ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా లాడెన్ హత్య నుండే తన ఎన్నికకు తగిన పునాదిని ఏర్పరుచుకుంటూ వచ్చాడని ప్రధాన స్రవంతి పత్రికలు, అందునా పశ్చిమ దేశాల కార్పొరేట్ ప(పు)త్రికలే అంచనాలు వేయడం ఇక్కడ గమనించ దగ్గది.
ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధంపై వ్యతిరేకత నిజానికి ఈనాటిది కాదు. ఒబామా మొదటిసారి పోటీ చేస్తున్నపుడే యుద్ధాలను ముగించి సైనికులను వెనక్కి రప్పిస్తానని ఒబామా వాగ్దానం చేశాడు. ఒబామాకి ఓట్లు సంపాదించిన నినాదాల్లో అది ఒకటి కూడా. కానీ అధికారంలోకి వచ్చాక సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి బదులు ఒబామా “ట్రూప్స్ సర్జ్” అని ప్రకటించి మరో 33,000 మంది సైనికుల్ని ఆఫ్ఘనిస్ధాన్‌కి పంపాడు. అదనపు సైన్యం పంపిస్తున్నట్లు చేస్తున్న ప్రకటనలోనే 2011 వేసవిలో వారిని ఉపసంహరిస్తానని కూడా ప్రకటించాడు. అదనపు సైన్యం వచ్చిందిగానీ ఆఫ్ఘనిస్ధాన్‌లో పరిస్ధితిలో పెద్దగా మార్పు రాలేదు. ఫలితంగా తొందరగా ఫలితాలు రప్పించాలని భావించిన ఒబామా మానవ రహిత డ్రోన్ విమానాల వినియోగాన్ని తీవ్రం చేశాడు.
దానికి ముందు పౌరుల మరణాన్ని తక్కువ చేయాలన్న లక్ష్యంతో విమానదాడులు తగ్గించి భూతల యుద్ధానికి ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. దాంతో ఆ పద్దతికి స్వస్తి చెప్పి డ్రోన్ విమానాల దాడులను పెంచడం ద్వారా పాకిస్ధాన్ పౌరుల మరణానికి కారణమయ్యాడు ఒబామా. డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నది మిలిటెంట్లో కాదో తెలియదు కానీ అమెరికా మాత్రం ఒక్కో దాడిలో పదుల సంఖ్యలో మిలిటెంట్లు మరణిస్తున్నారని ప్రకటిస్తూ వచ్చింది. మిలిటెంట్లు కాదు పాకిస్ధాన్ పౌరులను చంపుతున్నారని పాకిస్ధాన్ ప్రజలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఘోష పెడుతున్నాయి. పౌరుల మరణాలను తగ్గిస్తానని వాగ్దానం చేసిన ఒబామా డ్రోన్ దాడులను పెంచడం ద్వారా దానికి స్వస్తి పలికాడు. డ్రోన్ దాడుల్లో సంభవిస్తున్న పౌరుల మరణాలు మరింతమంది మిలిటెంట్లను తయారు చేశాయి.
మరోవైపు అమెరికాలో ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధం అంతు లేకుండా కొనసాగుతుండడం పట్ల వ్యతిరేకత తీవ్రమవుతూ వచ్చింది. అమెరికా ప్రజలే కాకుండా అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా పార్టీలకు అతీతంగా సైనికుల ఉపసంహరణ ప్రారంభించాలని డిమాండ్ చేయడం ఎక్కువయింది. ఆఫ్ఘన్ యుద్ధ విజయం పట్ల అమెరికన్లకు రోజు రోజుకీ అనుమానాలు ఎక్కువయ్యాయి. అమెరికాలో ఆర్ధిక సంక్షోభం ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయి, కొత్త ఉద్యోగాల సృష్టి గగనంగా మారి ప్రజల జీవన ప్రమాణాలు కుచించుకుపోతున్న నేపధ్యంలో ఆర్ధిక వృద్ధి బాగా క్షీణిస్తున్నది. అప్పు భారం మరింత పెరిగిపోయి బడ్జెట్ లోటు ఇంతింతై… వటుడింతై… అన్నట్లుగా దూసుకెళ్తుండడంతో అమెరిక ఆర్ధిక వ్యవస్ధ పట్ల మార్కెట్లో ఎంత తక్కువగా నయినా అనుమానాలు తలెత్తుతున్నాయి. సంవత్సరానికి 110 బిలియన్ డాలర్లు (దాదాపు రు.5 లక్షల కోట్లకు సమానం) ఒక్క ఆఫ్ఘన్ యుద్ధానికే ఖర్చవుతోంది. “ప్యూ రీసెర్ద్” సంస్ధ సర్వేజరిపి మంగళవారం విడుదల చేసిన సర్వే ఫలితాల్లో 56 శాతం మంది తక్షణమే సైన్యాన్నంతటినీ ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించాలని కోరుతున్నట్లు తేలింది.
