పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని పోలిసుల్తో ధ్వంసం చేయించారు. వారి సొంత ఇళ్ళు, భూములు కాపాడుకోవడానికి ఒడిషాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ధింకియా, గడ్కూజంగ్, గోవింద్‌పూర్, నౌ గాంవ్ గ్రామాల ప్రజలు, విదేశీ పెట్టుబడి, దేశీయ పెట్టుబడి, భూస్వాముల కూటమితో కురుక్షేత్ర సమరం చేస్తున్నారు.
అలాగని వీరు సాయుధులు కారు. తుపాకులు, విల్లంబులు లేవు. బాంబులు, ఫిరంగులు అసలే లేవు. నిండా శరీరాన్ని కప్పడానికి ఇంత గుడ్డలేనీ ఈ మట్టిమనుషులు, మట్టిని కౌగలించుకుని పోరాడుతున్నారు. మా భూమిని మా చేతులనుండి లాక్కోవద్దని వేడుకుంటే వెయ్యిమంది సాయుధుల్ని దించి, మీ ఊర్లో మీరు పడుకొని ఉండడం ‘చట్ట విరుద్ధం’ అని ప్రకటించాడు ఒడిషా సి.ఎం నవీన్ పట్నాయక్. కేంద్ర “శెభాస్, ప్రొసీడ్” అంటుండగా తుపాకులు ఎక్కుపెట్టించాడు. కాని మట్టిని నమ్ముకున్న పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఉన్న ఆ నాలుగూళ్ళకు ఆ మట్టే జీవనాధారం. అందుకే మట్టినే కౌగలించుకుని ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు వారాలపాటు వరసగా పోలీసుల్ని అడ్డుకున్నారు. విధి లేక భూసేకరణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఒడిషా ప్రకటించినా, పోస్కో మాత్రం ఫ్యాక్టరీ కట్టేది కట్టేదే అని ప్రకటించింది. “తుదికంటా పోరే దారి” అనంటున్న ఈ గిరిజనుల పోరాట దృశ్యాలు చూడండి:





































వారి పోరాటాలు విప్లవకారులకు ఒక ఇన్‌స్పిరేషన్. జనమే ఇలా స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వీరి వెనుక ఏమైనా పార్టీలు ఉన్నాయా?
సి.పి.ఐ (ఎం.ఎల్ – లిబరేషన్) పాత్ర కొంత ఉంది.
నిజానికి జనం స్వచ్ఛందంగా ఉద్యమించడం ఈ రోజుల్లో ఆశ్చర్యం కాదు. చాలా చోట్ల వారే ఉద్యమిస్తుంటే వారి వెనక ఈ ఉద్యమ పార్టీలు పరుగెడుతున్నాయి. అనేక కబుర్లు చెబుతున్న విప్లవ పార్టీలు, వారి కార్యకర్తలు ఏదో వంకతో ఉద్యమాలకు దూరంగా ఉండడమే ఆశ్చర్యం.