మౌలిక కారణాల వల్లనే ఆహార ధరలు పెరుగుతున్నాయ్! -ఆర్.బి.ఐ


Food prices

Food prices

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆహార ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా జూన్ 11 తేదీతో ముగిసే సంవత్సరంలో ఆహార ధరల సూచిక 9.13 శాతానికీ, ఇంధన ధరలు 12.84 శాతానికీ పెరిగాయి. దానికి కారణాలు చెప్పమంటే వర్షాలు కురవక అని ఒక సారీ, సరఫరా ఆటంకాల వలన అని ఇంకొకసారీ, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని మరొక సారీ అని చెబుతూ వచ్చారు.

ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక పండితులు, మంత్రులు ఈవిధంగా తమ నియంత్రణలో లేని కారణాలపై నెపం నెడుతూ కాలం గడుపుతున్నారు. కేవలం తాత్కాలిక కారణాలు మాత్రమే ఆహారం ధరలు పెరుగుతున్నాయనీ, ఆ కారణాలు పరిష్కారం అయితే ధరలు తగ్గుతాయనీ వీరు చెబుతూ వచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసులు ఈ ప్రచారమే ఎప్పుడూ చేస్తుంటారు.

కాని ఇన్ని సంవత్సరాల పాటు ఆహార ధరలు అధికంగా ఉండడానికి తాత్కాలిక కారణాలే ప్రధానమని చెప్పడం అర్ధం లేదని మౌలిక కారణాల వల్లనే అధిక ఆహార ధరలు భారత ప్రజలను పీడిస్తున్నాయని స్వయంగా ఆర్.బీ.ఐ డెప్యుటీ గవర్నరు సుబీర్ గోకర్ణ గురువారం తెలిపాడు. “ఆహార ధరలు రుతుపవన వర్షాలపై ఆధారపడి ఉంటాయని సాధారణంగా నమ్ముతుంటారు. కానీ ఈ నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పరీక్షకు గురైంది” అని సుబీర్ కుండబద్దలు కొట్టాడు. రుతుపవన వర్షాలు గత సంవత్సరం సక్రమంగా కురిసినా, ఆహార ధరలు దిగిరాక పోవడాన్ని సుబీర్ గుర్తు చేస్తున్నాడు.

“వర్షాలు లాంటి తాత్కాలిక కారణాల వలన కాకుండా మరింత మౌలిక కారణాల వలనే ఆహార ధరలు అందనంత స్ధాయికి చేరుకున్నాయని చెప్పడానికి చాలినన్ని సాక్ష్యాలు ఉన్నాయని భావిస్తున్నాను” అని ఆయన తెలిపాడు.

వ్యాఖ్యానించండి