లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల కూటమి సింగూరు భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. చెప్పినట్లుగానే సింగూరులో రైతులనుండి బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి వీలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చట్టం కూడా ఆమోదించింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా సింగూరు భూమిని వశం చేసుకున్న టాటా మోటార్స్ సంస్ధ తనకిచ్చిన భూమిని మళ్ళీ రైతులకు ఇవ్వడం అన్యాయమని అంటోంది. ఈ చర్యకి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్తానని ప్రకటించింది.
త్రిణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఎస్.యు.సి.ఐ, సి.పి.ఐ (ఎం.ఎల్ -న్యూ డెమొక్రసీ) తదితర పార్టీల ఆధ్వర్యంలో సింగూరు రైతులనుండి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. బెంగాల్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పోలీసులు, పారా మిలటరీ బలగాలను దించి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. నిర్బంధాన్ని ఎదుర్కోంటూ రైతుల ఉద్యమం కొనసాగడంతో టాటా మోటార్స్ “నానో” కార్ల ఫ్యాక్టరీని అక్కడినుండి గుజరాత్ రాష్ట్రానికి తరలించింది సింగూరు భూమి అప్పటినుండి టాటా అధ్వర్యంలో కొనసాగుతూ వచ్చింది.
టాటా మోటార్స్ సంస్ధకు ముంబై ప్రతినిధి ఐన దేబశిస్ రే బుధవారం తమ నిర్ణయాన్ని ప్రకటించాడు. కోల్‌కతా హైకోర్టులో సింగూరు భూమి పునఃస్వాధీనానికి వ్యతిరేకంగా కేసు వేయనున్నట్లు ఆయన తెలిపాడు. కేసు ఏ విధంగా వెసేదీ వివరాలను ఆయన వెల్లడించలేదు. దేశ వ్యాపితంగా స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులనుండి పంట భూములను బలవంతంగా వసూలు చేస్తున్నాయి. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని ప్రయోగిస్తూ, భూమి సొంతదారులకు నామ మాత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. జీవనాధారాన్ని కోల్పోయిన రైతులు కూలీలు, కార్మికులుగా మారిపోక తప్పడం లేదు. నష్టపరిహారం తీసుకుని భూముల్ని ఇచ్చిన రైతుల దుర్గతిని చూసిన ఇతర ప్రాంతాల్లోని రైతులు తమ భూముల్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దానితో ప్రభుత్వాలు పోలీసుల్ని, పారా మిలట్రీ బలగాల్ని వినియోగించి బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకుంటున్నాయి.
దేశంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని చట్టాలు చేస్తున్నప్పటికీ పంట భూముల్ని రైతులవద్ద నుంచి లాక్కోవడానికి ప్రభుత్వాలు వెనుదీయడం లేదు. రైతుల్ని మోసపుచ్చడానికి నూతన నష్టపరిహార చట్టాన్ని తెస్తామని ప్రభుత్వాలు చెపుతున్నాయి. స్వాధీనం చేసుకున్న భూముల్లో పెట్టే పరిశ్రమలలో భూములు, ఇళ్ళు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామనీ, వాటా కల్పిస్తామనీ వాగ్దానాలు చేస్తున్నాయి. ఇవన్ని రైతులను మోసగించడానికి తప్ప చిత్తశుద్ధితో చేస్తున్న ప్రకటనలు కావు. మరోవైపు విదేశీ బహుళజాతి సంస్ధలనుండి నూతన ఆర్ధిక విధానాలను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సంస్కరణలను వేగంగా అమలు చేయడం లేదనీ, ప్రభుత్వానికి పక్షపాతం వచ్చిందనీ రాయిటర్స్ లాంటి కార్పిరేట్ వార్తా సంస్ధలు దాదాపు ప్రతిరోజూ ఏదో వంకతో వార్తా కధనాలు ప్రచురిస్తున్నాయి.
