారణం అసలుది కాదనీ, సామ్రాజ్య విస్తరణ, ఆసియాలో చైనా, రష్యా, ఇండియా ల పురోగమనానికి చెక్ పెట్టడానికే దురాక్రమణ యుద్ధానికి తెగబడిందనీ ఇప్పటికైనా అమెరికా పట్ల అపోహలు ఉన్నవారు గ్రహించవలసిన సంగతి.

వ్యాఖ్యానించండి