ఈ నేపధ్యంలోనే సైనికుల ఉపసంహరణను చూపనిదే అమెరికా ప్రజల్లో పోయిన ప్రతిష్ట తిరిగి తెచ్చుకోవడం అసాధ్యమని ఒబామా, ఆయన సలహా మండలి అంచనా వేసి ఉండవచ్చు. అయితే సైన్యాన్ని ఏ కారణం చెప్పి ఉపసంహరించాలి. ప్రజల వ్యతిరేకత లాజికల్ గా మెప్పించే కారణం కాజాలదు. సైనిక ఉపసంహరణ అంటే అమెరికా అక్కడికి వెళ్ళిన పని ముగిసినట్లని తన ప్రజలకు చెబుతున్నట్లే అర్ధం వస్తుంది, రావాలి కూడా. అలా అర్దం వచ్చేందుకు తగిన కారణం కూడా ప్రపంచానికి కనపడాలి. ఆఫ్ఘన్ యుద్ధం జంట టవర్లపై దాడిని చూపి ప్రారంభించారు. లాడెన్‌ను కాపాడుతున్నందున ఆఫ్ఘన్‌పై దాడి అన్నారు గనక ఆ లాడెన్ దొరికితేనే ఆఫ్ఘన్ యుద్ధానికి లాజికల్ ముగింపు సాధ్యం. అక్కడే లాడెన్ హత్య అవసరం ముందుకొచ్చింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అమెరికా తలచుకుంటే లాడెన్ దొరకడం చిటికెలో పని. ఎన్నడో సహజ కారణాలతో లాడెన్ మరణించి ఉంటే అతన్ని చంపడం ఇంకా తేలిక. దరిమిలా, అర్ధరాత్రి అబ్బొత్తాబాద్ పై దాడి, లాడెన్ హత్యా ప్రకటన జరిగాయి.
లాడెన్ మరణించాడనేందుకు ఒక్క సాక్ష్యం కూడా అమెరికా ఎందుకు చూపలేకపోయింది? ఈ ప్రశ్నకు సరైన అధికారిక సమాధానం ఇక ఎప్పటికీ రాదు. మరణం భయంకరంగా ఉంది కనుక ఫోటోలు విడుదల చేయలేదన్న కారణం ఈ ఘటనలో ఎక్కడా ఇమడని కారణం. మరి మిగిలిన వారి హత్యా ఫోటోలను, అవీ భయంకరంగా ఉన్నప్పటికీ ఎందుకు విడుదల చేసినట్లు? ఫోటోలు భయంకరంగా ఉన్నాయి సరే. అతనిని సరిగ్గా సమాధి చేసినట్లయితే శిధిలాలనుండి తీసిన శరీర భాగాల డి.ఎన్.ఎ తోనైనా లాడెన్ మరణాన్ని నిర్ధారించవచ్చు కదా! ఆ అవకాశం కూడా లేకుండా శవాన్ని మాయం చేయడానికి కారణం ఏమిటి? ఈ సమాధానం దొరకని ప్రశ్నలతో పాటు గతంలో లభించిన అనేక సాక్ష్యాలు లాడెన్, ఒబామా ప్రకటించీనట్లుగా చనిపోలేదనీ, అసలు వాస్తవాలు వేరనీ అనుమానాలు తలెత్తడానికి కావలసిన సరంజామాను సమకూరుస్తున్నాయి.
