పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక


Samjhauta-Express

Samjhauta-Express

ఇండియా, పాకిస్ధాన్ దేశాల విదేశీ కార్యదర్శులు ఈ వారంలోనే పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరపనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లలో ఇరు దేశాలు మునిగి ఉండగా, తలవని తలంపుగా ఊడిపడిందో ప్రకటన. అది “జమాత్ ఉద్-దవా” (జెయుడి) అనే సంస్ధ, తన సంస్ధాగత సమావేశాలను జరుపుకుంటున్న సందర్భంగా ఇండియాకు చేసిన హెచ్చరిక. కరాచిలో కాన్ఫరెన్సు జరుపుకున్న ఈ సంస్ధ ముగింపులో ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. కాన్ఫరెన్సులో పాల్గొన్న నాయకులంతా ఒకే కల కన్నారేమో తెలియదు గానీ ఇండియా పాకిస్ధాన్‌పై దాడి చేస్తే ఒప్పుకోమంటూ తమ డిక్లరేషన్‌లో హెచ్చరించారు.

అమెరీకాకి చెందిన ప్రత్యేక బలగాలు నాలుగు హెలికాప్టర్లలో పాక్ గగనతలంలోకి జొరబడి లాడెన్ దాక్కున్నాడంటూ ఒక భవనంపై దాడి చేసి అక్కడ ఉన్న నలుగురిని చంపేసింది. తాము హత్య చేసిన వారిలో లాడెన్ ఉన్నాడని ప్రకటించారు. ఈ సందర్భంగా భారత దేశానికి చెందిన ఆర్మీ అధికారి ఒకరు అత్యుత్సాహంతో తాము కూడా తలుచుకుంటే అమెరికా చేసినట్లుగానే దాడి చేయగలమని ప్రకటించాడు. బహుశా జెయుడి చేసిన ప్రకటన, ఈ ప్రకటనను ఉద్దేశించింది అయి ఉండవచ్చు.

ఈ డిక్లరేషన్ ఇండియాపై హెచ్చరిక జారి చేయడంతో పాటు కొన్ని డిమాండ్లను కూడా ఇండియా ముందూ, మరికొన్నింటిని పాకిస్ధాన్ ప్రభుత్వం ముందూ ఉంచింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ళకు బాధ్యులైనవారిని పాకిస్ధాన్‌కి అప్పజెప్పాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇండియా పాకిస్ధాన్ ల నడుమ నడిచే ఈ రైలులో 2007లో బాంబులు పెట్టి రెండు కంపార్టుమెంట్లను పేల్చి వేశారు. ఆ ఘటనలో 68 మంది చనిపోగా వారిలో అత్యధికులు పాకిస్తానీయులే. స్వామీ అసీమానంద నాయకత్వంలోని హిందు టెర్రరిస్టు సంస్ధ నవభారత్ సంస్ధ ఈ పేలుడుకి బాధ్యురాలని సి.బి.ఐ ఛార్జి షీటును రెండు రోజుల క్రితమే దాఖలు చేసింది. ఇస్లాం రక్షణ కోసం, పాకిస్ధాన్ స్ధిరత్వం కోసం అంటూ వారు చేసిన ఇతర డిమాండ్లు ఇలా ఉన్నాయి.

  • అమెరికాని పాకిస్ధాన్ శతృవుగా ప్రకటించాలి
  • పాకిస్ధాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత పౌరుడు సరబ్జిత్ సింగ్‌ను విడుదల చేయరాదు
  • పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తున్నంతగా పాకిస్ధాన్ పరిస్ధితులు అల్లకల్లోలంగా ఏమీ లేవు. ప్రచారం తగదు
  • ఒసామా బిన్ లాడెన్ అమరుడు
  • అమెరికా, ఇజ్రాయెల్, ఇండియాలు “సాతానికి ట్రినిటీ” సభ్యులు

పాకిస్ధాన్‌తో శాంతి చర్చలు జరపడానికి వెళుతున్న మన విదేశీ కార్యదర్శి వీరి ప్రకటనలను పట్టించుకోకుండా చర్చలకు వెళ్ళాలని ఆశిద్దాం!

One thought on “పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక

  1. పుట్టపర్తి యజుర్మందిరంలో పట్టుపడుతున్న సొమ్ము వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

    ప్రధానితో సహా ఇతర గ్రేడ్‌-1 ప్రభుత్వ అధికారులూ న్యాయమూర్తులూ అందరూ లోక్‌ పాల్‌ పరిధిలోకి తేబడాలి

    అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు, ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి

వ్యాఖ్యానించండి