విదేశీ సైన్యం పూర్తిగా దేశం విడిచిపెట్టి వెళ్ళేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తాలిబాన్ ప్రకటించింది. ఒబామా ప్రకటన కేవలం సంకేతాత్మకమేనని ఆ సంస్ధ తెలిపింది. ఉపసంహరించుకుంటున్నాము అని చూపేందుకే తప్ప, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకునే ఉద్దేశ్యం అమెరికాకి లేదని తాలిబాన్ ప్రకటన అంతరార్ధం. “తక్షణమే విదేశీ సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోతేనే ఆఫ్ఘనిస్ధాన్ సంక్షోభం పరిష్కారం అవుతుందని ‘ది ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్ధాన్’ మరొక్కసారి స్పష్టం చేస్తోంది. అది జరిగేంతవరకూ సాయుధ పోరాటం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంటుంది” అని తాలిబాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఒబామా ప్రకటనతో వెల్లడైన సైనిక ఉపసంహరణ సంఖ్య అమెరికా మిలట్రీ కమాండర్లు ఇచ్చిన సలహా కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇటీవల సాధించిన విజయాలు నిలిచేవి కావనీ, మళ్ళీ అవి తిరగబడవచ్చనీ కనుక 2013 వరకూ సైనికుల సంఖ్య వీలైనంత అధికంగా కొనసాగించాలని వారు అధ్యక్షుడికి సలహా ఇచ్చారు. కాని వారి సలహా కంటే 2012 అధ్యక్ష ఎన్నికలే ఒబామా దృష్టిలో ప్రధానంగా కనిపిస్తున్నాయి కాబోలు.
ఒబామ ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన 33,000 సైన్యంలో 30,000 యుద్ధ సైనికులు కాగా 3,000 మంది వారికి మద్దతు కార్యక్రమాలకోసం వచ్చినవారు. ఈ 33,000 మందీ ఒబామా 2009 లో కొత్తగా ఆఫ్ఘనిస్ధాన్‌కి “సర్జ్” అని ప్రకటిస్తూ పంపిన బలగాలే కావడం గమనార్హం. అంటే ఒబామా తాను అధికారంలొకి వచ్చాక అదనంగా పంపిన సైన్యాన్ని మాత్రమే వెనక్కి రప్పిస్తున్నాడు తప్ప మొదటి నుండి కొనసాగుతున్న సైనికుల సంఖ్యను అలాగే కొనసాగిస్తున్నాడు. వారి ఉపసంహరణ పైన చెప్పుకున్నట్లు ఆఫ్ఘన్ సైనికుల సంసిద్ధతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఒబామా ఎన్నికల సమయంలో ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తానంటూ ఇచ్చిన వాగ్దానం అలానే ఉండిపోయింది. ఆయన వాగ్దానం ఇచ్చినపుడు 68,000 మంది ఆఫ్ఘన్ లో ఉండగా, తాజా ఉపసంహరణ అనంతరం కూడా అంతే సంఖ్యలో ఉంటారు. ఇది ఒబామా మార్కు మాయ కావచ్చు.
ఓ కధ గుర్తుకొస్తోంది. రామకృష్ట పరమహంస వద్దకి ఓ వ్యక్తి వచ్చి తన సమస్యను చెప్పుకుంటాడు. తన ఇల్లు చాలా ఇరుకుగా ఉందనీ అది విశాలం అయ్యే మార్గం చెప్పమని అడిగాడు. ఆయనది గేదెలు కాసే వృత్తి అని చెప్పాడు. పరమహంస ఆయనకి తన గేదెల్లో ఒకదాన్ని ఇంట్లోనే కట్టేయమని చెప్పాడు. పరమహంసపై ఉన్న గురితో మారు మాట్లాడకుండా ఆయన సలహాను అమలు చేసి ఓ వారం గడిచాక మళ్ళీ వచ్చి “స్వామీ ఇల్లు ఇంకా ఇరుకైంది” అన్నాడట. “ఇంకో గేదెని కూడా ఇంట్లో కట్టేయ్యి” అన్న పరమహంస సలహాతో అలాగే చేసి మరోవారానికి తిరిగొచ్చి “స్వామీ ఇంకా ఇంకా ఇరుగ్గా ఉంది. భరించలేనంత ఇరుకు. భార్యా బిడ్డలు నిద్రపోయే స్ధలం కూడా లేదు” అన్నాడట. అప్పుడు పరమహంస “రెండు గేదెల్నీ ఇప్పుడు ఇంట్లో కాకుండా ఎప్పటి చోటే కట్టెయ్యి” అని సలహా ఇచ్చాడట. సదరు వ్యక్తి అలాగే చేసి మరోవారం గడిచాక వచ్చి ” స్వామీ ఇప్పుడు ఇల్లు చాలా చాలా విశాలంగా ఉంది. నా సమస్య పరిష్కారమైంది. చాలా కృతజ్ఞతలు స్వామీ!” అని పరమానంద భరితంగా చెప్పుకున్నాడట. ఇప్పుడు ఒబామా ప్రకటించిన ఉపసంహరణ కూడా ఇలాగే ఉంది.
ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం కోసం అమెరికా వారానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోందనీ, 1,500 మంది అమెరికా సైనికులు చనిపోగా మరో 12,000 మంది గాయపడ్డారనీ బిబిసి తెలిపింది. యుద్ధ ఖర్చులను కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కనపడని యుద్ధం ప్రజల్లొ వ్యతిరేకతను పెంచుతోంది. “అమెరికా బలమైన స్ధానంలో ఉండి సైనికుల ఉపసంహరణను ప్రారంభిస్తోంది” అని ఒబామా ప్రకటించుకున్నాడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవడంలోనే అందులో ఎంత వాస్తవం ఉందీ తెలుపుతోంది. “ఆల్-ఖైదా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆల్-ఖైదా నాయకత్వంలో సగం మందికి పైగానే మట్టుపెట్టాం. అది ఓడిపోతోంది. పని పూర్తయ్యేదాకా మనం విరమించుకోము” అని తన అసలు ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లొ శాశ్వతంగ సైనిక స్ధావరాలని కొనసాగించడమే ఆయన అంతిమ లక్ష్యం.
“తాలిబాన్‌ని మనం తీవ్రంగా నష్టపరిచాం. వారి బలమైన స్ధావరాలు అనేకం వశపరుచుకున్నాం. మనతో పాటు అదనపు సైన్యాన్ని అందించిన ఇతర దేశాల సాయంతో దేశంలో అధిక ప్రాంతంలో స్ధిరత్వాన్ని సాధించగలిగాం” అని ఒబామా చెప్పుకున్నాడు. “ఈ ఉపసంహరణతో మొదలై మన సైన్యం నిరంతరం వెనక్కి వస్తూనే ఉంటారు. ఉపసంహరణ స్ధిరంగా కొనసాగుతుంది” అని ఆయన తెలిపాడు. ఒబామా ఉపన్యాసం అంతా ఆఫ్ఘనిస్ధాన్‌లో యుద్ధానికి స్వస్తి పలుకుతున్నామని అమెరికా ప్రజలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని బిబిసి విలేఖరి అభిప్రాయపడుతున్నాడు. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో ఇప్పటికి 6000 మంది అమెరికా సైనికులు చనిపోగా, 1 ట్రిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. పదివేలమందిలో 5000 మందిని వేసవిలోనూ మరో 5000 మందిని 2011 చివరి నాటికీ వెనక్కి రప్పిస్తామని ఒబామా ప్రకటించాడు.