ఏదేమైనా లాడెన్ హత్య, అమెరికా సైన్యం ఉపసంహరణకు అవసరమైన కారణాన్ని ఒబామాకి సమకూర్చాయి. అయితే అమెరికా మిలట్రీ వాదన వేరేగా ఉంది. ఇటీవలి కాలంలో తాలిబాన్‌పై కొన్ని విజయాలు సాధించామని ఒబామాతో పాటు మిలట్రీ కూడా ప్రకటించారు. ఈ విజయాలు తాత్కాలికమేనని, వాటిని తాలిబాన్ మళ్ళీ ఉల్టా చేయవచ్చనీ మిలట్రీ ప్రతినిధులు గట్టిగా వాదించారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ లో అమెరికా సైన్యాధిపతి డేవిడ్ పెట్రాస్ ఇప్పటికైతే నామ మాత్రంగానే ఉపసంహరణ చూపాలని కోరాడు. తాలిబాన్‌పై సైనికపరమైన ఒత్తిడి లేనిదే వారిని చర్చలకు ఒప్పించడం కూడా కష్టమేననీ, కనుక పెద్దగా ఉపసంహరణ కూడదని చెవినిల్లు కట్టుకుని పోరాడు. కానీ ఒబామాకి 2012 ఎన్నికలే కనపడుతున్నందున మిలట్రీ సలహాలను పక్కన పెట్టాడు. అదే సమయంలో డెమొక్రాట్ పార్టీతో పాటు రిపబ్లికన్ పార్టీ కి చెందిన కాంగ్రెస్ సభ్యులు కూడా ఆఫ్ఘనిస్ధాన్ నుండి గణనీయంగా సైనికుల్ని తగ్గించాలని కోరుతున్నారు. ప్రజల విషయం చెప్పనక్కర్లేదు. 2012 సెప్టెంబరులో మలివిడత ఉపసంహరణలో భాగంగా 23000 మంది సైనికులు వెనక్కి వస్తుంటే, అదే సమయంలో ఒబామా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే… ఈ దృశ్యమే ఒబామాకి బహుశా కనిపించి ఉండాలి. తిరిగి వచ్చిన సైనికులను కలుసుకున్న వారి కుటుంబాల నుండి రోజుకొక సంతోష గాధ టీ.వీ ఛానెళ్ళు పోటీ పడి ప్రసారం చేస్తుంటే ఆ కధనాలన్నీ ఒబామా ఎన్నికకు అనుగుణంగా రేటింగ్ ను పెంచుతూ పోతుంటే… ఈ దృశ్యం ఇంకా కలర్‌ఫుల్ గా ఒబామాకి కనిపించి ఉండాలి.
ఈ విధంగా తక్షణమే సైన్యాన్నంతటినీ ఉపసంహరించాలన్న ప్రజల మరియు కాంగ్రెస్ లోని మెజారిటీ సభ్యుల డిమాండ్ కి తక్కువగానూ, ఏదో నామ మాత్రంగా ఉపసంహరిస్తే సరిపోతుందన్న అమెరికా మిలట్రీ సలహాకు ఎక్కువగానూ ఒబామా ప్రకటించిన సైనికుల ఉపసంహరణ ఉన్నది. అయితే ఈ సంఖ్యతోనే ఒబామా ఇరువర్గాలని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాడని అర్ధం చేసుకోవచ్చు. తక్షణమే ఉపసంహరించకుండా లేదా ఎక్కువమందిని ఉపసంహరించకుండా మిలట్రీని కొంత సంతృప్తి పరచడానికి ప్రయత్నం జరిగింది. అదే విధంగా నామా మాత్రపు ఉపసంహరణతో సరిపెట్టకుండా, కనీసం ఒబామా అదనంగా పంపిన సైనికులను మొత్తాన్నీ ఉపసంహరించుకుని కొంతమేరకు కాంగ్రెస్ నీ, ప్రజలనీ సంతృప్తి పరచడానికి ప్రయత్నం జరిగింది. ఇరు పక్షాలను సంతృప్తి పరిచి తద్వారా మిగిలిన ఉన్న అసంతృప్తిని చల్లబరచడానికి బుజ్జగించడానికి తగిన సమయాన్ని కూడా ఒబామా సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ఇది ఒబామా మార్కు రాజకీయ క్రీడ. అటు ప్రజలు, ప్రజాప్రతినిధులతోనూ, ఇటు మిలట్రీ తోనూ ఒబామా ఆడిన పొలిటికల్ గాంబ్లింగ్!