రైతుల ఆందోళనలు భారత దేశ పారిశ్రామీకరణకు అడ్డంకిగా మారాయని పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి. దేశంలో అరవై కోట్లకు పైగా ఉన్న రైతుల జీవనాధారాన్ని కొల్లగొట్టి కొద్దిమంది పరిశ్రమల యజమానులకు మాత్రమే వినియోగపడే విధానాలను దేశ అభివృద్ధికి మార్గాలుగా కుట్రపూరితంగా బోధిస్తున్నాయి. తద్వారా తమకు అనుకూలమైన మేధావులని భారత్ లో తయారు చేసుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. దేశంలోని మెజారిటీ ప్రజల జీవనాధారాన్ని దూరం చేసే అభివృద్ధి, అభివృద్ధి కిందికి ఎలా వస్తుందని అడిగేవారికి వీరి నుండి నేరుగా సమాధానం దొరకదు. ఇప్పటికీ 70 శాతానికి పైగా భారత ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న పరిస్ధుతుల్లో, వ్యవసాయ రంగమే ఇంకా ఆధునిక పరికరాలని వినియోగించలేని పరిస్ధుతుల్లో ఉండగా, ఆ రంగాన్ని అభివృద్ధి చేయకుండా నేరురా పారిశ్రామికరణకు పూనుకోవడం ఆత్మహత్యా సదృశమన్న వాస్తవాన్ని పత్రికలు, కుహనా మేధావులు, పాలకులు, విదేశీ కంపెనీల సమర్ధకులు ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తున్నారు.
టాటా మోటార్స్ వ్యవహారం కూడా ఈ కోవలోనిదే. సంవత్సరానికి మూడు పంటలు పండే భూమిని పారిశ్రామికీకరణ పేరుతో టాటాకి అప్పజెప్పి, కొన్ని వేల కుటుంబాల జీవనాన్ని నాశనం చేయడానికి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సిద్ధపడింది. పరిశ్రమలకు ముడి పదార్ధాలు కావాలన్నా, దేశ ప్రజలకు ఆహార భద్రత కావాలన్నా వ్యవసాయరంగాన్ని విస్మరించలేం. పారిశ్రామీకరణకు ముందు షరతు వ్యవసాయ రంగ అభివృద్ధి. దేశంలోని వ్యవసాయదారులంతా వ్యవసాయ పారిశ్రామీకరణ ఫలాలను అందుకునే పరిస్ధితికి వ్యవసాయరంగం అభివృద్ధి చెందేవరకూ పారిశ్రామికరణ అనేది దేశాభివృద్ధికి ప్రతికూలంగా పరిణమిస్తుంది తప్ప అనుకూలంగా ఉపయోగపడదు. భారత దేశ ప్రజల ఆర్ధిక వనరులు వ్యవసాయరంగంలో కొనసాగుతున్న నేపధ్యంలో, విదేశాల్లో సాధించబడిన పారిశ్రామిక వృద్ధిని బలవంతంగా పైనుండి రుద్దడం వలన సమాజ వినాశనం సంబవిస్తుంది తప్ప అభివృద్ధి మాత్రం జరగదు.
కమ్యూనిస్టులకి బొంద పెట్టిన సింగూరు భూముల గూర్చి టాటా పట్టుదలకి పోవటం ఆశ్చర్యకరం . ఈ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని కొంతమంది మధ్యతరగతి మేధావులు అభిలషించారు . కార్ల కంపెనీకి పంటభూములు ఎందుకో అర్ధమై చావట్లేదు !
బహుశా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి అమ్ముకోవడానికేమో! పైగా కొత్త ముఖ్యమంత్రి మమత ఆయన్ని ఆహ్వానించింది కూడానూ.
అమెరికానుండి మమతకి మంచి అడ్మినిస్ట్రేటర్ గా సర్టిఫికెట్ వచ్చిందని వికీలీక్స్ బైటపెట్టింది. అమెరికా దృష్టిలో మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే మార్కెట్ (నూతన ఆర్ధిక) విధానాల్ని సమర్ధవంతంగా అమలు చేయడమే. దీన్ని బట్టి చూస్తే మమత పాలనలో బెంగాల్ ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు.